iDreamPost
android-app
ios-app

త‌మిళ చిన్న‌మ్మ రీ ఎంట్రీ..?

త‌మిళ చిన్న‌మ్మ రీ ఎంట్రీ..?

జైలు నుంచి విడుద‌ల‌య్యాక త‌మిళ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టంచిన శ‌శిక‌ళ అలియాస్ చిన్న‌మ్మ కొద్ది రోజుల త‌ర్వాత అనూహ్యంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. దీని వెనుక బీజేపీ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని, కేసులు, అనారోగ్య స‌మ‌స్య‌లు కార‌ణ‌మని ప‌లు వాద‌న‌లు ఉన్నాయి. వాటి సంగ‌తి ప‌క్క‌న బెడితే.. ఇటీవ‌లే అక్క‌డ డీఎంకే ప్ర‌భుత్వం కొలువుదీరింది. బీజేపీతో పొత్తుతో పోటీ చేసిన అన్నాడీఎంకే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తోంది. శాస‌న‌స‌భ‌ప‌క్ష నేత ప‌ద‌వి కోసం ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం ప‌ట్టుబ‌ట్టారు. దీనిపై తీవ్ర‌మైన రాద్దాంత‌మే జ‌రిగింది. చివ‌ర‌కు ఫళనిస్వామి తమిళనాడు అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నుకునే లోపే చిన్న‌మ్మ రీ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వెలిసిన పోస్ట‌ర్లు దీనికి నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నాడీఎంకే ప్రతిపక్షనేత పదవికి తీవ్ర పోటీ ఏర్ప‌డింది. ఓ ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, ఎడపాడి పళనిస్వామి వర్గం ఈ విష‌య‌మై వాగ్వాదానికి కూడా దిగాయి. మూడు రోజుల క్రితం ఎడపాడి పళనిస్వామి కారును ఓపీఎస్‌ వర్గం అటకాయించి నినాదాలు చేసింది. ఆ తర్వాత అన్నాడీఎంకే నిర్వాహకుల సమావేశంలోను విపక్ష నేత ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంలో శశికళ తెరవెనుక నుంచి ఓపీఎస్‌కు మార్గదర్శకం చేస్తున్నట్లు వార్తలు వెలువడడంతో సంచలనం ఏర్పడింది. ఇదిలా ఉండ‌గా, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. వీటి వెనుక పన్నీరు సెల్వం అనుచరుల హస్తమున్నట్లు ప్రచారం జరిగింది. ఫళనిస్వామిని పరోక్షంగా హెచ్చరికలు పంపేదుకే శశికళను స్వాగతిస్తూ పోస్టర్లు అతికించినట్లు భావించారు. పోస్టర్ల ప్రభావమో లేక మరే కారణమైదేనా వుందేమో కానీ మే 10న మధ్యాహ్నానికి ఓపీఎస్-ఈపీఎస్ మధ్య సయోధ్య కుదిరింది. మాజీ ముఖ్యమంత్రి ఫళనిస్వామియే అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. పన్నీరు సెల్వం ఈ విషయంలో వెనక్కి తగ్గారు.

అలాగే పుదుక్కోట్టై ప్రాంతంలోను అన్నాడీఎంకే కార్యకర్తల తరఫున పోస్టర్లు అతికించారు. ఎంజీఆర్‌ రూపొందించిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు. అన్నాడీఎంకే పార్టీని గట్టెక్కించాలంటే చిన్నమ్మ అలియాస్ శశికళ వంటి బలమైన, వ్యూహకర్త సారథ్యం అవసరమని పార్టీ వర్గాలిప్పటికే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. స్టాలిన్ లాంటి దిగ్గజ, సీనియర్ నేత వ్యూహాల నుంచి అన్నా డిఎంకేను కాపాడుకోవాలంటే చిన్నమ్మ సారథ్యం అవసరమని అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో వున్న అన్నా డిఎంకే పరాజయాన్ని ముందే ఊహించి.. కొందరు ఢిల్లీ పెద్దల సలహా మేరకు రాజకీయ సన్యాసం తీసుకున్న చిన్నమ్మ తిరిగి తెర‌వెనుక రాజ‌కీయం న‌డిపిస్తున్నార‌న్న వాద‌న‌లు కూడా ఉన్నాయి.

జయలలిత మరణానంతరం పార్టీపై పట్టు సాధించినా.. కాలం కలిసి రాక జైలు పాలైన శశికళ ఎన్నిక‌ల ముందే విడుద‌లైన‌ప్ప‌టికీ టైం క‌లిసిరాలేదు. పార్టీలో పట్టు సాధించే సమయం లేకుండానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దానికి తోడు చిన్నమ్మ పెద్దరికాన్ని ఏ మాత్రం ఇష్టపడని ఫళనిస్వామి , పన్నీరుసెల్వం చిన్నమ్మ వ్యూహాలకు అడ్డుప‌డ్డారు. దానికి తోడు తనని పదే పదే నిలువరిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ప్రతికూలంగానే వున్నారు. దాంత చేసేదేమీ లేక ఫ్యూచర్‌లో చూసుకుందామనుకుందో ఏమో ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు శశికళ. కాలం గిర్రున తిరిగింది. ఎన్నిక‌లు అయిపోయాయి. అన్నాడీఎంకే ఓడిపోయింది. డీఎంకే అధికారంలోకి వ‌చ్చింది. ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన శశికళ (చిన్నమ్మ) తెరచాటు రాజకీయాలను మాత్రం కొనసాగిస్తూనే వుంది. పరోక్షంగా అన్నాడీఎంకేపై ప‌ట్టుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తాజా స‌మీక‌ర‌ణాలు తెలియ‌జేస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆమె పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌న్న వార్త‌లు త‌మిళ‌నాటు గుప్పుమంటున్నాయి.