iDreamPost
iDreamPost
విజయనగరంలోని మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ దివంగత ఆనంద గజపతి రాజు కుమార్తె కుమారి సంచయిత గజపతి రాజును ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌తోపాటు ట్రస్ట్ బోర్టును కూడా ఏర్పాటు చేస్తూ ఈ నెల 3వ తేదీన జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నారు. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ఆ స్థానంలో అశోక్ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనంద గజపతి రాజు కుమార్తె అయిన సంచయిత నిన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు స్థానంలో సంచయితను నియమించిన ప్రభుత్వం ట్రస్ట్ బోర్టు మెంబరుగా అశోక్ గజపతి రాజు కుమార్తె శ్రీమతి అధితి విజయలక్ష్మీ గజపతి రాజును నియమించడం విశేషం. ఆమెతోపాటు మొత్తం ఏడుగురు సభ్యులను ట్రస్ట్ బోర్టు మెంబర్లుగా ప్రభుత్వం నియమించింది. ఆనంద గజపతి రాజు చిన్న కుమార్తె ఊర్మిళా గజపతి రాజు, దివంగత పీవీజీ రాజు కుమార్తె ఆర్.వి. సునీతా ప్రసాద్, అరుణ్‌కుమార్, విజయ్ కె. సొంది, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు నూతన మెంబర్లుగా నియమితులయ్యారు.
చైర్మన్‌తోపాటు ట్రస్ట్ బోర్టులో మొత్తం ఎనిమిది మంది ఉండగా.. అందులో నలుగురు గజపతి రాజు కుటుంబ సభ్యులుండడం గమనార్హం. ఇప్పటికే చైర్మన్ సంచయిత బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో త్వరలో సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టనున్నారు.