iDreamPost
android-app
ios-app

శ‌శిక‌ళ ఎ’జెండా’ సిద్ధ‌మైందా..?

శ‌శిక‌ళ ఎ’జెండా’ సిద్ధ‌మైందా..?

బెంగళూరులోని ఓ ఫాం హౌస్ వేదికగా రీ ఎంట్రీకి శశికళ స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ మేర‌కు అక్క‌డే కొంద‌రు ప్ర‌ముఖులు, న్యాయ నిపుణుల‌తో ఆమె చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. దీనిలో భాగంగానే పార్టీ అన్నాడీఎంకే రెండాకుల గుర్తు, జెండా త‌న తొలి ఎజెండాగా ఆమె పావులు క‌దుపుతున్నారు. 2017లో పార్టీ పేరును, రెండాకుల గుర్తును పళనిస్వామి వర్గానికి ఈసీ కేటాయించడంపై సుప్రీం కోర్టులో సవాల్ చేయబోతున్నట్లు శశికళ తరపు న్యాయవాది రాజా సెంతూర్ పాండియన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో తమిళనాడు రాజకీయం వేడెక్కింది. ఎలాగైనా పార్టీ గుర్తును, పార్టీని వశం చేసుకొని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని చిన్నమ్మ ఉత్సాహంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆమె విశ్రాంతి తీసుకుంటున్న బెంగుళూరు సరిహద్దు ప్రాంతమైన దేవనహళ్లి ఫాం హౌస్‌ వద్దకు భారీగా ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. అయితే క్వారంటైన్‌లో వుంటున్న శశికళ వారెవ్వరినీ కలవడం లేదు. కొంత మంది ముఖ్యుల‌తో మాత్ర‌మే ఆమెతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. దీనిపై ప‌లు ర‌కాల వార్త‌లు వెల్లువెత్తుతుండ‌డంపై పళనిస్వామి వ‌ర్గంలో క‌ల‌క‌లం మొద‌లైంది.

వీడియో గ్రాఫ‌ర్ నుంచి…

శశికళ నటరాజన్.. ఈ పేరు పాజిటివ్ గా కంటే, నెగటివ్ గానే ఎక్కువగా ప్రజల నోళ్లలో నానింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం అల‌జ‌డి సృష్టిస్తూనే ఉంది. అసలు జయకు శశికళఎలా పరిచమయ్యారు. జయ ఆమెను ఎందుకంతగా నమ్మారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి పదవి చేపట్టకుండానే సీఎం సీటు వరకు వచ్చిన శశికళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది ఇప్పుడు త‌మిళ‌నాట కంటే ఇత‌ర రాష్ట్రాల‌లోనే ఎక్కువ‌గా ఆస‌క్తిక‌రంగా మారింది. 1957లో తిరుత్తురైపుందిలో ఓ సాధారణ కుటుంబంలో శశికళ జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం మన్నార్ గుడికి వలస వెళ్లింది. ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసిన శశికళ, అక్కడ చిన్న వీడియో పార్లర్ నడిపేవారు. అక్కడే ప్రభుత్వ పీఆర్వోగా పని చేసే నటరాజన్ తో ఆమెకు పరిచమైంది. డీఎంకే అధినేత కరుణానిధి సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత నటరాజన్ సాయంతో పార్టీ సమావేశాలు రికార్డు చేసే కాంట్రాక్టులు తీసుకునేవారు శశికళ. జయలలితకు మంచి స్నేహితురాలైన కడలూరు జిల్లా కలెక్టర్ చంద్రలేఖ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నారు శశికళ. ఆ తర్వాత వారిద్దరి స్నేహం పెరిగింది. జయకు సంబంధించిన అన్ని రాజకీయ సభల వీడియాలు తీస్తూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే మన్నార్ గుడి నుంచి పోయెస్ గార్డెన్ కు మకాం మార్చారు.

పంపించి మ‌ళ్లీ పిలిపించి…

ఇక ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, జయ సీఎం కావడం శశికళను మరింత కలిసొచ్చింది. జయలలితకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను శశికళ చూసుకునే వారు. అంతేకాదు ఆమె మేనల్లుడైన సుధాకరన్ ను జయకు దత్తతిచ్చారు. ఒక పక్క జయలలిత సీఎంగా తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న సమయంలోనే శశికళ కూడా తన బలాన్ని పెంచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాకపోయినా.. తెరవెనుక ఉండి చక్రం తిప్పుతూ చిన్నమ్మ పేరు పొందారు. జయలలిత వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే క్రమంలో, భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఇక ఆమె భర్త నటరాజన్ పై, ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటూ, ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జయపై నమోదైన అక్రమాస్తుల కేసులోనూ శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కలర్ టీవీ స్కాంలో జయతో పాటూ ఆమె కూడా 30 రోజుల పాటూ జైలు శిక్షను అనుభవించారు. అటు రెండు సార్లు శశికళ కుటుంబాన్ని పోయెస్ గార్డెన్ నుంచి బహిష్కరించారు. 2011లో శశికళతో పాటూ ఆమె భర్త నటరాజన్ ను, దత్తపుత్రుడు సుధాకరన్ ను, మరో 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై జయ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొంతకాలం జయ శశికళను దూరం పెట్టినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ఆమెను పిలిపించుకుని అక్కున చేర్చుకున్నారు.

