iDreamPost
android-app
ios-app

ఇండియాకి భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన రష్యా

ఇండియాకి భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన రష్యా

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అంతర్జాయ స్థాయిలో ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ముడి చమురు ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా, చమురు ఎగుమతి చేయలేక పోతోంది. ఈ క్రమంలో తమ వద్ద పేరుకుపోయిన ముడి చమురును భారీ డిస్కౌంట్లతో విక్రయించడానికి రష్యా సిద్ధమైంది. అందుతున్న సమాచారం ప్రకారం, బ్యారెల్‌కు $ 35 వరకు తగ్గింపుతో 15 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయడానికి రష్యా భారత్ కు ఆఫర్ చేసింది. యుద్ధానికి ముందున్న ధరకే ఈ క్రూడ్‌ ఆయిల్ విక్రయిస్తామని రష్యా ఆఫర్ చేసింది అని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. భారత్ టెంప్ట్ అవ్వడానికి గాను రూబుల్-రూపాయి చెల్లింపు విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ప్రత్యేక చెల్లింపు విధానంలో రష్యన్ కరెన్సీ రూబుల్ భారతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడుతుంది. ఆ తరువాత అది భారతీయ కరెన్సీగా మార్చబడుతుంది. అదేవిధంగా రూపాయిని రూబుల్‌గా మార్చడం ద్వారా చెల్లింపులు చేయబడుతుంది.

అయితే, ఇప్పటివరకు ఈ ప్రతిపాదనపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్ లవ్ రోవ్.. కేంద్రంతో జరిపే చర్చల్లో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే రష్యా నుంచి డిస్కౌంట్ కు చమురు దిగుమతి చేసుకుందామని చేస్తున్న ఆలోచనల నేపథ్యంలో అమెరికా భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని సూచిస్తోంది. అయితే, ఐరోపా దేశాలే ఎక్కువ చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. ఇదే విషయాన్ని భారత్ ప్రస్తావించే అవకాశం ఉంది. రష్యా నుంచి గతంలో మాదిరే భారత్ చమురు దిగుమతులు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ, వాటిని పెంచుకోవద్దని అమెరికా చెబుతోంది.