Idream media
Idream media
సుఖాంతం లేని కథగా రాజస్థాన్ రాజకీయం కనిపిస్తోంది. ఇదో పెద్ద రాష్ట్రం. ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ రాజకీయాలు సర్వ సాధారణమే అయినా మెజార్టీ సాధించిన తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్ కు తలనొప్పులు తప్పలేదు. అందుకు కారణం బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. దీనికి తోడు సొంత పార్టీలోనే రెండు వర్గాలు. మరోవైపు బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఆవిర్భవించింది. ఈ క్రమంలో పతనం అంచుల దాకా వెళ్లిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో.. రాజ్‌భవన్-అసెంబ్లీ మధ్య ఘర్షణ వైఖరి తలెత్తడానికి కారణమైన సంక్షోభ పరిస్థితుల నుంచి.. గటెక్క గలిగింది కాంగ్రెస్ పార్టీ. అధికారాన్ని నిలుపుకోగలిగింది. వర్గాల పోరును కూడా చల్లార్చుకున్నట్లుగా కొంత కాలంగా ప్రశాంతంగానే పైకి కనిపిస్తోంది. ఇంతలోనే అక్కడి అసంతృప్తులు మళ్లీ రేగుతున్నాయి.
రాజస్థాన్ లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు ఎప్పుడూ ప్రశాంతత లేదనే చెప్పాలి. కొన్ని రోజులు స్తబ్దుగా ఉంటూ, మరికొన్ని రోజులు తలనొప్పిగా మారటం నిత్య కృత్యమై కూర్చుంది. దీంతో ఏం చేయాలో అధిష్ఠానానికి పాలుపోవడం లేదు. ఓ వైపు సీఎం అశోక్ గెహ్లోత్… గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. పైగా సీనియర్. మరో వైపు యువనేత సచిన్ పైలట్. ఓ వర్గం ఓట్లను విపరీతంగా ఆకర్షించే సత్తా ఉన్న నేత. వీరిద్దరి మధ్యా కొన్ని రోజులుగా తీవ్రమైన ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ఇద్దరు నేతలూ రాష్ట్ర రాజకీయాల్లో గానీ, అటు పార్టీలో గానీ కీలకమైన నేతలే.
తాజాగా వీరిద్దరి మధ్య మరోసారి పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయి. సీఎం అశోక్ గెహ్లోత్‌పై సచిన్ పైలట్ వర్గీయులు మరోసారి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గెహ్లోత్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ ఎమ్మెల్యే, పైలట్ వర్గీయుడు హేమారామ్ చౌధురి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను స్పీకర్ జోషికి పంపించారు. ఈయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తనను… సీఎం గెహ్లోత్ ఇంకా మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని, తన అభిప్రాయాలకు అసలు విలువే ఇవ్వడం లేదని హేమారామ్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయితే పీసీసీ ఆయన్ను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. అయితే ఈ రాజీనామా వ్యవహారంపై సచిన్ పైలట్ సన్నాయి నొక్కులు నొక్కుతుండటంతో వ్యవహారం మరింత ముదురుతోంది.
సీనియర్ ఎమ్మెల్యే హేమారాం చౌధురి రాజీనామా చేయడం ఆందోళన కలిగించే విషయమని పైలట్ అన్నారు. శాసన సభలో ఆయన చాలా సీనియర్ అని, రాష్ట్రానికి, పార్టీకి ఆయన చాలా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. హేమారాం చౌధురి వ్యవహారం ముగియక ముందే మరో ఎమ్మెల్యే సీఎం గెహ్లోత్‌కు ఎదురు తిరిగారు. వేదప్రకాశ్ సోలంకి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరించారు. తమ కార్యకర్తల మనోభావాలను, వారి అవసరాలను తీర్చకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని తమకు ఇవ్వకుండా ఐఏఎస్ అధికారులతో నింపేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం గెహ్లోత్ ఆత్మ రక్షణలో పడ్డారనే చర్చ కొనసాగుతోంది.