iDreamPost
iDreamPost
ఉదయాన్నే నేను పేపర్ తిరగేస్తుండగా మా అయిదేళ్ళ గడుగ్గాయిగాడు మేడ మెట్ల మీద కూర్చుని రోడ్డున నడుచుకుంటూ వెళుతున్న తోటి పిల్లల్ని షేమ్‌షేమ్‌పప్పీషేమ్.. అంటూ ఆటపట్టిస్తున్నాయి. కరోనా భయం కదా వీడికి బైటకెళ్ళేందుకు అనుమతి లేదు. ఏదో రకంగా రోడ్డున వెళ్ళేవాళ్ళను కెలికి ఆపితే వాడు బైటకు పోవడానికి గేటు తీస్తామేమోన్న అత్యాశ వాడిది. ఇది ఇంట్లో అందరికీ అర్ధమయ్యి పెద్దగా పెట్టించుకోవడం లేదంతే. వీడి తతంగమంతా ఓ చెవిన వినపడుతుండగానే పచ్చపత్రిక ఆంధ్రజ్యోతిలో ఓ ‘అద్భుతమైన’ కథనం కళ్ళబడింది. ఆ తరువాత టీవీలో కూడా దాన్నే ఒలకబోసి వీక్షకుల్ని తడిపేసారనుకోండి.
ఇంతకీ ఆ కథనం సారాంశమేంటయ్యా అంటే పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ, సుజన, కామినేనిలే కాదు. సుజనాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కలిసారు అన్నది. ఎవరెవరు కలిసుంటారా? అంటూ అనుమానంగా కథనం చదివేందుకు స్పీడుగా కళ్ళను ముందుకు కదుపుతున్నాను. మా గడుగ్గాయిగాడి గోల మాత్రం ఆపడం లేదు. షేమ్‌షేమ్ పప్పీషేమ్ అంటూ మోతెక్కించేస్తున్నాడు. రోడ్డుమీద వెళ్ళేవాళ్ళు కూడా తిరిగి సమాధానం చెబుదామనుకుంటున్నారు. కానీ పక్కనే నేను కూడా కన్పిస్తుండడం కొంచెం ఆలోచిస్తున్నారు. ఇక మా వాడు అడ్డే లేకుండా …పప్పీ షేమ్ అంటూ రెచ్చిపోయి కొనసాగించేస్తున్నాడు. ఓ సారి అటు చూసి రేయ్ ఆగరా.. తప్పురా అంటూ చెప్పి మళ్ళీ పేపర్‌లో మునిగా. కథనం చివరికొచ్చిందిగానీ సుజనాను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు? అన్నది మాత్రం అందులో లేదు. ఒక డజను సార్లు మాత్రం ‘వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు’ అని మాత్రం రాసి ఉంది. టీడీపీ సారీ.. సారీ.. ప్రస్తుతం బీజేపీ నాయకులు తప్పితే ఆ కథనంలో ఉన్నది రఘురామకృష్ణంరాజు పేరు, కృష్ణాజిల్లాకు చెందిన ఒక మంత్రి ఆ రెండింటిని మాత్రమే ప్రస్తావించారు.
సాధారణంగా వార్తరాసేటప్పుడు ఎవరి పేర్లైనా బైటకు చెప్పడానికి ఇబ్బందులు ఉండి, ఆ వార్త ప్రేక్షకాదరణ పొందుతుంది అన్న భావన ఉంటే.. పేరు ప్రస్తావించకుండా సదరు వ్యక్తుల్ని సులభంగా గుర్తు పట్టే విధంగా రాస్తుండడం సహజంగా జరిగేది. పార్క్‌హయత్‌కు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు రాయడానికి ఆంధ్రజ్యోతికి అభ్యంతరాలుంటే కనీసం అలా గుర్తుపట్టే విధంగానైనా రాసుండొచ్చు. అదీ జరగలేదు.
ఈ సారి మా గడుగ్గాయిగాడికి కౌంటర్ పడింది. రోడ్డు మీద నుంచున్న ఒక కుర్రాడొకను నువ్వే పప్పీషేమ్ అంటూ తిరిగి గట్టి సమాధానమే ఇచ్చాడు. మా వాడు కూడా ఈ సారి ఇంకొంచె గొంతు పెంచాడు.
అరె ఇంత తలాతోకా లేకుండా కథనాలెట్టా రాస్తారబ్బా అనుకున్నా. అలా అనుకున్నదే తడవుగా ఎన్నికల ముందు పచ్చమీడియాలో అచ్చైన, ప్రసారమైన కథనాలు ఒకొక్కటిగా గుర్తుకొచ్చాయి. చంద్రబాబు ఫోటోయే బ్రాండ్, పెట్టుబడులు వెల్లువెత్తిపోతున్నాయి, 5వేల కోట్లు పెట్టుబడి పెట్టే షరాబొకడు ఆంధ్రాకొస్తున్నాడు, ప్రధాని గుజరాత్‌లో పెట్టమంటే, కాదు ఆంధ్రాలోనే పెడతానంటున్నాడు, ప్రధానిని ధిక్కరించిన ఒకే ఒక్క మొనగాడు చంద్రబాబే, గాలి కాంగ్రెస్‌వైపే ఉంది, లోకేష్‌బాబు పనితీరు చూసి ఐఏఎస్‌లే ఖంగుతింటున్నారు, టీడీపీ గెలిచేయడం ఖాయం, ఇక్కడ లోకేష్‌బాబు తిప్పుతారు, సెంట్రల్‌లో చంద్రబాబు తిప్పుతారు చక్రాలు.. ఇలా గుర్తు చేసుకుంటే చాలానే ఉన్నాయిగా అనుకున్నాను.
ఈ లోపు మా బుడ్డోడు నా దగ్గరకొచ్చి ‘నాన్నా.. పప్పీ షేమే కదా..’ అంటూ అడిగాడు రోడ్డుమీద వీడికి కౌంటరిస్తున్న కుర్రాడ్ని ఉద్దేశిస్తు. నేను కూడా అవున్రా ‘పప్పీషేమ్’ అన్నాను పచ్చపేపర్‌లో కథనాన్ని చూస్తూ. లేకపోతే వీడు ఇంట్లోకి వచ్చేలా లేడు. కౌంటర్‌లు ఇచ్చేందుకు రోడ్డుమీదున్న కుర్రగేంగ్ సిద్ధమైపోతోంది మరి.