Idream media
Idream media
అన్నీ కలిసి వస్తే తమిళనాట చక్రం తిప్పాలని భావించారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ. జయలేని పార్టీని అన్నీ తానై నడిపించాలని ఆశపడ్డారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. కానీ కాలం కలిసి రాక.. జైలుజీవితం గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన శశికళ పొలిటికల్ ఎంట్రీకి భారీగానే ప్లాన్ వేశారు. వ్యూహాత్మకంగా చర్యలన్నీ చేపడుతూ వచ్చారు. తమిళనాడులో అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తారనుకుంటే.. అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేకెత్తించారు.
చిన్నమ్మ పెద్దరికాన్ని ఏ మాత్రం ఇష్టపడని ఫళనిస్వామి , పన్నీరుసెల్వం ఆమె వ్యూహాలకు ఎప్పటికప్పుడు అడ్డుపడ్డారు. దానికి తోడు తనని పదే పదే నిలువరిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ప్రతికూలంగానే వున్నారు. దాంతో చేసేదేమీ లేక ఫ్యూచర్‌లో చూసుకుందామనుకుందో ఏమో ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు శశికళ.
తొలుత పోస్టర్లు.. ఆ తర్వాత ఆడియోలు
తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయినప్పటి నుంచీ శశికళ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ మేరకు మూడు నెలల క్రితమే పుదుక్కోట్టై ప్రాంతంలోను అన్నాడీఎంకే కార్యకర్తల తరఫున పోస్టర్లు అతికించారు. ఎంజీఆర్ రూపొందించిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు. అన్నాడీఎంకే పార్టీని గట్టెక్కించాలంటే చిన్నమ్మ అలియాస్ శశికళ వంటి బలమైన, వ్యూహకర్త సారథ్యం అవసరమని పార్టీ లోని కొందరు బహిరంగంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. స్టాలిన్ లాంటి దిగ్గజ, సీనియర్ నేత వ్యూహాల నుంచి అన్నా డిఎంకేను కాపాడుకోవాలంటే చిన్నమ్మ సారథ్యం అవసరమని అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
పునరాగమనంపై త్వరలో నిర్ణయం
అన్నాడీఎంకే నేతల్లో ఐకమత్యం లేకపోవడం వల్లే పార్టీ క్షీణదశకు చేరుకుందని, ఇలాంటి పరిస్థితిలో పార్టీని వదిలెయ్యలేనని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ స్పష్టం చేశారు. తన రాజకీయ పునరాగమనంపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రకటించారు. ఇటీవల అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలతో శశికళ మాట్లాడుతున్న ఆడియోలు వరుసగా బహిర్గతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడిన మరో ఆడియో టేపు కూడా మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
పార్టీలో ఐకమత్యం లోపించిందట
అందులో ఓ కార్యకర్తతో మాట్లాడిన శశికళ… అన్నాడీఎంకే దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. నేతల్లో ఐకమత్యం లోపించడం వల్లే అన్నాడీఎంకే పరాజయం పాలైందని విశ్లేషించారు. మున్ముందు కూడా ఇలాగే కొనసాగితే అన్నాడీఎంకే కనుమరుగైపోతుందని, అందుకే తాను ఇంకా చూస్తూ ఊరుకోలేనని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని తనపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేదని, తనకు తానే స్వయంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. త్వరలోనే జయలలితకు భారీ ఆలయం నిర్మించతలపెట్టానని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని శశికళ వివరించారు. ఇప్పటి వరకూ ఆమె అన్నట్లుగా ఆడియోలు వైరల్ కావడమే తప్ప.. బహిరంగంగా చిన్నమ్మ మాట్లాడింది లేదు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.