సోమశిల - సిద్దేశ్వరం బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం

By Guest Writer Sep. 19, 2021, 01:15 pm IST
సోమశిల - సిద్దేశ్వరం  బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం

శ్రీశైలం రిజర్వాయర్లోని కృష్ణానది నీటికోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తారాస్థాయిలొనే ఉంది . ఐతే ప్రకృతి ప్రసాదించిన ఈ నీటిని సముద్రంపాలు కాకుండా వాడుకోవడంలోనే ఉంది అసలైన సమర్థత అనే విషయాన్ని మరచిపోయి కొందరు అనాలోచితంగా మాటలయుద్ధంగా మార్చారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతమాల ఫేజ్ 1లో భాగంగా సిద్దేశ్వరం - సోమశిల (ఆంద్రప్రదేశ్ - తెలంగాణ ) మధ్య కృష్ణానదిపై రోడ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపి , మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల వరకు 820 కోట్లతో ఎన్ హెచ్ - 167 కె పేరుతో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టబోతుంది .

ఈ రహదారి నిర్మాణం కారణంగా హైదరాబాద్ - చెన్నై , హైదరాబాద్ - తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది . ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ఈరోజు ప్రతిపాదనలు ఇప్పుడు మొదలు పెట్టింది కాదు రోడ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2008 లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగింది . కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న సింగోటం శ్రీలక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళడానికి కర్నూలు జిల్లా నుంచి మరబోటులో వెళ్తూ బోటు మునిగి 61 మంది చనిపోయారు . అప్పుడే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని శంకుస్థాపన చేశారు . ఇది ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు చాలా ఉపయోగకరమైనది . అది ఇప్పటికి అమలుకునోచుకోవడం ఆనందం .

అది అటుంచితే సిద్దేశ్వరం - సోమశిల మధ్య కృష్ణానదిపై అలుగు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా రాయలసీమ రైతులు కోరుతున్నారు . ఇక్కడ అలుగు నిర్మించాలని ఈరోజు చేసిన ప్రతిపాదన కాదు . బ్రిటిష్ పాలన కాలంలో మెకంజీ కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు కట్టాలని సిద్దేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంకు ప్రతిపాదించాడు . ఆ నిర్మాణం అనేక కారణాల వల్ల ఇప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు . ఐతే ఇప్పుడు ఇరురాష్ట్రాలకు ఒక అవకాశం లభించింది . సిద్దేశ్వరం - సోమశిల రోడ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణంను బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ గా మార్చి ఒక 50 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునేలా ఇరు రాష్ట్రాలు ప్రతిపాదిస్తే కరువు ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ , రాయలసీమ రైతుల కళ్ళల్లో క్రిష్ణానది నీళ్ల ఆనందం చూడొచ్చు .

వృధాగా సముద్రంపాలయ్యే నీటిని తెలంగాణ ప్రాంతానికి మల్లేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది . అలాగే రాయలసీమకు పోతిరెడ్డిపాడు , మాల్యాల నుంచి నీటిని తీసుకోవచ్చు .

ఇక్కడ రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి .శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం తగ్గిపోతూ పేరుకుపోతున్న పూడికను అడ్డుకోవచ్చు . అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఇవ్వవలసిన 80 టీఎంసీల నీటిని కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇవ్వొచ్చు .


కృష్ణానదిపై తెలంగాణ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న వెల్లటూరు - గొందిమల్ల బ్యారేజ్ నిర్మాణం కంటే సిద్దేశ్వరం - సోమశిల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం ఎంతో ఉపయోగకరమైనది . ఎందుకంటే పల్లపు ప్రాంతంగా ఉన్నటువంటి వెల్లటూరు - గొందిమల్ల మధ్య బ్యారేజ్ నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు . సహజ సిద్ధంగా 580 మీటర్ల దూరంలో రెండు కొండల మధ్య తక్కువ ఖర్చుతో కట్టుకుని ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకుంటే కరువు న్యాల మురిసి సిరులు కురిపించును .

తెలంగాణ , రాయలసీమ , కోస్తా అని మనుషులకే పట్టింపులు , పంథాలు .
నీటికి ప్రాంతాలు లేవు , పట్టింపులు లేవు . ఎండిపోతున్న గొంతులను తడిపి తరించడం మాత్రమే తెలుసు .

Written By నరేన్ నిప్పులవాగు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp