iDreamPost
android-app
ios-app

త‌ప్ప‌కుండా వ‌స్తా.. అన్నీ సెట్ చేస్తానంటున్న చిన్న‌మ్మ‌!

త‌ప్ప‌కుండా వ‌స్తా.. అన్నీ సెట్ చేస్తానంటున్న చిన్న‌మ్మ‌!

ఎన్నిక‌ల‌కు ముందు జైలు నుంచి విడుద‌లై అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న శ‌శిక‌ళ అలియాస్ చిన్న‌మ్మ రాజ‌కీయాలకు విరామం ఇస్తున్న‌ట్లు కొద్ది రోజులకే ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయింది. దీంతో చిన్న‌మ్మ రీ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 20 రోజుల క్రితం భారీ ఎత్తున పోస్ట‌ర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా ఆమె మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా అని చెప్పిన‌ట్లుగా ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. త‌మిళ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అన్నాడీఎంకే పార్టీని గట్టెక్కించాలంటే చిన్నమ్మ అలియాస్ శశికళ వంటి బలమైన, వ్యూహకర్త సారథ్యం అవసరమని పార్టీలోని ఓ వ‌ర్గం బహిరంగంగానే మాట్లాడుతోంది. స్టాలిన్ లాంటి దిగ్గజ, సీనియర్ నేత వ్యూహాల నుంచి అన్నా డిఎంకేను కాపాడుకోవాలంటే చిన్నమ్మ సారథ్యం అవసరమని అంటోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో వున్న అన్నా డిఎంకే పరాజయాన్ని ముందే ఊహించి.. కొందరు ఢిల్లీ పెద్దల సలహా మేరకు రాజకీయ సన్యాసం తీసుకున్న చిన్నమ్మ తిరిగి తెర‌వెనుక రాజ‌కీయం న‌డిపిస్తున్నార‌న్న వాద‌న‌లను ఇప్పుడు బ‌లం చేకూరుతోంది.

జయలలిత నెచ్చలి.. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే ఓటమి నేపథ్యంలో మళ్లీ తాను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు అన్నాడీఎంకే దారుణంగా ఓడిపోయిన వేళ శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి శశికళ మాట్లాడిన ఓ ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఎవరూ ఆందోళన చెందొద్దు. పార్టీని తప్పకుండా చక్కబెడుతాను. ధైర్యంగా ఉండండి. కరోనా ముగిసిన తర్వాత మళ్లీ నేను వస్తాను’ అని శశికళ సదురు ఆడియోలో చెప్పారు. దీనికి మీ వెంటే మేముంటాం అని కార్యకర్తలు అన్నట్టుగా ఆడియోలో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లోగా అన్నాడీఎంకేను టేకప్ చేసి ప్రస్తుత సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ ను ఓడించేందుకు శశికళ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.