గాదె వెంకట రెడ్డి చేరికతో వైసీపీకి ఎంత లాభం?

  • Published - 12:12 PM, Mon - 16 March 20
గాదె వెంకట రెడ్డి చేరికతో  వైసీపీకి ఎంత లాభం?

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గాదె వెంకట రెడ్డి ఆయన కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డి తో కలసి నిన్న తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జగన్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరాడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దాదాపు 50 ఎళ్ల పాటు కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన రాష్ట్ర విభజన కు నిరసనగా మొదటిసారి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి 2014 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ లో చేరారు.

అయితే 2014 , 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డి కి బాపట్ల తెలుగుదేశం టికెట్ ఆశించినప్పటికీ దక్కకపోవడంతో, గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. తనకి, తన కుమారుడు మధుసూధన రెడ్డి కి వైసిపి నేతలతో మంచి సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో, తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆయన వైసిపిలో చేరినట్టు తెలుస్తుంది.

గాదె వెంకటరెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం లో గెలుపోటములను సమానంగా చూసిన నేత. రాజకీయాల్లో ఇప్పటికి క్రియాశీలకంగా ఉన్న నేతలలో బహుశా ఆయన కంటే అనుభవజ్ఞుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. స్వతహా గా లాయర్ కావడంతో అసెంబ్లీ ప్రొసిజర్స్ గురించి, అసెంబ్లీ నీయమావాళి గురించి, రాజ్యాంగ సంబధమైన విషయాల పట్ల గట్టి పట్టున్న నేతగా గాదె వెంకట రెడ్డి కి మంచి పేరుంది.

గాదె వెంకట రెడ్డి నేపధ్యం చూస్తే సాధారణ చిన్న రైతు కుటుంబం నుండి వచ్చి, న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, కొన్నాళ్ళు బాపట్లలో ప్రాక్టీసు చేసిన ఆయన ఆ తరువాత కాంగ్రసు లో చేరి 1965 లో 25 ఏళ్ల వయసులోనే పర్చూరు సమితి ప్రసిడెంట్ గా ఎన్నికై సంచలనం సృష్టించాడు. అనంతరం 1967 లో కాంగ్రెస్ పార్టీ తరుపున పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ ఎన్నికల్లోనే భారత మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావు కూడా మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కాగా గాదె వెంకటరెడ్డి పివి నరసింహరావులు ఇద్దరు అప్పటినుండే మంచి మిత్రులు.

తన రాజకీయ జీవితంలో పర్చూరు, బాపట్ల నియోజకవర్గాలనుండి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యి మంత్రిగా నేదురుమల్లి, కోట్ల, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో వివిధ శాఖలు నిర్వహించారు. రాష్ట్రవిభజన అనివార్యం అయిన సమయంలో 2013 నవంబర్ లో కేంద్రలోని అప్పటి యుపిఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత మంత్రుల కమిటి ముందు తెలంగాణా, సీమాంధ్ర ల తరుపున తమ వాదనల వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ తరుపున సీమాంధ్ర తరుపున పాల్గొనే అరుదైన గౌరవాన్ని గాదె వెంకట రెడ్డి దక్కించుకున్నాడు.

ఏది ఏమైనా రాజ్యాంగపరమైన విషయాల్లో, పార్లమెంటరీ ప్రొసిజర్స్ లో అత్యంత అనుభవం గల గాదె వెంకట రెడ్డి లాంటి సీనియర్ పార్లమెంటేరియన్ వైసిపిలో చేరడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సానుకూలాంశంగా చెప్పవచ్చు. అంతేకాక అయన సొంత నియోజకవర్గం పర్చూరు లో వైసిపికి ప్రస్తుతం అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. ఈ తరుణంలో గాదె చేరిక తో పర్చూరు నియోజకవర్గంతో పాటు ఆయనకు మంచి పట్టు ఉన్న బాపట్లలో కూడా వైసిపి బలపడటం ఖాయమని చెప్పవచ్చు.

Show comments