iDreamPost
android-app
ios-app

Sajjala Ramakrishna Reddy – పట్టాభి మాటలు కరెక్టేనా..? ప్రజలు ఆలోచించాలన్న సజ్జల

Sajjala Ramakrishna Reddy – పట్టాభి మాటలు కరెక్టేనా..? ప్రజలు ఆలోచించాలన్న సజ్జల

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని దూషించారని వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆవేశంలో పట్టాభి ఆ మాట అనలేదని.. ఒకటికి నాలుగుసార్లు ఒకే పదాన్ని పట్టాభి ఉపయోగించడం ఉద్దేశపూర్వకమేనని సజ్జల అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని.. అసభ్యకరమైన, ఎవరూ అనేందుకు ఇష్టపడని మాటను పట్టాభి అనడం కరెక్టేనా..? అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. తామేదో టీడీపీ కార్యాలయంపై దాడి చేశామంటూ చంద్రబాబు హడావుడి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. నిజానిజాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.

ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నా.. సీఎం వైఎస్‌ జగన్, తమ పార్టీ స్పందించడం లేదనే ఆరు నెలలుగా టీడీపీ నేతలు దూషించడం మొదలు పెట్టారని సజ్జల అన్నారు. ఆ క్రమంలోనే లోకేష్, అయ్యన్నపాత్రుడు, తాజాగా పట్టాభిరామ్‌లు సీఎం వైఎస్‌ జగన్‌ను దూషించారని స్పష్టం చేశారు. పట్టాభి దూషణలు విన్న వారు ఎవరికైనా కోపం వస్తుందని, స్పందిస్తారన్నారు. పట్టాభి అన్న మాటను.. మేము అంటే మీరు ఎలా స్పందిస్తారని అడిగేందుకే టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లామని సజ్జల చెప్పారు. పట్టాభి అన్న మాటను..ఓ అమ్మ వద్ద, భార్య వద్ద ప్రస్తావిస్తే.. వారి స్పందన ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు.

పట్టాభి ఆ మాట అనకపోయి ఉంటే.. ఈ పరిస్థితి ఉండేది కాదన్న విషయం చంద్రబాబుకు తెలియదా..? అని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు తప్పు అయినా.. వాటిని ఖండించకుండా.. మాకు మాట్లాడే హక్కు లేదా..? ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అంటూ చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తిట్టడం మీ హక్కా..? తిట్టడం ప్రజాస్వామ్యమా..? అని సజ్జల ప్రశ్నించారు. పట్టాభి చేసిన వాఖ్య తప్పని చెప్పి.. అయినా మీరు ఇలా దాడి చేయకూడదని అంటే.. చంద్రబాబు పెద్దరికం నిలబడేదన్నారు సజ్జల.

Also Read : Chandrababu – Amit Shah – దాడిపై ఫిర్యాదు చేస్తారు సరే.. అమిత్‌ షా కారణం అడిగితే ఏం చెబుతారు..?