iDreamPost
android-app
ios-app

ఈ రోడ్లు ఎవరివి బావా..

  • Published Dec 14, 2020 | 4:29 AM Updated Updated Dec 14, 2020 | 4:29 AM
ఈ రోడ్లు ఎవరివి బావా..

బావా… బావా.. రోడ్లు ఎవరివి బావా.. అంటూ అరుచుకుంటూ వచ్చేసాడు మణి. వస్తూ వస్తూనే గుమ్మంలో ఉన్న నీళ్ళ బకెట్‌ను చూసుకోకుండా తన్నేసాడు. దీంతో పక్కనే ఆరబెట్టిన గుమ్మడి ఒడియాల మీద నీళ్ళు చెదిరి పడ్డాయి. వంట గదిలో ఉన్న వాళ్ళక్క ఒరేయ్‌ ఒడియాలు గానీ తడిపేసావా.. అంటూ అరవడం మొదలెట్టింది. ఏం లేదక్కా అంటూనే.. ఒడియాలు ఆరబెట్టిన చీరను పక్కకి లాగేసి, చేతులు తుడుచుకుండా కిట్టయ్య దగ్గరకొచ్చి పడ్డాడు మణి.

ఏంట్రా బాబూ అంత అర్జంటు వ్యవహారం.. బైట ఒడియాలంట.. మీ అక్క అరుస్తోంది వినబడిందా? అన్నాడు కిట్టయ్య.

అద్సరే బావా.. అసలు నాకో విషయం చెప్పు. రోడ్లు ఎవరివి అంటా మళ్ళీ అడిగాడు కిట్టయ్య.

అదేం ప్రశ్నరా రోడ్లు ఎవరివేంటి.. మనింటి ముందున్న రోడ్డు మనదీ, మీ పెదనాన వెంకట్రామయ్యదీను అన్నాడు కిట్టయ్య.

యహే.. మన రోడ్డు కాదు బావా.. రాష్ట్రంలో రోడ్లు ఎవరి క్రిందకి వస్తాయి. కేంద్రానివా, రాష్ట్రానివా చెప్పు బావా.. అంటూ గారాలు పోసాగాడు మణి.

ఓహో, అదా.. రోడ్లు అంటే.. జాతీయ రహదారులేమో కేంద్రం పరిధిలోకొస్తాయి. ఇతర రోడ్లన్నీ కూడా రాష్ట్ర రిధిలోనికే చెందుతాయి రా. అసలు నీకొచ్చిన అనుమాన మేంటో చెప్పరా బాబూ.. అంటూ నిలదీసాడు కిట్టయ్య.

అది కాదు బావా. రోడ్లు ఇలా పంచేసావ్‌. సరే వీటికి మరమ్మత్తులు గట్రా ఎవరికి చెందినవి వాళ్ళే కదా చేయించాలి అంటూ రెట్టించాడు మణి.

అవున్రా నేషనల్‌ హైవేలను కేంద్రం, రాష్ట్ర పరిధిలోని రోడ్లను రాష్ట్రం బాగు చేయిస్తూ ఉంటాయి. అసలు విషయం ఏంటో చెప్పకుండా ఈ ఆరా తీయడం ఏంట్రా బాబూ.. నీకు ఏం చెబితే ఏం చేస్తావోనని నాక్కొంచెం భయం కూడా వస్తోంది ఈ మధ్య నిన్ను చూస్తుంటే.. అన్నాడు కిట్టయ్య.

అది కాదు బావా.. ఇందాక సెంటర్లోంచి వస్తుంటే ఓ గుప్పెడు బీజేపీ నాయకులు జెండాలు చేత్తో పట్టుకుని రోడ్లను వెంటనే బాగు చేయించాలి, మరమ్మత్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏమీ బాగాలేదు అంటూ నినాదాలు చేస్తుంటే చూసాను బావా. ఇప్పుడు హైవేలతో పాటు అన్ని రోడ్లు పాడైపోయాయి. వీళ్ళేమో రోడ్లు బాగుచేయించాలి అని ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళు ఆందోళన రాష్ట్రం మీద చేస్తున్నట్టా? కేంద్రం మీద చేస్తున్నట్టా? అన్న అనుమానం వచ్చింది బావా.. అందుకే నిన్ను అంతగా ఆరా తీస్తున్నాను అంటూ ఆగాడు మణి.

ఓర్నాయనో అదా నీ బాధ.. ఏం లేదురా సహజంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళలో 90శాతం మందికి ఏ రోడ్డు ఎవరు బాగు చేయించాలో పెద్దగా అవగాహన ఉండదురా. రోడ్డు బాగోలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్నే తిడుతుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఆందోళనలు, మీడియాలో వార్తలు కూడా అదే తీరుగా ఉంటుంటాయి. నిజానికి జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం బాగు చేయించాలి. ఇందుకోసం ఏళ్ళ తరబడి టోల్‌టాక్సులను కూడా భారీగా వసూలు చేస్తోంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు రోడ్లు బాగు చేయించమని ఆందోళనలు చేస్తున్నారంటే కేంద్రం చేయలేకపోతున్న పనిని కూడా రాష్ట్రం మీదికి గెంటేసే ప్రయత్నమన్నమాట. ఏపీలో పాగా వేసేందుకు ప్రజల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో? అన్ని అవకాశాలను బీజేపీ నాయకులు వెతుక్కుంటున్నారనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలిరా మణీ.. అంటూ అసలు విషయం తేల్చేసాడు కిట్టయ్య.

దీంతో విషయం అర్ధమై బిత్తరపోయి చూస్తుండిపోయాడు మణి.