iDreamPost
android-app
ios-app

RRR Postponed : అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి బృందం

  • Published Jan 01, 2022 | 11:51 AM Updated Updated Jan 01, 2022 | 11:51 AM
RRR Postponed : అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి బృందం

ఉదయం నుంచి జరిగిన ప్రచారానికి అధికారిక ముద్ర పడిపోయింది. వాయిదాని అఫీషియల్ గా ప్రకటిస్తూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఇందాకే అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది. ఎంత కష్టపడినా పరిస్థితులు తమ చేతిలో లేకపోవడం వల్ల, చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూసేయడంతో వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ఇండియన్ సినిమా గర్వపడేలా చేస్తామని మాట ఇచ్చామని, ఖచ్చితంగా సరైన సమయంలో దాన్ని నెరవేరుస్తామని చెప్పారు. కొత్త డేట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అసలు ఆలోచించే సిచువేషన్ కూడా లేదు కాబట్టి ఇక్కడితో సరిపుచ్చారు. మొత్తానికి బ్యాడ్ న్యూస్ అయితే ఇచ్చేశారు.

ఇంకో ఆరు రోజుల్లో చూడాల్సిన గ్రాండియర్ కి బ్రేక్ పడింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఎంత మనస్థాపం కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు అన్ని సెంటర్స్ లో కటవుట్లు బ్యానర్లు సిద్ధం చేసుకున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాట్లలో మునిగి తేలారు. పలుచోట్ల బెనిఫిట్ షోల కోసం కావాల్సిన సరంజామాను రెడీగా ఉంచారు. స్క్రీన్లను సైతం చరణ్ తారక్ ఫ్యాన్స్ పంచుకున్నారు. ఇప్పుడీ పిడుగు లాంటి వార్తతో మొత్తం తలకిందులైపోయింది. డబ్బు వృధా కావడం గురించి కాదు కానీ ఈ ఇద్దరు హీరోలను తెరమీద చూసి దాదాపు మూడేళ్లు కావడంతో ఇంతకన్నా నిరీక్షణని తట్టుకోలేకపోతున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్ఆర్ఆర్ వేసవి కంటే ముందే వచ్చే ఛాన్స్ దాదాపుగా లేనట్టే. ఒకవేళ అంతా అనుకూలిస్తే జనవరి 26ని ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. లేదూ అంటే ఏప్రిల్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ నెలలో విజయ్ బీస్ట్ తో పాటు ఎఫ్3 లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా ఇతర చిత్రాలు ప్రభావితం చెందటం మాత్రం ఖాయమే. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ చేయడమే మంచిది. సగం ఆక్యుపెన్సీతో, ఒమిక్రాన్ టెన్షన్లతో ఇలాంటి గ్రాండియర్లు రిస్క్ తీసుకోవడం బిజినెస్ పరంగా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే వెనుకడుగు వేయడం తాత్కాలికంగా ఫ్యాన్స్ కి బాధ అనిపించినా సరైన సమయంలో రావడమే కరెక్ట్

Also Read : Pushpa : ముందే వచ్చి మంచి పని చేసిన బన్నీ టీమ్