iDreamPost
android-app
ios-app

శాకుంతలం ఎంట్రీతో వేడెక్కిన శివరాత్రి పోటీ

  • Published Jan 02, 2023 | 6:45 PM Updated Updated Jan 02, 2023 | 6:45 PM
శాకుంతలం ఎంట్రీతో వేడెక్కిన శివరాత్రి పోటీ

ఏం సినిమాల పోటీ సంక్రాంతికే ఉండాలా ఇతర పండగలకు ఉండకూడదా అని ఫీలయ్యింది కాబోలు బాక్సాఫీస్ ఇప్పుడు శివరాత్రికి కూడా మంచి రసవత్తరమైన పోరుని సిద్ధం చేస్తోంది. కొద్దిసేపటి క్రితం శాకుంతలం విడుదల తేదీ వచ్చేసింది. ఫిబ్రవరి 17న త్రీడి వెర్షన్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజుతో పాటు దర్శకుడు గుణశేఖర్ ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వాములు. ఇటీవలే ఆసుపత్రిలో ఉన్నా సరే యశోద సక్సెస్ ని ఎంజాయ్ చేసిన సమంతాకి ఇది మరో టైటిల్ రోల్. మలయాళ నటుడు దేవ్ మోహన్ తనకు జోడిగా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు.

అయితే ఆల్రెడీ అదే తేదీకి సిద్ధపడిన మూడు సినిమాలకు ఈ ఎంట్రీ వల్ల పెద్ద చిక్కే వచ్చింది. గత ఏడాది మూడు ఫ్లాపులు చవి చూసిన కిరణ్ అబ్బవరం ఆశలన్నీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మీదే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంతో పాటు కాన్సెప్ట్ ఏదో కొంచెం డిఫరెంట్ గానే కనిపిస్తోంది. ఇలాంటి వాటికి సోలో రిలీజ్ అయితే అనుకూలంగా ఉంటుంది. కానీ విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ కూడా రేస్ లో ఉంది. తనే డైరెక్షన్ చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో డ్యూయల్ రోల్ చేశాడు. స్వంత బ్యానర్ అయినా ఖర్చు బాగానే పెట్టారు. సితార సంస్థ రెండు భాషల్లో తీస్తున్న ధనుష్ ‘సర్’ సైతం అదే డేట్ ని గతంలోనే తీసుకుంది. ఈ ట్రయాంగిల్ క్లాష్ ఎప్పుడో డిసైడ్ అయ్యింది

ఇప్పుడు శాకుంతలం రావడంతో థియేటర్ల సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఫిబ్రవరి 10న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ని మైత్రి సంస్థ ప్లాన్ చేసింది. పైన చెప్పిన నాలుగు సినిమాలకు దీనికి గ్యాప్ ఒక్క వారమే కాబట్టి పోటీ పరిగణనలోకి దీన్ని కూడా తీసుకోవాలి. ఒకవేళ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో ఏదైనా బ్లాక్ బస్టర్ అయితే శివరాత్రి టైంలో పూర్తిగా వాష్ ఔట్ అయ్యి ఉండవు. అలాంటప్పుడు థియేటర్ కౌంట్ పరంగా అందరూ సమస్యను ఫేస్ చేయాల్సిందే. దిల్ రాజు కావాలనే పంతానికి పోయి ఇప్పుడీ శాకుంతలంని దించుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ వారసుడు విషయంలోనే తగ్గేదేలే అన్న ఆయన సామ్ మూవీకి మెట్టు దిగుతారా. ఛాన్సే లేదు.