Telugu News / / Scott Edwards Match Winning Performance Against South Africa In World Cup 2023
82కే 5 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ ఎలా గెలిచింది? డచ్ టీమ్‌లో హీరో ఎవరు?
Author Soma Sekhar Published - 02:18 PM, Wed - 18 October 23
Follow Us
Author Soma Sekhar Published - 02:18 PM, Wed - 18 October 23
|
Follow Us
సినిమా వార్తలు
‘అద్భుతాలు జరిగేముందు ఎవ్వరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ ఈ సామెత అచ్చంగా వన్డే వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లకు సరిపోతుంది. వరల్డ్ కప్ లో ఈ అద్భుతాలు చేసింది పెద్ద జట్లు కాదు.. పసికూన జట్లు. మెున్న ఆఫ్ఘాన్ జగజ్జేత ఇంగ్లాండ్ కు షాకిస్తే.. తాజాగా సౌతాఫ్రికాను కంగుతినిపించింది నెదర్లాండ్స్. ఒకదశలో చూస్తే ఈ మ్యాచ్ లో డచ్ టీమ్ గెలవాల్సింది కాదు. కానీ అసాధారణ రితీలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు చూపిన తెగువ వారిని విజయతీరాలకు చేర్చింది. ఇక 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా నెదర్లాండ్స్ జట్టు.. 245 పరుగుల పోరాడే స్కోర్ చేసిందంటే దానికి ముఖ్య కారణం కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. 69 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 78 రన్స్ చేసి.. టీమ్‌కు మంచి స్కోర్ అందించాడు. కెప్టెన్ ఆడిన సూపర్ ఇన్నింగ్స్‌తో స్ఫూర్తి పొందిన డచ్ టీమ్.. బౌలింగ్‌లో సత్తా చాటింది.
82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పైగా ప్రత్యర్థి మామూలు జట్టు కాదు. వరల్డ్ కప్ లో భీకరఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా టీమ్. స్పీడ్ బౌలర్లకు పెట్టింది పేరు సఫారీ జట్టు. దీంతో నెదర్లాండ్స్ పని అయిపోయింది మహా అయితే ఇంకో 50 పరుగులు చేస్తే గగనమే అని అనుకుని ఉంటారు అందరూ. కానీ ఇక్కడి నుంచే అసలు ఆట మెుదలైంది. 5 వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడే క్రీజ్ లోకి అడుగుపెట్టాడు డచ్ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్. పటిష్టమైన సఫారీ బౌలింగ్ ను ఎదుర్కొంటూ.. స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించాడు. టెయిలెండర్లలతో కలిసి విలువైన స్వల్ప భాగస్వామ్యాలను ఏర్పరుస్తూ.. జట్టు స్కోర్ ను 245 దాక తీసుకొచ్చాడు. ఎడ్వర్డ్స్ ధాటికి డచ్ టీమ్ చివరి 9 ఓవర్లలో 103 పరుగులు సాధించడం విశేషం.
ఇక కెప్టెన్ కు అండగా వాండర్ మోర్వ్(29), ఆర్యన్ దత్(23) మెరుపు బ్యాటింగ్ తో జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు. అనంతరం 246 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాకిచ్చాడు వాండర్ మోర్వ్. భీకరఫామ్ లో ఉన్న డికాక్ ను(16)పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఇక ఇక్కడి నుంచి ఏ దశలోనూ సఫారీ జట్టు విజయం వైపు సాగలేదు. వరసగా వికెట్లు కోల్పోతూ.. ఓటమిని ఖరారు చేసుకుంది. జట్టులో మిల్లర్ ఒక్కడే 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక నెదర్లాండ్స్ బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేసి.. ఈ వరల్డ్ కప్ లో 400కు పైగా స్కోర్ చేసిన జట్టును నిలువరించారు. సమష్టి విజయానికి నిదర్శనంగా నెదర్లాండ్స్ ప్లేయర్లు నిలిచారు.
కాగా.. ఈ మ్యాచ్ కు హీరో ఎవరంటే మాత్రం కచ్చితంగా డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అనే చెప్పాలి. సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్ మీద ఆశలు వదులుకున్న సమయంలో క్రీజ్ లోకి వచ్చి.. అసమాన ప్రదర్శనతో చెలరేగాడు. ఈ మ్యాచ్ కు అతడి ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి డచ్ కెప్టెన్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.