Idream media
Idream media
సినిమాల్లో హీరో క్యారెక్టర్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటాడు. వారి కష్టాలను తీరుస్తుంటాడు. అందుకోసం ఎంతవరకైనా వెళతాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అలాంటి రియల్ హీరోలు అతి కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారిలో మొదటి స్థానంలో ఉంటారు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి. ప్రజా సమస్యలే ఇతి వృత్తంగా సినిమాలు నిర్మించి, అందరి మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి.. సినిమా పరిశ్రమకు ఎదురైన సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించేందుకు చొరవ చూపి మరోమారు సెహభాష్ అనిపించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి సినిమా థియేటర్లను లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే నడిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా టిక్కెట్లను విక్రయించడం, కనీస వసతులు కల్పించకపోవడం, అధిక ధరలకు తినుబండారాలు విక్రయించడం వంటివి నిత్యకృత్యమైపోయాయి. ప్రజలకు వినోదం అందించాల్సిన చోట.. దోపిడీ జరుగుతున్న విషయాన్ని గుర్తించిన జగన్ సర్కార్.. దానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. థియేటర్లలో ప్రభుత్వం నిర్థారించిన రేట్లకు టిక్కెట్ల ను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఫైర్ సేఫ్టీ, లైసెన్స్ రెన్యూవల్, మౌలిక వసతుల కల్పన వంటివి నిబంధనల మేరకు ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవన్నీ సమకూర్చుకునేందుకు, లోపాలు అధిగమించేందుకు సమయం ఇచ్చింది. ఆ సమయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లు థియేటర్లలో తనిఖీ చేసి, నిబంధల మేరకు లేని వాటిని సీజ్ చేశారు. ఇలా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 83 థియేటర్లు సీజ్ అయ్యాయి.
ఈ పరిణామాలపై సినీ పరిశ్రమలో ఉండే అగ్రనటులు, నిర్మాతలు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. వారి స్పందన సమస్యను పరిష్కరించేలా ఉండకపోగా.. మరింత పెంచేదిగా.. ప్రభుత్వంతో ఘర్షణ కోరుకునేదిగా ఉండడం విశేషం. నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరుతుంటే.. సినీ పరిశ్రమకు ఏమీ వర్తించవనే ధోరణితో వారంతా వ్యవహరించారు. ఈ పరిణామాలను గమనించిన ఆర్.నారాయణ మూర్తి.. సినీ పరిశ్రమను బతికించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సమస్యలను, ఇబ్బందులను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవడం అందరికీ మంచిదని మాట్లాడారు.
అలా మాట్లాడడమే కాదు.. సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. థియేటర్ల యాజమాన్యాలతో కలిసి సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కలిశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్. నారాయణమూర్తి విన్నపంపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. సీజ్ చేసిన 83 థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లలో మౌలిక వసతులు సమకూర్చుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చారు. దీంతో సీజ్ చేసిన థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. అందరిలా సమస్యను పెంచేలా మాట్లాడకుండా.. నిజమైన కళామతల్లి బిడ్డగా.. సినీ పరిశ్రమ బాగుకోసం పని చేసిన ఆర్. నారాయణమూర్తిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read : పెట్రోల్ ధర నిజంగానే తగ్గించారా లేక ప్రచారమేనా?