Idream media
Idream media
అసలు బీజేపీకి ఏమైంది..? ఎందుకిలా జరుగుతోంది..? రెండు పర్యాయాలు కేంద్రంలో విజయ దుందుభి మోగించిన ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా..? వరుస ఓటములను గుర్తిస్తే ఎవరికైనా ఇవే ప్రశ్నలు తలెత్తుతాయి. ఫిబ్రవరిలో పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో విడుదలైన కార్పొరేషన్, పట్టణ, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సోం మినహా మిగతా రాష్ట్రాల్లో కూడా వెనుకబడిన విషయం తెలిసిందే. తాజాగా వెల్లడైన ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలైంది.
మోదీ నియోజకవర్గంలో
ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ఆధిక్యం వచ్చినా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కమలం పార్టీకి ఎనిమిది సీట్లే దక్కాయి. 40 సీట్లున్న వారాణసీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 15 సీట్లను దక్కించుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కి ఐదు, అప్నా దళ్‌కు మూడు, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి ఒకటి, ఇండిపెండెంట్లకు ఎనిమిది సీట్లు దక్కాయి. ఇక్కడ గత ఏడేళ్లలో అభివృద్ధి పనులు భారీగా జరిగినప్పటికీ బీజేపీకి ఎనిమిది సీట్లే రావడం చర్చనీయాంశంగా మారింది.
అయోధ్యలోనూ అంతే
40 సీట్లున్న అయోధ్యలోనూ కమలం పార్టీ తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక్కడ ఎస్పీ 17 చోట్ల గెలుపొందగా.. బీఎస్పీకి నాలుగు, స్వతంత్రులకు పది స్థానాలు దక్కాయి. అలాగే 33 సీట్లున్న మథురలోనూ బీజేపీ ఎనిమిది సీట్లే సాధించడం గమనార్హం. ఇక్కడ బీఎస్పీ 13 స్థానాల్లో గెలుపొందగా.. రాష్ట్రీయ లోక్‌దళ్, ఎస్పీ చెరో సీటును దక్కించుకున్నాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 68 సీట్లున్న గోరఖ్‌పూర్‌లో బీజేపీ, ఎస్పీ చెరో 20 సీట్లను గెలుచుకోగా.. స్వతంత్రులు 23 స్థానాలను దక్కించుకున్నారు. కాంగ్రెస్, ఆప్ చెరో సీటును, బీపీ రెండు సీట్లను దక్కించుకున్నాయి. మరోవైపు జాన్‌పూర్ జిల్లాలోని బక్షాలో పోటీచేసిన 2015 ఫెమీనా మిస్ ఇండియా రన్నరప్ దీక్షా సింగ్ ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి నాగినా సింగ్ ఐదువేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సీటును మహిళకు రిజర్వు చేశారు.
ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా భారతీయ జనతాపార్టీకి చేదు అనుభవాన్ని మిగల్చడం చర్చనీయాంశంగా మారింది. యూపీలో యోగి ఆదిత్యానాథ్ బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ మంచి పట్టున్న వారణాసి, అయోధ్యలో ఆ పార్టీ ప్రాభవాన్ని కోల్పోవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయంగా చాలా కీలకమైన రెండు ప్రదేశాలు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభకు రెండుసార్లు ఎంపికయ్యారు. అయోధ్య గురించి చెప్పాల్సిన పనేలేదు. అయోధ్య పేరు వల్లే భారతీయ జనతా పార్టీ రెండు లోక్‌సభ స్థానాల నుంచి ఈ రోజు దేశంలో తిరుగులేని శక్తి పరిపాలించే స్థాయికి ఎదిగింది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఫలితాలు రావడం పార్టీ శ్రేణులను ఆలోచనల్లో పడేసింది.