iDreamPost
android-app
ios-app

ఇద్దరు మాజీ మంత్రుల పై ఎస్సీ, ఎస్టీ కేసు

  • Published Jun 13, 2020 | 8:43 AM Updated Updated Jun 13, 2020 | 8:43 AM
ఇద్దరు మాజీ మంత్రుల పై ఎస్సీ, ఎస్టీ కేసు

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చిక్కుల్లో పడ్డారు. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం జరిపించిన నేరంలో వారిపై కేసు నమోదయ్యింది. యనమల స్వగ్రామంలో ఏర్పాటు చేసిన వివాహ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే తనను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో పెళ్లికి చేసిన విషయంలో ఈ తతంగం నడిచింది. రెండో పెళ్లికి సిద్ధపడిన సదరు వరుడు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు కావడం విశేషం.

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పిల్లి అనంతలక్ష్మి మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కన్నబాబు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆమె కుమారుడు పిల్లి రాధా కృష్ణ గతంలో వారి స్వగ్రామం మాధవపట్నానికి చెందిన మంజు ప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నారు. పిల్లి అనంతలక్ష్మి భర్త టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. వారి రెండో కుమారుడికి గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేయాలని చూసిన వ్యవహారం ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలను కూడా కేసుల పాలుజేసింది. ఓవైపు రాష్ట్రమంతా టీడీపీ నేతల అరెస్టుల పర్వం సాగుతుండగా ఇద్దరు కీలక నేతల మెడకు ఇప్పుడు ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు చుట్టుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

పిల్లి అనంతలక్ష్మి దంపతులతో పాటుగా యనమల, రాజప్ప పై కూడా బాధిత ఎస్సీ యువతి మంజు ప్రియ ఫిర్యాదు చేశారు. దాంతో తూగో జిల్లా ఎస్పీ అద్నాన్ సమీ స్పందించారు. మంజు ప్రియ ఫిర్యాదుతో తుని నియోజకవర్గం తొండంగి పొలీసు స్టేషన్ లో ఏడుగురిపై (క్రైం. నెం: 230) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ప్రకటించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 188,506,114,494 r/w 511, 34 IPC. 3(2)(va) sc st poa act, 51(b) bma-2005 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

కేసులో A1 గా బాధితురాలి భర్త పిల్లి రాధకృష్ణ ఉన్నారు. A2: పిల్లి సత్యనారాయణ-మావయ్య, A3.పిల్లి అనంతలక్ష్మీ-అత్త, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ పేర్లు నమోదయ్యాయి. వారితో పాటుగా ఈ పెళ్లికి వేదిక ఇచ్చి స్వగ్రామంలో ఏర్పాట్లు చేసిన టీడీపీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు A4 గా పేర్కొన్నారు. వారి తర్వాత యనమల రామకృష్ణుడు A4 గానూ, నిమ్మకాయల చినరాజప్ప A6 గానూ కేసులో ఉన్నారు. హోం శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తో పాటుగా యనమల కూడా ఈ కేసులో నిందితులుగా చేరడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ మొదలయ్యింది.