iDreamPost
iDreamPost
ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా గుజరాతి సినిమా వెళ్లినప్పటికీ ఆర్ఆర్ఆర్ బృందం మాత్రం తమకు అవార్డు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఇటీవలే యుఎస్ లో జరిగిన బియాండ్ ఫెస్ట్ లో భాగంగా అతి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద జరిగిన ప్రీమియర్ కొచ్చిన స్పందన వాళ్లకు కొత్త ఎనర్జీనిచ్చింది. అందుకే ఒకటి రెండు కాకుండా అన్ని విభాగాలకు సంబంధించి జెనరల్ క్యాటగిరీలో నామినేషన్ పంపించుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున దీనికి అధికార ముద్ర లేనప్పటికీ అకాడెమికి కనక విదేశీ చిత్రాల క్యాటగిరీలో ట్రిపులార్ లోనే ఎక్కువ ప్రమాణాలు ఉన్నాయని భావిస్తే మాత్రం పురస్కారం దక్కే అవకాశాలున్నాయి.
దీని కోసం జక్కన్న ప్రత్యేకంగా రెండు నెలల విదేశీ క్యాంప్ ని ప్లాన్ చేసుకున్నారు. జపాన్, చైనా తదితర దేశాల్లో జరగబోయే రిలీజ్ కు హాజరు కాబోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఫారినర్స్ మద్దతు ఆర్ఆర్ఆర్ కు అంతకంతా పెరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ లో దీని హిందీ వెర్షన్ వచ్చినప్పటికీ నెలల తరబడి విదేశీయుల అభినందన వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఆస్కార్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ఖచ్చితంగా ఈ విజువల్ వండర్ ని గుర్తించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాహుబలికి సైతం ఈ స్థాయి సపోర్ట్ దక్కలేదన్నది వాస్తవం. అందులో లేని డాన్సులు, పోరాట దృశ్యాలు ఈ ఆర్ఆర్ఆర్ లో ఉండటం వల్ల కనెక్టివిటీ పెరిగింది.
మరి ఇంతకష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో వేచి చూడాలి. దశాబ్దాల తరబడి ఇండియన్ ఫిలిం మేకర్స్ కి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ని రాజమౌళి సాధిస్తాడా లేదానేది భేతాళ ప్రశ్నగా మారింది. అలా అని దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేకపోలేదు. చరిత్రను కాల్పనిక గాథగా మార్చి తీసిన ఫాంటసీ డ్రామాకి ఆస్కార్ ఎలిజిబిలిటీ లేదన్నది కొందరి వాదన. అదే నిజమైతే ముందు అవతార్ లాంటి వాటిని గుర్తించకూడదు. అసలు సినిమా అంటేనే ఊహాతీత ప్రపంచంలోకి తీసుకెళ్లే అనుభూతి. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ లో మాత్రమే కల్పనలు ఉంటాయనేలా సెటైర్లు వేయడం కరెక్ట్ కాదు. రోజులు గడిచే కొద్దీ ఆర్ఆర్ఆర్ కు మద్దతు అంతకంత పెరుగుతోంది