Idream media
Idream media
డిసెంబర్15,1812న మాస్కో రాజప్రాసాదం క్రెమ్లిన్ లో తన సైన్యానికి అగ్రస్థానంలో ఉండి ప్రవేశించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు నెపోలియన్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, సైనికుడు కానీ లేరు. ఒకరోజు ముందు మాస్కో నగరంలో ప్రవేశించినప్పుడే నెపోలియన్ నగరంలో మనుషులు ఎవరూ కనిపించక ఆశ్చర్యపోయాడు. అప్పుడు రష్యాకి రాజధాని నగరం సెంట్ పీటర్స్ బెర్గ్ అయినా ఆనాటికి రష్యా దేశంలోనే కాక ప్రపంచంలో పెద్ద నగరాల్లో మాస్కో ఒకటి. రెండు లక్షల డెబ్భై అయిదు వేల మంది జనాభా ఉన్న నగరంలో నెపోలియన్ సైన్యానికి మనుషులు ఎవరూ కనిపించలేదు. రష్యా అధ్యక్షుడు జార్ అలెగ్జాండర్ తన సైన్యం మొత్తాన్ని రక్షణకు ఉపయోగించాడేమో అనుకుంటే, మరుసటి రోజు క్రెమ్లిన్ చేరిన నెపోలియన్ సైన్యానికి అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు.
దేశంలోనే ముఖ్యమైన నగరాన్ని, రాజప్రాసాదాన్ని గాలికి వదిలేసి వెళ్ళిన రష్యా సైన్యం వ్యూహం ఏమిటో ఎన్నో యుద్ధాల్లో తిరుగులేని విజయాలు అందుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడుకి అర్థం కాలేదు
రష్యాని తనవైపుకు తిప్పుకోవడానికే దాడి
నెపోలియన్ అధికారం చేపట్టాక దేశంలో సుస్థిరత నెలకొల్పి ఆ తర్వాత తన రాజ్యాన్ని విస్తరించడం మీద దృష్టి పెట్టాడు. ఒకటొకటిగా దేశాలను ఆక్రమించుకోవడం, కొన్నిటితో సంధి చేసుకోవడం చేస్తూ యూరప్ లో చాలా భాగం తమకు అనుకూలంగా తిప్పుకొని, తమ దేశానికి ఎప్పటినుండో శత్రువుగా ఉన్న ఇంగ్లాండు వైపు దృష్టి పెట్టాడు. ఇంగ్లాండుకు బలమైన నావికాదళం ఉండటంతో నేరుగా యుద్ధంలో గెలవడం కష్టమని యూరప్ లో తనకు అనుకూలంగా ఉన్న దేశాలచేత ఇంగ్లాండు మీద ఆర్థిక దిగ్బంధం విధించే ప్రయత్నం చేశాడు. తన అభీష్టానికి వ్యతిరేకంగా ఇంగ్లాండుతో ఆర్థిక సంబంధాలు కొనసాగించి నందుకు స్పెయిన్, పోర్చుగల్ మీద 1807లో యుద్ధం మొదలుపెట్టాడు నెపోలియన్.
Also Read: సోమశిల – సిద్దేశ్వరం బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం
అది ఒకవైపు కొనసాగుతుండగానే రష్యా కూడా తన ఆర్థిక అవసరాల కోసం ఇంగ్లాండుతో ఆర్థిక సంబంధాలు పునరుద్ధరించుకోవడంతో రష్యాకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు నెపోలియన్. కనీవినీ ఎరుగనంత పెద్ద సైన్యాన్ని సమీకరించి, సరిహద్దు దాటి రష్యాలో ప్రవేశించగానే రష్యా అధ్యక్షుడు భయపడి తన షరతులు అంగీకరించి సంధికి ఒప్పుకునేలా చేయాలని నెపోలియన్ ఆలోచన. అందుకు తగ్గట్టుగా ఫ్రాన్స్, ప్రష్యా, ఆస్ట్రియాల నుంచి అయిదు లక్షల మంది సైనికులను, లక్షమంది ఇతర సిబ్బందినీ సమీకరించి జూన్ 24,1812 న రష్యా మీద దండయాత్ర మొదలుపెట్టాడు.
