iDreamPost
android-app
ios-app

Sasikala, AIADMK – అన్నాడీఎంకేలో ఆధిపత్య రాజకీయం.. ఎత్తుకు పైఎత్తు వేసిన శశికళ

Sasikala, AIADMK – అన్నాడీఎంకేలో ఆధిపత్య రాజకీయం.. ఎత్తుకు పైఎత్తు వేసిన శశికళ

తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైన శశికళ.. మళ్లీ అన్నాడీఎంకే పై పట్టుసాధించి చక్రం తిప్పాలని యత్నించారు. అయితే అనూహ్యంగా రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఎన్నికల తర్వాత మళ్లీ యాక్టివ్‌ అయిన చిన్నమ్మ.. పార్టీపై పట్టు కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

అదే సమయంలో పార్టీ.. శశికళ చేతిలోకి వెళ్లకుండా అన్నాడీఎంకేలోని ఇద్దరు ముఖ్యనేతలు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంలు ఎత్తులు వేస్తున్నారు. ఇకపై పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి అనేది లేకుండా పార్టీ రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించారు. సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పోస్టులను శాశ్వతం చేశారు. ఇద్దరు నేతలు విభేదాలను పక్కనబెట్టి.. పార్టీ చేజారకుండా ఉండేందుకు రాజీకి వచ్చారు. పన్నీర్‌ సెల్వంకు సమన్వయకర్త పదవి ఇచ్చేందుకు, తాను ఉప సమన్వయకర్తగా, ప్రతిపక్ష నేతగా ఉండేందుకు పళని స్వామి సిద్ధమయ్యారు.

Also Read : AIADMK – ఏడీఎంకే రాజ్యాంగం మార్పు.. ప్రధాన కార్యదర్శి పదవికి చెల్లు

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేసేందుకు సిద్ధమైన వేళ.. శశికళ వారి ఎత్తులకు పై ఎత్తులు వేశారు. అన్నాడీఎంకే అధినేతగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ రోజు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను శశికళ కలిశారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న రజనీని ఆయన ఇంటికి వెళ్లి శశికళ పరామర్శించారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ లెటర్‌ హెడ్‌పై తెలిపారు. ఆ లెటర్‌ హెడ్‌లో శశికళ, అన్నాడీఎంకే అధినేతగా పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పుడు అన్నాడీఎంకేలో సంచలనం రేపుతోంది. శశికళను పార్టీకి దూరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఆమె మాత్రం పట్టువిడవడంలేదు. ఈ క్రమంలోనే ఆమె రజనీకాంత్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.

పరామర్శ పేరుతో రజనీకాంత్‌ను శశికళ కలిసినా.. దీని వెనుక రాజకీయకోణం ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో శశికళ దూకుడును పెంచి.. అన్నాడీఎంకే ను హస్తగతం చేసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు.. ఇరు వర్గాల మధ్య రాజకీయ వాతావరణం హీటెక్కే అవకాశం లేకపోలేదు. ఆ సమయంలో రజనీకాంత్‌ అభిమానులు తనకు మద్ధతు తెలిపేలా శశికళ.. ఈ తరహా పరామర్శ రాజకీయం చేశారనే అంచనాలున్నాయి. రజనీకాంత్‌ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం స్టాలిన్‌ వెళ్లి కలిశారు. అన్నాడీఎంకే తరఫున ఎవరూ వెళ్లలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న శశికళ.. ఈ రోజు నేరుగా రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో తనకు లాభిస్తుందనే అంచనాతో ఆమె ఉన్నట్లున్నారు.

Also Read : AIADMK – చేతులు క‌లిపిన ప‌న్నీర్ , ప‌ళ‌ని.. చిన్న‌మ్మ‌కు చెక్ పెట్టేనా?