iDreamPost
android-app
ios-app

YCP MLC Candidates – పాత, కొత్త కలయిక.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

YCP MLC Candidates – పాత, కొత్త కలయిక.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అప్రతిహాతంగా విజయాలు సాధిస్తూ మంచి జోరు మీద ఉన్న వైసీపీ.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇషాక్‌ బాష, వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి డీసీ గోవిందరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైసీపీ ఎంపిక చేసింది. వారి పేర్లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

శాసనసభ్యుల కోటాలో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. రోజు వ్యవధిలోనే వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించడం.. ఎన్నికలపై ఆ పార్టీ చేసిన ముందస్తు కసరత్తుకు నిదర్శంగా నిలుస్తోంది. శాసన సభలో వైసీపీకి తిరుగులేని మెజారిటీ ఉన్న నేపథ్యంలో… మూడు స్థానాలను వైసీపీ గెలుచుకోవడం లాంఛనమే కానుంది. సరిపడినంత బలం లేని టీడీపీ పోటీ చేసేందుకు కూడా ఆసక్తిచూపకపోవచ్చు. ఫలితంగా వైసీపీ ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జగన్‌ ఎప్పటిలాగే ప్రాంతాలు, సామాజికవర్గాలు, కొత్త వారికి అవకాశం.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన పాలవలస కుటుంబానికి జగన్‌ పెద్దపీట వేశారు. ఆ కుటుంబం నుంచి విక్రాంత్‌కు అవకాశం కల్పించారు. 2019లో డీసీసీబీ చైర్మన్‌ పదవిని విక్రాంత్‌కు ఇచ్చిన జగన్‌.. ఈ సారి పెద్దల సభకు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలుకు చెందిన నేత డీసీ గోవిందరెడ్డికి మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు. బద్వేలులో పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపిన గోవిందరెడ్డి.. జగన్‌ నమ్మకాన్ని మరోసారి గెలుచుకున్నారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని పార్టీ నేతలకు అవకాశం కల్పించే వైఎస్‌ జగన్‌.. ఈ సారి కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్‌ బాషకు ఆ అవకాశం కల్పించారు.

Also Read : MLC Elections TDP – ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం ?