iDreamPost
android-app
ios-app

చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయ్ – సజ్జల

చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయ్ – సజ్జల

ఉద్యోగులతో చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. విజయవాడలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో స్పందించిన సజ్జల… ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’ బల ప్రదర్శనగానే ఉందని అభివర్ణించారు. సభలో ఉద్యోగ సంఘాల నేతల ఉపన్యాసాలు పరిస్థితిని మరింత జఠిలం చేసేందుకు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా మంచి పీఆర్సీ ఇచ్చామని గుర్తు చేేశారు. ఉన్న పరిస్థితుల్లో ది బెస్ట్ పీఆర్సీ ఇచ్చామని అన్నారు. 

గత రెండున్నర ఏళ్లలో ఉద్యోగులకు లబ్ది సహా ఉద్యోగ భద్రత కల్పించామన్న ఆయన… అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టి మెరుగ్గా వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా…? అని ఆయన నిలదీశారు. ఉపాధ్యాయులు ఎప్పట్నుంచో ఎదుర్కొంటోన్న సమస్యలను ఈ ప్రభుత్వమే పరిష్కరించిందన్న సజ్జల… సీఎం దృష్టికి ఏది వచ్చినా వెంటనే సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు అని ప్రస్తావించారు.

పదివేల కోట్లు భారం పడుతున్నా 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామన్నారు. ఫిట్ మెంట్ 14.29 దాటని పరిస్థితుల్లో 23శాతం ఫిట్ మెంట్ ను సీఎం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సాధించిన ఫిట్ మెంట్ ను నాయకులు ఉద్యోగ సంఘాల నేతలు తమ క్రెడిట్ గా తీసుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేేశారు. తమను ప్రభుత్వం చులకనగా చూస్తున్నారని ఉద్యోగసంఘాల నేతలు వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు. పీఆర్సీతో గతంలో ఉన్నట్లు వేతనంలో విపరీతంగా పెరుగుదల ఉండదన్న ఆయన… ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో అలా కోరుకోవడం అత్యాశే అవుతుందని స్పష్టం చేేశారు.

నాడు నేడులో పాఠశాలలు బ్రహ్మాండంగా తయారవుతున్నాయని  ఉపాధ్యాయులకు తెలియదా అని నిలదీశారు. పాఠశాలలు బాగుపడితే తమకే మంచిదనే ఉపాధ్యాయులకు తెలియదా అని ప్రశ్నించారు. అంగన్వాడీలను కలిపాక ఎస్జీటీ ల నుంచి పదోన్నతులు వస్తాయన్న సజ్జల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని ప్రభుత్వం విలీనం చేసిందని గుర్తుచేశారు. సీఎం ను పట్టుకుని నష్టం జరిగిందని మాట్లాడుతున్నవారు ఇవన్నీ చూడరా అని ప్రశ్నించారు. సమ్మెతో ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తారో తెలియడంలేదు అన్నారు ఆయన.

ఇంత జరిగినా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నట్లు సీఎం చెప్పారు అని ఉద్యోగులు సమస్యలు ఉంటే ప్రభుత్వంతో పరిష్కరించుకోవాలి అని సూచించారు. ప్రభుత్వం కర్కశంగా కర్కోటంగా ఉండదన్నారు సజ్జల. ఉద్యోగులు కూల్ గా ఆలోచించాలి… చర్చలకు రావాలని కోరారు. సమ్మె వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేేశారు. సమ్మెకు వెళితే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు.

ప్రభుత్వంలో ఉద్యోగభద్రత ఎలా క్రియేట్ చేసిందో చూడాలని మరో సారి అప్పీల్ చేస్తున్నామని చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నాం అంటూ స్పష్టం చేశారు. ముందుగా సీఎంతో కాకుండా …మంత్రుల కమిటీ తో చర్చలు జరపాలని కోరారు. ఉద్యోగులు తమ వేతనాలు పెరగాల్సినంత పెరగలేదని అంటే … అది వేరే విషయం అని వ్యాఖ్యలు పీఆర్సీతో సంబంధం లేకుండా పొలిటికల్ వైపు వెళ్తున్నట్లుందని అభిప్రాయపడ్డారు. ఎవరితోనో కొట్లాడుతున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలున్నాయన్నారు. వేతనాలు అకౌంట్లలో పడ్డాక జీవోలు రద్దు చేయాలనడం అర్థంలేని డిమాండ్ అని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల మూడు డిమాండ్లకు అర్థం లేదని అన్నారు.

ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఎంటరైతే సంబంధంలేని రాజకీయ శక్తులు వస్తాయని,అడ్డదారులు వద్దని కోరుతున్నానని… ఉద్యమం పక్కదారి పడుతుందని …అలా వెళ్లవద్దని కోరుతున్నాం అని స్పష్టం చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడటం సరికాదు అని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల గొంతు నొక్కే పని ఏదీ ప్రభుత్వం చేయలేదు అన్నారు ఆయన. కోవిడ్ ఉందనే ‘చలో విజయవాడ’కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేేశారు.