ఇవాళ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ముంబాయి కి 60 కిలోమీటర్లు దూరంలో రాయఘడ్ జిల్లా పరిధిలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీ కిందికి దూసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షబానాను పన్వేల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకున్నప్పటికీ మితిమీరిన వేగం వల్ల కారు బ్యానెట్ ముందు భాగం బాగా దెబ్బ తినడంతో ఆమె మొహానికి కంటికి తీవ్ర గాయమై, రక్త స్రావం అయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాద సమయాంలో ఆమె భర్త జావేద్ అక్తర్ కూడా ఆమెతో పాటే ఉన్నట్టు సమాచారం. మరోవైపు వారితో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత రాత్రే షబానా తన భర్త, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు. అయితే ప్రమాదం సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే దేశంలోనే మొదటి 6 వరుసల కాంక్రీట్ రహదారి. 94 కిమీ పొడవు గల ఈ రహదారి ముంబై-పూణే నగరాల మధ్య దూరాన్ని 2 గంటలకి తగ్గించింది. గతంలో ఈ రహదారిలో నాలుగు గంటల సమయం పట్టేది. ఇటీవల కాలంలో ఈ హైవే పై వాహనదారుల మితిమీరిన వేగం వల్ల తరుచుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.