iDreamPost
android-app
ios-app

ఆర్ఎస్ పి మ‌రో పోరు.. ఎలా ఉండ‌బోతోంది?

ఆర్ఎస్ పి మ‌రో పోరు.. ఎలా ఉండ‌బోతోంది?

రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ (ఆర్ఎస్ పి).. న‌ల్ల‌గొండ వేదిక‌గా రేపు రాజ‌కీయ శంఖారావం పూరించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు, చెబుతున్న ల‌క్ష్యాల‌ను గ‌మ‌నిస్తే.. భారీ అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. ఆయ‌న మాట‌లు బ‌హుజ‌నుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. కొత్త ఆశ‌ల‌ను క‌లిగిస్తున్నాయి. అయితే, బహుజనుల రాజ్యాధికారమే ల‌క్ష్యంగా ఆయ‌న ఎంత వ‌ర‌కు పోరాడ‌గ‌ల‌రు? ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో అంత‌గా ప‌త్తా లేని బహుజన సమాజ్‌వాదీ (బీఎస్పీ) ద్వారా ఆర్ ఎస్‌పి ల‌క్ష్యం సాధించ‌గ‌ల‌రా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప్ర‌వీణ్ మాత్రం నల్లగొండ సభ ద్వారా మరో మారు తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి బీఎస్పీ నాంది పలకబోతుందని ప్ర‌క‌టించ‌డం ద్వారా ప‌క్కా స్కెచ్ తోనే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న విష‌యం అర్థం అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌భుత్వ‌ గురుకులాల్లో మంచి పట్టు సాధించి అనూహ్యంగా రాజీనామా చేసి పతాక శీర్షికల్లోకి ఎక్కారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని, బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆరోజు వెల్లడించారు. ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై క్లారిటీ వచ్చింది. ముహూర్తం కూడా ఖ‌రారైంది. రాజీనామాకు ముందే ఆయన యూపీకి వెళ్లి మాయవతిని కలిసి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఆయన బీఎస్పీలో చేరికపై ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ కూడా తాజాగా ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ప్ర‌వీణ్ కుమార్ కూడా రెండు రోజుల క్రితం పాల్వంచ‌లో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌క‌టించారు. అంతేకాదు.. స‌భ కోసం కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

రాజీనామా చేసిన మ‌ర్నాడు నుంచే ఆర్ ఎస్‌పి స్వేరో కార్య‌క‌ర్త‌ల‌తో పాటు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన బ‌స్తీ నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇల్లు వెదుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నానంటూనే.. రాజ‌కీయ జీవితానికి కూడా బాట‌లు వేయ‌డం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా తర్వాత ముందుగా టీఆర్ఎస్ లో చేరతారని మీడియాలో, సోషల్ మీడియాలో భారీ ప్రచారం సాగింది. ఎస్పీలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారనే విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు ఆయనే ఓ స్వంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా వినిపించింది. అయితే వీటికి ఆయన ఎండ్ కార్డ్ వేశారు. తాను ముందుగా రాజకీయాల్లో రానని ప్రకటించిన ఆయన అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు. రేపు బహుజన స‌మాజ్ వాదీ పార్టీలో చేర‌నున్నారు. ఇందు కోసం నల్గొండలోని ఎన్‌జీ కాలేజ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. బీఎస్‌పి జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేర‌నున్నారు.

పార్టీలో చేరిక‌క‌ను ముందు నుంచే ప్ర‌భుత్వంపై పోరుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆర్ ఎస్‌పి మాట‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. అధికార పార్టీపైనా, కేసీఆర్ పైనా విమ‌ర్శ‌లు చేయ‌డం అందుకు నిద‌ర్శ‌నం. రాష్ట్రంలో అధికార పార్టీ తీరు దుర్మార్గంగా ఉందని, ప్రతిపక్షమనేది లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతోందని తీవ్ర స్థాయిలోనే ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. తాను పాల్గొనే సమావేశాలకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని, విద్యుత్తు కట్‌ చేస్తున్నారని ఆరోపించ‌డం ద్వారా వార్త‌ల్లో నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతేకాకుండా.. ‘‘బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త ఓ ప్రవీణ్‌కుమార్‌ కావాలి. ఐయామ్‌ ఆర్‌ఎస్‌పీ.. మై కలర్‌ ఈజ్‌ బ్లూ… మై సింబల్‌ ఈజ్‌ ఎలిఫెంట్‌’’అని ధైర్యంగా చెప్పుకోవాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌తినిధిగా పేరున్న ఆర్ ఎస్‌పి ప‌ద‌వుల కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, కేవలం గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ మార్చేందుకు రాజకీపార్టీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. దాన్ని బ‌ట్టి రాష్ట్రం మొత్తం పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే, తెలంగాణలో బ‌లంగా పాతుకుపోయిన‌ టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ లే నానా అగ‌చాట్లు ప‌డుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆర్ ఎస్‌పి నీలి తెలంగాణ గా మార్చ‌గ‌ల‌రా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అది సాధ్య‌మ‌వుతుందా? అనేది వేచి చూడాలి.