అయితే నెపోలియన్ అంచనాలు తలకిందులు రష్యా అధ్యక్షుడు నెపోలియన్ సైన్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో రష్యా సైన్యాన్ని దారుణంగా దెబ్బ తీయాలని నిర్ణయించుకున్నాడు నెపోలియన్. అయితే అతనికి ఎన్ని రోజులు గడిచినా రష్యా సైన్యం ఎదురు పడలేదు. నెపోలియన్ సైన్యం ప్రయాణం చేసే దారిలో ఉన్న ఊర్లు అన్నీ ఖాళీ చేసి, ఇళ్ళు తగలబెట్టి వారికి ఎక్కడా నిలువ నీడ లేకుండా చేశారు రష్యన్లు. ఊహించిన దానికన్నా ఎక్కువ రోజులు గడవడంతో నెపోలియన్ సైన్యం దగ్గర ఉన్న ఆహార పదార్థాలు తగ్గిపోసాగాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ దూరం రావడంతో ముందుగా సిద్ధంగా ఉంచిన ఆహారం, ఇతర సామగ్రి రావడం బాగా ఆలస్యం అయింది. దానికి తోడు రష్యాలో సరైన రహదారులు లేకపోవడం, అప్పుడే కురిసిన వర్షాలకు అవికూడా బురదమయం కావడంతో అవి సైన్యానికి అందడం బాగా ఆలస్యం అయింది.
ఎట్టకేలకు ఒక యుద్ధం
ముఖాముఖి తలపడకుండా పలాయనం కావడమనే జార్ అలెగ్జాండర్ వ్యూహాన్ని అతని ప్రభుత్వంలోనే ఉన్న చాలా మంది తప్పుబట్టడంతో ముఖాముఖి యుద్ధం చేయడం కోసం అపారమైన అనుభవం ఉన్న మిఖయిల్ కుటుజోవ్ అనే అధికారిని ఆగస్టులో సైన్యాధ్యక్షుడిగా నియమించారు రష్యా అధ్యక్షుడు. అంతకుముందు నెపోలియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన అనుభవం ఉన్న కుటుజోవ్ కూడా సరైన సమయం కోసం ఎదురు చూసి మాస్కోకి డెభ్బై మైళ్ళ దూరంలో బొరోదినో అన్న ప్రాంతంలో సెప్టెంబర్ 7న ముఖాముఖి తలపడ్డాడు. భయంకరంగా జరిగిన ఆ యుద్ధంలో ఒక్క రోజులోనే ఇరు పక్షాలలో దాదాపు లక్ష మంది మరణించారు.
ఆ పోరు తర్వాత తన సైన్యాన్ని మరింత నష్టపోవటం ఇష్టం లేని కుటుజోవ్ మాస్కోవైపు పారిపోయాడు. అతన్ని వెంబడిస్తూ నెపోలియన్ సైన్యం సెప్టెంబర్ 14న మాస్కోలో ప్రవేశించింది. సెప్టెంబర్ 15 అర్ధరాత్రి నెపోలియన్ సైన్యం నిద్రలో ఉండగా క్రెమ్లిన్ రాజప్రాసాదంతో పాటు మాస్కో నగరంలో అంతటా నిప్పు రాజుకుని భవనాలు తగలబడటం మొదలైంది. దట్టమైన పొగవల్ల ఊపిరాడని సైనికులు నగర శివారు ప్రాంతం వైపు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మూడు రోజుల పాటు ఆ మంటలు రగులుతూనే ఉన్నాయి.
Also Read: కుప్పం కోట మీద వైసీపీ జండా ఎగరేసిన హాసిని
నెలరోజులు కాలిపోయిన మాస్కో నగరంలోనే ఉన్నాడు నెపోలియన్ జార్ అలెగ్జాండర్ నుంచి ఏదైనా సంధి ప్రతిపాదన వస్తుందేమో అని. అది రాకపోగా భయంకరమైన రష్యా శీతాకాలం వచ్చే సూచనలు కనిపించసాగాయి. ఇన్ని రోజులు రష్యాలో ఉండవలసిన అవసరం ఉంటుందని ఊహించకపోవడంతో ఎముకలు కొరికే ఆ చలినుంచి కాపాడే దుస్తులు ఆ సైన్యం దగ్గర లేవు. దానికి తోడు ఆహార నిల్వలు దాదాపు ఖాళీ అయిపోవడం, చుట్టుపక్కల ఎక్కడా దొరికే అవకాశం లేకపోవడంతో తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు నెపోలియన్.
