iDreamPost
iDreamPost
ఇప్పుడు కాకపోతే ఇంకో నెల మొత్తానికి దగ్గరలోనే థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీటింగ్ కెపాసిటీ తగ్గించడం, శానిటైజేషన్ పాటించడం తదితర జాగ్రత్తలు కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఇప్పటికిప్పుడు కొత్త సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అందరి కన్ను జనవరి మీద పడింది. అప్పటికంతా పరిస్థితి ఖచ్చితంగా సాధారణం అవుతుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. బంగారు బాతు లాంటి సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసుకుని తమ రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉండటంతో చివరి నిమిషం హడావిడి పడకుండా ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
ఇందులో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కీలక పాత్ర పోషించనుంది. ఓ ఇరవై శాతం మాత్రమే బాలన్స్ ఉన్న దీని షూటింగ్ నవంబర్ లో పూర్తి చేసి డిసెంబర్ లో ఫైనల్ కాపీ ప్లస్ సెన్సార్ చేయించుకునేందుకు దిల్ రాజు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. పవన్ సహకరిస్తే ఇదేమంత కష్టం కాదు. హీరో పాల్గొనాల్సిన సీన్లకు సంబంధించి కేవలం 15 రోజుల వర్క్ మాత్రమే ఉందని తెలిసింది. సో పవర్ స్టార్ సినిమా కన్నా కిక్కిచ్చే సినిమా పండగకు ఇంకేం కావాలి. మరోవైపు అదే సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుని కెజిఎఫ్ 2 కూడా ఫుల్ వర్క్ లో ఉంది. దసరాకు అనుకున్నది కాస్తా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిపోయింది. అదే సంక్రాంతి అయితే తెలుగు తమిళంతో పాటు దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకాస్త వేగంగా చేస్తున్నారు.
ఇవి కాకుండా గోపిచంద్ తమన్నా కాంబోలో రూపొందిన సీటిమార్ ని కూడా బరిలో దింపే అవకాశాలు ఉన్నట్టు తాజా ఖబర్. అఖిల్ టీమ్ ఇదంతా ముందే ఊహించే చాలా సేఫ్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ని జనవరి 21కి లాక్ చేసుకున్నాయి. రామ్ రెడ్, వైష్ణవ్ తేజ్ ఉప్పెన, రానా అరణ్యలకు సంబంధించి ఇంకా అప్డేట్ తెలియాల్సి ఉంది. ఒకవేళ డిసెంబర్ లో కేసులు పూర్తిగా తగ్గిపోయి జనజీవనం మాములుగా ఉంటే ఎప్పటిలాగే సంక్రాంతికి భీకరమైన పోటీ నెలకొనడం ఖాయం. కాకపోతే ఫైనల్ గా ఎవరు సై అంటారు ఎవరు వెనుకడుగు వేస్తారు అనేదే వేచి చూడాలి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిశ్రమ కుదుటపడాలంటే ఇంకో మూడు నెలల్లో థియేటర్ల సందడి ఎప్పటిలాగే మొదలవ్వాలి. దాని కోసమే ప్రతి సినిమా ప్రేమికుడు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.