iDreamPost
iDreamPost
గత కొన్నేళ్ళుగా ఉదృతంగా ఉన్న బయోపిక్స్ ట్రెండ్ లో భాగంగా మొన్న శుక్రవారం షకీలా సినిమా హిందిలో విడుదలయ్యింది . తెలుగు వెర్షన్ జనవరి మొదటి వారంలో ప్లాన్ చేయబోతున్నారు. టైటిల్ రోల్ రిచా చద్దా చేయగా మరో కీలక పాత్రలో పంకజ్ త్రిపాటి నటించడంతో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. నాట్ ఏ పార్న్ స్టార్ అనే ట్యాగ్ పెట్టిన ఈ సినిమాలో షకీలాను దాదాపు పాజిటివ్ కోణంలోనే చూపించారు. ఒకప్పుడు 90వ దశకంలో అడల్ట్ సినిమాలతో మలయాళం సూపర్ స్టార్లకు సైతం చెమటలు పట్టే పోటీ ఇచ్చిన ఈమె చిత్రాలు తెలుగు డబ్బింగ్ లోనూ భారీగా వసూళ్లు రాబట్టేవి. కొన్నేళ్ళు గట్టి రాజ్యమే నడిపింది.
దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ దీన్ని డర్టీ పిక్చర్ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలని తాపత్రయపడ్డాడు కానీ స్టాండర్డ్ విషయంలో కనీసం అందులో సగం కూడా అందుకోలేకపోయాడు. పైగా షకీలా స్వీయ పర్యవేక్షణలో స్క్రిప్ట్ వర్క్ ప్లస్ నిర్మాణం జరగడంతో అంతా తనకు అనుకూలంగానే ఆవిడ జీవితాన్ని ఆవిష్కరించారు. అయితే అర్థం లేని సన్నివేశాలు, అవసరానికి మించిన సాగతీత, డ్రామా డోస్ ఎక్కువ కావడం లాంటి కారణాలు అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీశాయి. రిచా, పంకజ్ లు తమ పాత్రలను నిలబెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే వాళ్ళ పెర్ఫార్మన్స్ దానికి సహాయపడలేదు.
మొత్తానికి షకీలా బయోపిక్ అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టేసింది. అందరి కథలు సిల్క్ స్మిత అంత గొప్పవి కాలేవని మరోసారి రుజువయ్యింది. అందులోనూ రిచా హీరొయిన్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ప్రేక్షకులు తనను అంతగా ఒన్ చేసుకోలేకపోయారు. తొలుత మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎందుకనో హింది మాత్రం రిలీజ్ చేయగలిగారు. విచిత్రంగా దీని హెచ్డి ప్రింట్ ఆన్ లైన్ రెండో రోజే హల్చల్ చేయడం గమనార్హం, షకీలా మీద విపరీతమైన అభిమానం ఉంటే తప్ప ఇది ఓ మోస్తరుగా కూడా నచ్చే అవకాశాలు లేవు. ఇప్పటిదాకా వచ్చిన అన్ని బయోపిక్స్ లో ఇదే పెద్ద డిజాస్టర్ గా చెప్పుకోవచ్చు.