iDreamPost
android-app
ios-app

క్రీడా ప్రేమికుడు పీఆర్‌ మోహన్‌

క్రీడా ప్రేమికుడు పీఆర్‌ మోహన్‌

టీడీపీ నేత, శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ (71) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన టీడీపీ నేతగా కంటే.. క్రీడా ప్రేమికుడుగానే ఎక్కువగా సుపరిచితులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పీఆర్‌ మోహన్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానమే మోహన్‌ను టీడీపీ జెండా పట్టేలా చేసింది. నాయకత్వం మారినా పార్టీకి విధేయుడుగా ఉన్నారు. పదవులు ఆశించని సీనియర్‌ కార్యకర్త అంటూ మోహన్‌ను ఆయన సన్నిహితులు పిలుస్తుంటారు.

ఆటలు అంటే వ్యామోహం..

క్రీడల పట్ల పీఆర్‌ మోహన్‌కు విపరీతమైన మక్కువ. ఆటలు ఎక్కడ ఉంటే అక్కడ పీఆర్‌ మోహన్‌ ఉండేవారు అంటే అతిశయోక్తికాదు. క్రికెట్‌ ప్రేమికుడే కాదు ఆటగాడు కూడా. శ్రీకాళహస్తి నుంచి వచ్చే సరికి ఆలస్యం అవుతుందని, రాత్రి తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ గ్రౌండ్‌లో పడుకుని తెల్లారి క్రికెట్‌ ఆడేవారంటే.. ఆయనకు క్రికెట్, ఆటల పట్ల ఎంత మక్కువో తెలియజేస్తోంది.

రెండు సార్లు శాప్‌ చైర్మన్‌..

ఆటలపై పీఆర్‌ మోహన్‌కు ఉన్న మక్కువే.. ఆయన్ను రెండు సార్లు ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్‌ అకాడెమీ(శాప్‌)కి చైర్మన్‌ను చేసింది. చైర్మన్‌ బాధ్యతల్లో తన పరిధి మేరకు వ్యవహరించిన మోహన్‌ అందరి మన్ననలు పొందారు. క్రీడల అభివృద్ధికి కృషి చేశారు. పలుమార్లు జాతీయ స్థాయి క్రీడాకారులు, కోచ్‌లను తీసుకువచ్చి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. పదవులతో సంబంధం లేకుండా క్రీడాభివృద్ధికి పీఆర్‌ మోహన్‌ తన వంతు కృషి చేసేవారు.

రాజకీయాలకు దూరం..

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన పీఆర్‌ మోహన్‌ 2018లో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసున్నారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు అవకాశం లభించినా.. ఆర్థిక కారణాలతో దాన్ని చేజార్చుకున్న పీఆర్‌ మోహన్‌కు ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. అయితే మోహన్‌కు ఎన్టీఆర్‌ తగిన గుర్తింపు ఇచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్‌గా, 1988లో యువశక్తి సంఘం డైరెక్టర్‌గా, 1994లో శాప్‌ చైర్మన్‌గా పని చేసే అవకాశం కల్పించారు. గత ప్రభుత్వం హాయంలో మోహన్‌ రెండోసారి శాప్‌ చైర్మన్‌గా పని చేశారు.

Also Read : బూట్లు లేని కాళ్లతో క్రీడా శిఖరంపైకి.. నిరుపేద రేవతి విజయాల పరుగు