iDreamPost
iDreamPost
బీజేపీ ఏలుబడిలోని అస్సాంకు శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే తన 46 మంది ఎమ్మెల్యేలతో తెల్లవారుజామున 2.30 గంటలకు విమానంలో బయలుదేరడంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం మనుగడ ఇక కష్టమేనని తేలిపోయింది. అసలు బీజేపీకి అవకాశమివ్వడానికి బదులు, ఏకంగా అసెంబ్లీనే రద్దుచేస్తే ఎలాగ ఉంటుంది? ఇది శివసేన ఆలోచన. నిజంగా అసెంబ్లీని రద్దుచేసేటంత బలం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి ఉందా?
మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం బలం 288 మంది. ఇద్దరు జైల్లో ఉన్నారు. ఒకరు చనిపోయారు. అంటే, మొత్తం సంఖ్య 285కి తగ్గింది. ఇప్పటికిప్పుడు విశ్వాస ఓటు జరిగితే, మెజార్టీ మార్క్ 143. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరికి ఉంటే వాళ్లే ప్రభుత్వాన్ని ఎర్పాటుచేయగలరు. ప్రస్తుతం సేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి 152 మంది శాసనసభ్యుల బలముంది.
ఈ కుటమిలో సేన బలం 55 మంది. వీరిలో 40 మంది ఎమ్మెల్యేలు, కూటమికి మద్దతిస్తున్న ఆరుగురు ఇండిపెండెంట్లు అస్సాంలో ఉన్నారు. వీళ్లందరికి లీడర్ ఏక్ నాథ్ షిండే. వీళ్లు కనుక రాజీనామా చేస్తే శివసేన సంఖ్య 15కి తగ్గిపోతుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు తప్పించుకోవాలంటే షిండేకు కనీసం 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అప్పుడు ఈ రెబల్స్ అంతా తమను ప్రత్యేక పార్టీగా గుర్తించమని, స్పీకర్ ను కోరచ్చు. అసలు శివసేన పార్టీయే మాదని తిరుగుబాటుదారులు ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చు. శివసేన గుర్తుకోసం కేసు వేయొచ్చు. బీజేపీ కోరుకొంటోంది ఇదే. శివసేన కార్యకర్తలు రగిలిపోతోంది ఈ విషయంమీదే.
సాధారణ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణను భుజానికెత్తుకొనే ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల్లో వివాదాలు వస్తే, న్యాయనిర్ణేత అవుతుంది. ఆఫీసు బేరర్లు, ప్రతినిధుల మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్లనే అసలు పార్టీగా గుర్తించొచ్చు.
ఇదే కనుక జరిగితే సభలో మహా వికాస్ అఘాడి బలం 112కి తగ్గుతుంది. 46 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, సభలో మెజారిటీ మార్క్ 121 అవుతుంది. ఆ బలం మాకుందికాబట్టి మేమే ప్రభుత్వాన్ని ఎర్పాటుచేస్తామని బీజేపీ ముందుకొస్తుంది. గవర్నర్ వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు.
కాని, ఈ 40 మంది సేన ఎమ్మెల్యేలు పార్టీ మారితే, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాజీనామా చేయాలి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నిక కావాలి. ఇంత శ్రమను తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరుకోవడంలేదు.
అంతెందుకు, ఇలాగే చంద్రబాబు నాయుడు 1995లో ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేసి, టీడీపీని, ప్రభుత్వాన్ని లాక్కొన్నారు. కొన్నేళ్ల క్రితం పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేశారు, ఆ దెబ్బకు ఎన్నికల సంఘం 2017లో అన్నాడీఎంకే గుర్తును స్తంభింపజేసింది. 2021లో చిరాగ్ పాశ్వాన్‌పై తిరుగుబాటు చేసిన పశుపతి కుమార్ పరాస్, లోక్ జనశక్తి పార్టీని చట్టపరంగా సొంతం చేసుకున్నారు. ఇలాగే శివసేనను ఏక్ నాథ్ షిండే కనుక లాక్కొంటే?