Idream media
Idream media
ప్రకాశం జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి.. పార్లమెంట్ జిల్లాల వారీగా కమిటీలను నియమించిన తర్వాత మరింత దిగజారింది. గతంలో సీనియర్‌నేతలు లేదా మాజీ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. వైసీపీ బాటలో పయనిద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్లమెంట్ జిల్లాల వారీగా కమిటీలు వేశారు. అయితే వైసీపీ జిల్లా అధ్యక్షులుగా సీనియర్ నేతలు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులను నియమించగా..టీడీపీ కొన్ని చోట్ల జూనియర్ నేతలను నియమించింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడుగా నూకసాని బాలాజీని నియమించారు. అయితే బాలాజీ నియోజవర్గ ఇంఛార్జిల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
ఒంగోలు పార్లమెంట్ జిల్లా పరిధిలోని కొండపి, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, ఒంగోలు, దర్శి నియోజకవర్గ ఇంఛార్జిలందరూ మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు. జూనియర్ అయిన నూకసాని బాలాజీ నాయకత్వాన్ని వారు ఏ మాత్రం సహించలేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన తొలి కార్యవర్గ సమావేశానికి ఏడు నియోజకవర్గాలకు చెందిన ఏ ఒక్క ఇంఛార్జి కూడా హాజరుకాలేదు. ఇప్పటి వరకు అధ్యక్షుడు బాలాజీపై బయటకు కనిపించకుండా ఉన్న వ్యతిరేకత.. సమావేశానికి గైర్హాజరవడంతో బయటపడింది.
Also Read : ఆ ముగ్గురిపై టీడీపీ క్యాడర్ గుర్రు!
కొండపి నియోజకవర్గానికి చెందిన నూకసాని బాలాజీ తొలుత వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా కొద్ది కాలం పని చేశారు. 2014 పరిషత్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీకి మెజారిటీ వచ్చినా.. అనేక ఎత్తులు, పైఎత్తులు, ఊహించని పరిణామాలతో చైర్మన్ పదవి టీడీపీకి చెందిన ఈదర హరిబాబుకు వైసీపీ మద్ధతుతో లభించింది. నూకసాని బాలాజీ వైస్ చైర్మన్‌పదవితో సరిపెట్టుకున్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ హరిబాబును జడ్పీ చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం తప్పించిన సమయంలో నూకసాని బాలాజీ టీడీపీలోకి ఫిరాయించి జడ్పీ చైర్మన్ అయ్యారు. హరిబాబు కోర్టుకు వెళ్లి తిరిగి పదవి తెచ్చుకోవడంతో బాలాజీ మాజీ అయ్యారు.
ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న బాలాజీని చంద్రబాబు ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడుగా నియమించారు. ఈ నియామకం నియోజకవర్గ ఇంఛార్జిలకు ఏ మాత్రం నచ్చలేదు. కనీసం మాజీ ఎమ్మెల్యే కూడా కానీ బాలాజీ నాయకత్వంలో తాము ఎలా పని చేయగలమనే భావనతో నియోజకవర్గ ఇంఛార్జిలు ఉన్నారు. అందుకే అందరూ కూడబల్కుని కార్యవర్గ సమావేశానికి డుమ్మాకొట్టారని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు బాబు అధ్యక్షుడిని మారుస్తారా..? లేక కొన్నాళ్లు సర్దుకుపోవాలని ఇంఛార్జిలకు చెబుతారా..? చూడాలి.
Also Read : గోదావరి జిల్లాల ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా..?