Idream media
Idream media
వచ్చే ఏడాది దేశంలో మినీ ఎన్నికల సంగ్రామం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి కాగా, వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, పంజాబ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మార్చి – ఏప్రిల్‌లలో ఐదు రాష్ట్రాలకు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లకు అక్టోబర్, నవంబర్ లలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పైగా ఆ రాష్ట్రాల్లో పంజాబ్ మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉంది. అన్ని చోట్లా అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా పరిస్థితిలో మార్పు వస్తుందా చూడాలి.
ఇటీవల పలు సర్వే రిపోర్టులు వచ్చినా, ఒక్కోటి ఒక్కో తీరుగా ఉంది. ఓ సర్వే బీజేపీ పట్టునిలుపుకుంటుందని పేర్కొంటే, మరొకటి కాంగ్రెస్ పుంజుకుంటుందని వెల్లడిస్తోంది. ఆ సర్వేల ఫలితాలు అలా ఉంచితే ఇటీవలే ముగిసిన మూడు లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీకి చుక్కెదురు కావడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలను నిర్వహించగా అన్నింట్లోనూ ఓడింది. కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలుపొందింది.
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమిపాలైన తీరు.. కమలనాథులను ఆందోళనకు గురి చేస్తోంది.
అధికారంలో ఉండటం, పైగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం కావడం కలకలం రేపుతోంది. దీనిపై జరుగుతున్న సమీక్ష మరిన్ని కలహాలకు దారి తీస్తోంది. అగ్ర నాయకుల మధ్య భేదాభిప్రాయాలకు కారణమవుతోంది. పార్టీలో ఉంటూ కొందరు నాయకులు కాంగ్రెస్‌కు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెన్నుపోటు పొడిచారనే ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. వెన్నుపోటుదారుల వల్లే.. మండీ లోక్‌సభతో పాటు ఫతేపూర్, అర్కి, జుబ్బల్-కట్ఖారి శాసన సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోయిందని పార్టీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇది కాస్తా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీసింది.
జేపీ నడ్డా సొంత రాష్ట్రం అయినా, అధికారంలో ఉన్నా పార్టీ ఓటమిపాలు కావడానికి వెన్నుపోటుదారులే కారణమని సీనియర్లు పరస్పరం ఆరోపణలను సంధించుకుంటున్నారు. అభ్యర్థలు ఎంపికలోనూ ఘోర తప్పిదాలు చోటు చేసుకున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తరహా వివాదాలకు చెక్ పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉప ఎన్నికల్లో జనం మద్దతు లేని నాయకులు లాబీయింగ్ చేసి, టికెట్లను తెప్పించుకోగలిగారంటూ సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. మండీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ భార్య పోటీ చేశారు. గెలిచారు. జుబ్బల్-కొట్ఖారీలో బీజేపీ అభ్యర్థి నీలం సెరాయిక్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ చేతన్ బ్రాగ్టా అనే అభ్యర్థి బీజేపీ రెబెల్‌గా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. అర్కి, ఫతేపూర్‌లల్లో ఇదే పరిస్థితి. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ జయకేతనాన్ని ఎగురవేసింది. దీనిపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇప్పటి నుంచే అప్రమత్తం కాకుంటే చేదు అనుభవాలు ఎదురవుతాయన్న బెంగ బీజేపీ అగ్రనాయకత్వంలో కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించి స్థానిక నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలలో అధిష్ఠానం జోక్యం పెరగనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో కూడా పరిస్థితులు అనుకూలంగా లేవన్న రిపోర్టుల నేపథ్యంలో కొత్త తరహా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి అరెస్టయిన రైతులకు నష్ట పరిహారం ప్రకటించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు ఎలా మారతాయో వేచి చూడాలి.