గెరిల్లా పోరాటాలు
తిరుగు ప్రయాణంలో కుటుజోవ్ నాయకత్వంలో రష్యన్ సైన్యం గెరిల్లా వ్యూహంతో నెపోలియన్ సైన్యాన్ని దెబ్బ తీయడం మొదలుపెట్టింది. దీనికి తోడు కొస్సాక్ తెగలకు చెందిన రష్యన్లు కూడా మెరుపుదాడులు చేస్తూ మరింత నష్టం కలిగించసాగారు. సున్న డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు, ఆకలి, సరైన నీరు లేక గుంటలు, కాలువల నీటిని తాగడం వలన అంటువ్యాధులు ప్రబలడంతో నెపోలియన్ సైన్యం పిట్టల్లా రాలిపోసాగింది.
చనిపోయిన వారు చనిపోగా మిగిలిన సైన్యంతో నవంబర్ చివరిలో ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న లిథువేనియా సరిహద్దుల్లో ఉన్న బెరెజినా నది వద్దకు చేరుకున్నాడు నెపోలియన్. ఆ సమయంలో ఆ నది గడ్డకట్టి దాటడం తేలిగ్గా ఉంటుందని భావించిన నెపోలియన్ ఆశలు తలకిందులు చేస్తూ అది మంచు కరిగి నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఫ్రెంచ్ సైన్యంలోని ఇంజనీర్లు అప్పటికప్పుడు ఆ నదిమీద మూడు వంతెనలు నిర్మించారు. సైన్యం నదిని దాటుతూ ఉండగా కుటుజోవ్ సైన్యం దాడి చేయడంతో తమ సైనికులు పదివేల మంది అవతల ఉండగానే వంతెనలు ధ్వంసం చేసి ఫ్రెంచ్ సైనికులు పరారయ్యారు.
Also Read:ఈనాడు ఉద్యోగుల రిటైర్మెంట్ నిజంగానే స్వచ్చందమా ?
డిసెంబరులో మిగిలిన సైన్యాన్ని వదిలి నెపోలియన్ ఫ్రాన్స్ చేరుకున్నాడు. రష్యాలో నెపోలియన్ మరణించాడని రాజ్యంలో అప్పటికే పుకార్లు వ్యాపించాయి. అదను చూసుకుని ఒక సైనికాధికారి తిరుగుబాటు చేసి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నం చేయగా నెపోలియన్ విధేయులు దాన్ని భగ్నం చేశారు. ఆ తర్వాత ఆరు రోజులకు నెపోలియన్ మహాసేన లక్షమందితో ఫ్రాన్స్ చేరుకుంది. సైనికులు, ఇతర సిబ్బంది కలిపి అయిదు లక్షల మంది ఈ దండయాత్రలో మరణించారు.
అంతానికి ఆరంభం
రష్యాలో నెపోలియన్ ఎదుర్కొన్న పరాజయం గురించి యూరప్ అంతటా తెలిసిపోయింది. నెపోలియన్ వ్యతిరేకులందరూ జట్టుకట్టి 1814లో అతడిని ఓడించి ఎల్బా ద్వీపంలో ఖైదు చేశారు. అయితే 1815 జనవరిలో అక్కడ నుంచి తప్పించుకుని తిరిగివచ్చిన నెపోలియన్ సైన్యంలోని తన విధేయులు కూడగట్టి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే అదే సంవత్సరం జూన్ నెలలో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఓటమితో సెయింట్ హెలెనా ద్వీపానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఖైదీగా వెళ్లి ఆరు సంవత్సరాల తర్వాత అక్కడే మరణించాడు.
ఆ రకంగా ఒక అవసరం లేని యుద్ధం చేయడం వల్ల తిరుగులేని విజయాలు సాధిస్తూ ఉన్న నెపోలియన్ తన పతనాన్ని తనే తెచ్చుకున్నాడు.
Also Read: వైఎస్సార్ రాజనీతిజ్ఞతకు ఈ సముద్రతీరం ఓ ఉదాహరణ