iDreamPost
android-app
ios-app

విశిష్టం.. శ్రీ రామానుజ స‌హ‌స్రాబ్ది స‌మారోహం..

విశిష్టం.. శ్రీ రామానుజ స‌హ‌స్రాబ్ది స‌మారోహం..

వ‌ర్ణ వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులకు వెయ్యేళ్ల క్రిత‌మే నాంది ప‌లికారు శ్రీ రామానుజాచార్యులు. ద‌ళితుల ఆల‌య ప్ర‌వేశానికి ఆద్యుడు. నారాయ‌ణ మంత్రాన్ని బ‌హిరంగంగా ఉప‌దేశించిన రుషీవ‌లుడు. దేవాల‌యాల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా మార్చేశారు. దేవుడి సేవ‌కు అన్ని వ‌ర్గాలూ స‌మాన‌మ‌ని చాటి చెప్పి స‌మ‌తామూర్తిగా కీర్తికెక్కారు. ఆ స‌మ‌తామూర్తి నిలువెత్తు విగ్ర‌హానికి రంగారెడ్డి జిల్లా ముచ్చింత్ లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం వేదికైంది. ఆయ‌న‌ కూర్చున్న భంగిమలో 216 అడుగుల ఎత్తులో భారీ లోహ విగ్రహాన్ని అక్క‌డ ఆవిష్క‌రించారు. ఆ విగ్ర‌హ ప్రారంభానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా హాజ‌రుకానున్నారు. ఈ నెల‌ 5న ముచ్చింత‌ల్ కు రానున్నారు. ఈ నెల 14 వ‌ర‌కు కొన‌సాగే శ్రీ రామానుజ స‌హ‌స్రాబ్ది స‌మారోహ వేడుక‌ల్లో రాష్ట్రప‌తి, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొన‌నున్నారు.

శ్రీ‌రామ న‌గ‌రం

మనిషి అంతరంగంలో అహంకారం అనే జబ్బును నయం చేసేందుకు సమతాస్ఫూర్తి అనే మందును వెయ్యేళ్ల క్రితమే రామానుజులు ఆచారించారని పేర్కొనే చిన్న జీయర్ స్వామి ముచ్చింత్ లో భారీ ఆశ్ర‌మాన్ని నిర్మించారు. దీనికి శ్రీ‌రామ న‌గ‌రంగా నామ‌క‌ర‌ణం చేశారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉంది. చిన్నజీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం.. వైష్ణవతత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యున్న‌త ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. సమాజంలోని అందరూ సమానమే అంటూ, ఎక్కువ తక్కువలు లేవంటూ.. సమతా భావనను అనుసరించిన మహా పురుషుడికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

45 ఎక‌రాలు.. 108 ఆల‌యాలు..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి రూపునిచ్చారు చిన్న జీయర్‌ స్వామి. స‌క‌ల దేవుళ్లు, దేవ‌త‌ల‌కు చెందిన‌ 108 ఆలయాలను కూడా ఇక్క‌డ నిర్మించారు. ముచ్చింతల్‌ ఆశ్రమానికి వెళ్లే మార్గాల్లో చాలాదూరం నుంచే రామానుజుల వారి విగ్రహం ఆక‌ర్షిస్తుంది. దగ్గరకు వెళితే.. ఆయన శాంతరూపం, పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమ.. భక్తి భావాన్ని, ప్రశాంతతను చేేేకూర్చుతోంది. ఆశ్రమంలోని ఏ మూల నుంచి చూసినా.. అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా రామానుజాచార్యులు క‌నిపించేలా రూపొందించారు. దాదాపు 120 కిలోల బంగారాన్ని విగ్ర‌హ నిర్మాణానికి వినియోగించ‌డం విశేషం.

ఎంతో మంది ప్ర‌ముఖులు రాక

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఈ నెల రెండున ప్రారంభ‌మ‌య్యాయి. 14వ తేదీ వరకు జరగనున్నాయి. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 2న ఉత్సవాలకు అంకురార్పణ జ‌రిగింది. నేడు అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు చిన్న జీయర్‌ స్వామి. ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు.ఫిబ్రవరి 14న మహా పూర్ణాహుతి..ఆ సందర్భంగా నిత్యం హోమాలు జరుగనుండగా, 8న సామూహిక ఆదిత్య హృదయం జపం నిర్వహించనున్నారు. 11న సామూహిక ఉపనయన కార్యక్రమం, 12న సామూహిక విష్ణు సహస్ర నామ జపం ఏర్పాటు చేయనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ తర్వాత కీలకమైన రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంతో కీలక ఘట్టాలు ముగియనుండగా.. ఫిబ్రవరి 14న మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా సందర్శించి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.ఈ ఆధ్యాత్మిక నగరం.. హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు.

Also Read : చింతామ‌ణి నాట‌కంపై హైకోర్టు కీలక ఆదేశాలు