iDreamPost
iDreamPost
గత కొద్దిరోజులుగా లవ్ స్టోరీ సినిమాలో సారంగదరియా పాట మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం రేలారే కార్యక్రమం ద్వారా గాయని కోమలి దీన్ని వెలుగులోకి తెచ్చినప్పుడు ఇది సామాన్య జనానికి పెద్దగా తెలియదు. ఆ ప్రోగ్రాంని ఫాలో అయినవాళ్లు తప్ప ఇంకెవరికి అవగాహన లేదు. కానీ ఇప్పుడంతా టెక్నాలజీ ప్రపంచం. క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతోంది. వైరల్ కావడానికి అట్టే సమయం పట్టడం లేదు. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఏదో ఒక టాపిక్ మీద హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకే చార్ట్ బస్టర్ గా దూసుకుపోతున్న సారంగదరియా కూడా ఇప్పుడు కొత్త చర్చలకు వేదికగా మారింది.
గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ గీతం గురించి వివరణ ఇచ్చినప్పటికీ అది వ్యవహారాన్ని చల్లార్చకపోగా ఇంకాస్త వేడిని రాజేసింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ట్విట్టర్ లో కోమలికి క్రెడిట్స్ ఇచ్చారు కానీ అఫీషియల్ మ్యూజిక్ వీడియోలో ఎక్కడా ఆమె గురించి ప్రస్తావన తేకపోవడం విమర్శలనూ తెచ్చింది. ఇది తప్పా ఒప్పా అనేది ఎవరూ నిర్ణయించలేరు. అశోక్ తేజ కూడా కేవలం పల్లవిని తీసుకోగా సంగీత దర్శకుడు పవన్ తాను స్వంతంగా కంపోజ్ చేసినట్టు కూడా చెప్పుకోలేదు. కాబట్టి ఎంతో కొంత నైతికతనైతే పాటించారనే చెప్పాలి. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారా అంటే కాదనే చెప్పాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
అల వైకుంఠపురములో రాములో రాములా, మురారిలో గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మడి, అక్కాచెల్లెళ్లులో పాండవులు పాండవులు తుమ్మెద, అర్ధరాత్రి స్వాత్రంత్యంలో ఏం పిల్లడో ఎల్దమోస్తవా, దసరా బుల్లోడులో నల్లవాడే అల్లరి పిల్లవాడే తదితర పాటల పల్లవులన్నీ గత చరిత్రలో ఎందరో మహాకవులు రాసిన సాహిత్యం నుంచి తీసుకున్నావే. ఒకటి రెండు లైన్లు లేదా పల్లవి మాత్రం తీసుకుని మిగిలిన చరణాలు మాత్రం కొత్తగా రచయిత కూర్చుతాడు. ఇలా వందల దాఖలాలు ఉన్నాయి. కేవలం సారంగదరియా పాట విషయంలో మాత్రమే ఇలా జరిగిందనడంతో లాజిక్ లేదు. ఇదంతా ఎలా ఉన్నా సినిమా మీద అంచనాలు పెరగడంలో మాత్రం దీని పాత్ర చాలా కీలకంగా మారిపోయింది