Idream media
Idream media
వారి ఆసక్తి, అంచనాలకు తగ్గట్లుగానే ప్రవీణ్ కుమార్ కూడా ఆకట్టుకున్నారు. నాకు పిట్టకథలు చెప్పడం రావంటూ కేసీఆర్ పై సెటైర్లు, ఆకలితో ఉన్న వారి గొంతుకనవుతా అంటూ గొంతెత్తారు. ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో ఆయన బహుజన సమాజంలో మనం బానిసలం కాదు పాలకులమని ఆయన స్పష్టం చేస్తూ.. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యమన్న సందేశాన్ని మరోమారు వినిపించారు. కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? అని పలువురు నేతలను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్తానం, 1300 మంది బిడ్డల ప్రాణత్యాగం ప్రస్తావిస్తూ సెంటిమెంట్ ను రగిల్చారు. రిజైన్‌చేసిన రోజే పోలీసులు కేసులు పెట్టారని ఇక్కడున్న ఇంతమంది ప్రవీణ్‌కుమార్‌ల పైన ఎన్ని కేసులు పెడతారని ప్రశ్నించారు. హమాలీలు, రైతులు ఉపాధి కూలీలు, ఆటో డ్రైవర్ల బిడ్డలంతా ప్రవీణ్‌కుమార్‌లేనని, ఎంతమందిని కుట్రలు చేసి ఆపగలుగుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజలు సభకు వచ్చేముందు కథన కుతూహలంతో కవాతు నిర్వహించారని, ఇదే ఉత్సాహంతో ప్రగతి భవన్ వైపు పోదామని అన్నారు. కారు కింద పడతారా? ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ వైపు పోదామా? ఢిల్లీ ఎర్రకోటపైన నీలిరంగు జెండాను ఎగరవేద్దామా? అంటూ ప్రవీణ్‌కుమార్ రెట్టించిన ఉత్సాహం నింపారు. నల్లగొండలో జరిగిన ఈ సభ తెలంగాణ రాజకీయాలనే కాదు భారతదేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేస్తుందని చెప్పడం ద్వారా జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. నాకన్నా గొప్పగా నా తెలంగాణ బిడ్డలు బతకాలన్న ధ్యేయంతోనే తన ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1500 మందిని మాత్రమే విదేశాలకు పంపించి గొప్పగా చెప్పుకుంటుందని, బహుజన రాజ్యం వస్తే లక్షలాది మంది విద్యార్థులను విదేశీ విద్యకు పంపిస్తామన్నారు. మా బిడ్డల బతుకులు బాగుపడాలంటే మెరుగైన విద్య, మంచి వైద్యం, ఉపాధి కావాలన్నారు. మా బతుకులను మేమే బాగుచేసుకోవాలంటే బడుగుల రాజ్యస్థాపన అవసరమన్నారు.
ఈ సభ ద్వారా అధికార పార్టీపైన, కేసీఆర్ పైన తీవస్థాయిలో విమర్శలు గుప్పించారు. వరంగల్‌లో ఏడు అంతస్తుల ఆస్పత్రిని కట్టడమే కాకుండా దానిపై హెలిప్యాడ్ నిర్మిస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం మోసపు మాటలు ఎంతో కాలం కొనసాగవని, నల్లగొండ నుంచే ఆయన పాలనకు చరమగీతం పాడుతామని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తుండటంతో నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు అంటూ న్యూస్‌లే తప్ప ఇంతవరకు ఒక్క నోటిఫికేషనైనా ఇచ్చారా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. నాకు పిట్టకథలు చెప్పడంరాదు యాసలో మాట్లాడి వాసాలు లెక్కపెట్టనని, ఒక అన్నగా, తమ్మునిగా ఉన్నదే మాట్లాడతానన్నారు. కొవిడ్ సమయంలో అనేకమంది చనిపోతుంటే ఆదుకున్న వారే లేరన్నారు. ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే తన ఆస్తిని అమ్మి ప్రజలకు పంచాలన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో సృష్టించబోయే బహుజన రాజ్యం ఎంతో గొప్పగా ఉంటుందని బహుజనుల్లో ఆశలు నింపారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. సభ నుంచి గ్రామాలకు వెళ్లిన తర్వాత అవ్వలకు, తాతలకు, పుట్టబోయే బిడ్డలకు బహుజన రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాలని సందేశం ఇవ్వడం ద్వారా పార్టీ విస్తరణకు బాటలు వేశారు. ఒకటోరెండో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సంపాదించడం కాదని, ఒలింపిక్‌లో భారత్ చైనాతో పోటీ పడేలా బహుజన రాజ్యం ఉంటుందన్నారు. తెలంగాణలో బాంచన్ నీ బానిస అనే పదం ఇంకా ఉండటం బాధాకరం అన్నారు. మైనారిటీలు, మాల మాదిగలు, ఆదివాస బిడ్డలు ఏ దేశానికైనా వెళ్లి చదువు చెప్పేలా బహుజన రాజ్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. పార్టీ లక్ష్యాలను చెప్పకనే చెప్పారు. మొత్తంగా ఈ సభ ద్వారా ప్రవీణ్‌కుమార్ తెలంగాణలో బీఎస్పీపై అంచనాలు పెంచేశారు. మరి మున్ముందు ఆర్ఎస్ పి దూకుడు ఇలాగే కొనసాగుతుందా, రాష్ట్రంలో బీఎస్ పి బలమైన పార్టీగా ఎదుగుతుందా చూడాలి.