జ‌య ద‌గ్గ‌ర ఉన్న ఒకేఒక వ్య‌క్తి..

సెప్టెంబర్ లో జయ ఆస్పత్రి పాలైనప్పటి నుంచి, పార్టీ కార్యక్రమాలను అనధికారికంగా శశికళే చూసుకున్నారని అంతా చెప్పుకుంటారు. అంతేకాదు ఆమె చికిత్స సమయంలో జయ దగ్గర ఉన్న ఒకే వ్యక్తి శశికళ. జయ మరణించిన తర్వాత ఆమె అంత్యక్రియలు నిర్వహించింది కూడా చిన్నమ్మే. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, మరికొద్ది రోజులకు శాసన సభ పక్ష నేతగా ఎన్నికవడం అంతా నాటకీయంగా జరిగిపోయింది. అంతేకాదు జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా శశికళ సిద్ధ‌మ‌య్యారు. అంత‌లోనే లెక్క‌కు మించిన ఆస్తుల కేసులో జైలుపాలుకావ‌డంతో ఆమె రాజ‌కీయ జీవితానికి బ్రేకులు ప‌డ్డాయి. జైలుకు వెళ్తూ.. జ‌య‌ల‌లిత మాదిరిగానే ప‌ళ‌నిస్వామికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు శ‌శిక‌ళ‌. ఆ త‌ర్వాత బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆమెనే పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు ప‌ళ‌నిస్వామి.

రాజ‌కీయం మ‌ళ్లీ మొద‌లు..

జయలలిత వారసురాలిగా తనను తాను శశికళ నిరూపించుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఆమె ఆరితేరాల్సి ఉంది. పార్టీ పగ్గాలు చేపట్టడం కన్నా అసలు సిసలు సవాళ్లను ఇకముందు ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది జయలలిత ఎదుర్కొన్న రాజకీయ ప్రస్థానం కన్నా కష్టతరమైనది కావొచ్చు. మొదటగా చెప్పాలంటే జయలలిత తరహాలో శశిక‌ళ‌కు సినీ ఛరిష్మా లేదు. జయకు ఉన్నంత రాజకీయ అనుభవం కూడా లేదు. ఎప్పుడూ ముభావంగా ఉన్న‌ట్లు క‌నిపించే ఆమె ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకోగలరా? అన్నది సందేహాస్పదమే. అయితే శ‌శిక‌ళ మాత్రం జైలు నుంచి విడుద‌ల‌య్యాక బెంగ‌ళూరులోని ఫామ్ హౌస్ వేదిక‌గా రాజ‌కీయాలు ప్రారంభించారు. అన్నాడీఎంకే పార్టీపై ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తున్నారు. అటు శశికళకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు కూడా వెలియ‌డంతో అన్నాడీఎంకే లో అల‌జ‌డి మొద‌లైంది. ఇప్ప‌టికే ఈ పోస్టర్లు అంటించిన నేతలపై అన్నాడీఎంకే పార్టీ చీఫ్ సీఎం ఫళని స్వామి సీరియస్ అయ్యారు. పోస్టర్లు వేసిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

వేచి చూడండి.. ‘చిన్న‌మ్మ’‌దే కీల‌క పాత్ర‌..

అన్నాడీఎంకే మాజీ నేత శశికళ ఈనెల 7న బెంగళూరులో క్వారంటైన్ పూర్తి చేసుకుని తమిళనాడు వస్తారని ఆమె మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేత టీటీడీ దినకరన్ తెలిపారు. ఎన్నికల తర్వాత తిరిగి ‘అమ్మ’ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో శశికళ కీలక భూమిక పోషించనున్నారని చెప్పారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, జయలిలత నిజమైన మద్దతుదారులంతా శశికళ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని హోసూరు నుంచి చెన్నై వరకూ శశికళకు ఘనంగా స్వాగతం పలకనున్నట్టు చెప్పారు. శశికళ విడుదలైన రోజు నుంచి ‘రాజకీయ ఎరీనా’లో ‘కెమికల్ రియాక్షన్’ మొదలైందని, జయలలిత స్మారక ప్రారంభం హడావిడిగా జరపడం వంటి కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయని దినకరన్ తెలిపారు. జయలలిత మెమోరియల్‌ను సందర్శించాలని శశికళ ప్లాన్ చేశారని, అయితే ఇప్పుడు అది మూసి ఉంచారని, దీని వెనుక ఏదో కారణం ఉండొచ్చని అన్నారు. శశికళ నిర్వహించిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, పార్టీ నిబంధనావళి ప్రకారం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదని, జనరల్ సెక్రటరీ మాత్రమే జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని సమాధానమిచ్చారు. అయితే అన్నాడీఎంకే ఫంక్షనరీలు జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేశారని, దీనిని శశికళ కోర్టులో సవాలు చేశారని, తన పదవిని పునరుద్ధరించే విషయంలో ఆమె పోరాటం కొనసాగిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో శశికళ పోటీ చేసే అవకాశం లేద‌ని, లీగల్ పరంగా వెసులుబాటు ఉంటుందా అనే విషయంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. తాజాగా దిన‌క‌రన్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో త‌మిళ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది.