iDreamPost
android-app
ios-app

మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌ల‌కి మూలాలెక్క‌డ‌?

మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌ల‌కి మూలాలెక్క‌డ‌?

లోకంలో పిచ్చోళ్లే ఎక్కువ ఉంటార‌ని చిన్న‌ప్పుడే తెలుసు. స్కూల్ ద‌గ్గ‌ర ఒకాయ‌న ఆంజ‌నేయ‌స్వామితో మాట్లాడేవాడు. పెద్ద‌గా చేతులు తిప్పుతూ అరిచేవాడు. క‌న‌ప‌డ‌ని ఆంజ‌నేయ‌స్వామి కోసం పిల్ల‌ల‌మంతా వెతికేవాళ్లం. అది పిచ్చి అని అపుడు తెలియ‌దు. ఇంకో వ్య‌క్తి లాండ్‌మార్ట్ గేజ్ బ్యాంకులో ప‌నిచేసేవాడు. అంతా నార్మ‌ల్‌గానే ఉండేవాడు. టెలీఫోన్ స్తంభం క‌నిపిస్తే చెవి పెట్టి ఎవ‌రెవ‌రితోనో మాట్లాడేవాడు. పిచ్చివాళ్లు ప్ర‌త్యేకంగానే కాదు, మ‌న మ‌ధ్య కూడా ఉంటార‌ని తెలియ‌జేసింది ఆయ‌నే.

మ‌ద‌న‌ప‌ల్లెలో ఆవిడెవ‌రో పిల్ల‌ల్ని చంపేసింద‌ని గుండెలు బాదుకుంటున్నాం కానీ, ఎంత మంది పిచ్చోళ్ల‌ని చూడ‌డం లేదు, చూసీచూడ‌న‌ట్టు పోవ‌డం లేదు. ఈ ప‌ని చేసింది లెక్చ‌ర‌ర్లు, డ‌బ్బున్న వాళ్లు కాబ‌ట్టి ఇంత క‌వ‌రేజ్‌. ఈ మూర్ఖ‌త్వం పేద వాళ్ల ఇంట్లో జ‌రిగితే ఇంత Importance ఉండేది కాదు. పోలీసులు కూడా ఇంత గౌర‌వంగా కాకుండా క‌ర్ర‌ల‌తో ఆ దంప‌తుల్ని బాదేవాళ్లు.

చ‌దువుతో జ్ఞానం, వివేకం, విచ‌క్ష‌ణ వ‌స్తాయ‌నుకుంటే దీనికి మించిన మూఢ న‌మ్మ‌కం లేదు. ఈ ప్ర‌పంచం మొత్తం ర‌సాయ‌నిక స‌మ్మేళ‌నాల మిశ్ర‌మం అనే ప్రాథ‌మిక సూత్రాన్ని కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన పురుషోత్త‌మ‌నాయుడు మ‌రిచిపోయాడంటే చ‌దువుల సారం, సారాంశం అర్థ‌మ‌వుతాయి. చ‌దువుల మ‌ర్మ‌మెల్ల చ‌దివితి తండ్రి అని ప్ర‌హ్లాదుడు పోత‌న భాగ‌వతంలో అంటాడు. మ‌ర్మం తెలుసుకోలేన‌పుడు ఎంత చ‌దివినా వృథానే. లెక్క‌లు రావాలంటే చాలా తెలివి కావాలి. లెక్క‌ల్లో గోల్డ్‌మెడ‌ల్ రావాలంటే ఎంత తెలివి కావాలి? మ‌రి ఆ త‌ల్లి త‌న తెలివితేట‌ల్ని క‌న్న బిడ్డ‌ల్ని డంబెల్స్‌తో కొట్టి చంప‌డానికి ఉప‌యోగించింది. జాలిప‌డాలి త‌ప్ప , కోపం తెచ్చుకోకూడ‌దు. మ‌నం చూసింది కేవ‌లం కొమ్మ‌ల్ని, అస‌లు వృక్షం, దాని వేర్లు ఇంకొక్క‌డో విస్త‌రిస్తూ ఉంటాయి.

క‌లి వ‌స్తాడు, ప్ర‌పంచం అంత‌మై పోతుంది ఇలాంటి ఉన్మాద న‌మ్మ‌కాలు ఇద్ద‌రు ముగ్గురు వ్య‌క్తుల్లో ఉండ‌వు. వీళ్లంతా ఒక స‌మూహంగా ఉంటారు. ఒక‌ర్నొక‌రు క‌లిసినా క‌ల‌వ‌క‌పోయినా ఈ న‌మ్మ‌కాలు వ్యాపింప‌జేసే నెట్‌వ‌ర్క్ ఉంటుంది. వీళ్లు పైకి నార్మ‌ల్‌గా ఉంటారు. సంద‌ర్భం వ‌చ్చిన‌పుడు వీళ్ల తీవ్ర‌త బ‌య‌ట ప‌డుతుంది. చంద్ర‌ముఖి ప్ర‌స్తావ‌న వ‌స్తే గంగ ఆవేశ ప‌డిన‌ట్టు , క‌లియుగం, శివుడి ప్ర‌స్తావ‌న వ‌స్తే మ‌ద‌న‌ప‌ల్లె ప‌ద్మ‌జ కూడా ఇదే ర‌కంగా వ్య‌వ‌హ‌రించి ఉంటుంది. ఆమె కొలీగ్స్ ఈ విష‌యం గుర్తించినా “మేడం” ఒక్కోసారి అదో టైప్ అనుకుని ఉంటారు. లేదా కొంత మంది ఆమె మాట‌ల‌కి ప్ర‌భావితమైనా అయి ఉంటారు.

భావ‌జాల తీవ్రత ఉంటే, స‌మ‌స్య ఏమంటే ఇత‌రుల్ని దీంట్లోకి లాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అస‌లు ఈ పురుషోత్త‌మ‌నాయుడు కుటుంబానికి ఈ పిచ్చి ఎవ‌రెక్కించారో? వీళ్లు ఎంత మందికి ఎక్కించారో తెలియ‌దు. పోలీసులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌రు. అంత‌లోతైన ప‌రిశోధ‌న చేసే అల‌వాటు వాళ్ల‌కు లేదు. ఇక్క‌డ నిందితులు, బాధితులు ఒక‌రే. కాబ‌ట్టి వాళ్ల‌ని మాన‌సిక రోగులుగా తేల్చి , పిచ్చాస్ప‌త్రిలో చేర్చి కేసుని వ‌దిలించుకుంటారు.

మ‌న‌కి జ్వ‌రం వ‌స్తే తెలుస్తుంది. డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్తాం. మాన‌సిక స‌మ‌స్య‌ల‌కి ఎంత మంది డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళుతున్నారు. మ‌న‌కి పిచ్చి ఉంటే మ‌నం తెలుసుకోలేం. అదే విషాదం. తెలుసుకోవ‌డం ఎదుటి వాళ్ల బాధ్య‌త‌. 100కి 70 మంది డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్ల‌రు. వెళ్లిన 30 మందిలో 20 మంది మందుల్ని చెత్త‌బుట్ట‌లోకి విసిరేస్తారు. మిగిలిన 10 మందిలో ఐదుగురు స‌గం కోర్సే వాడుతారు. దీంతో నార్మ‌ల్‌గా క‌నిపిస్తూ , కొన్ని సంద‌ర్భాల్లో Abnormal గా ప్ర‌వ‌ర్తించే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది.

తిరుప‌తి యూనివ‌ర్సిటీలో ఒకావిడ క్ల‌ర్క్‌గా ప‌నిచేసేవాళ్లు. శుక్ర‌వారం ఉద‌య‌మే గుడిలో అర్చ‌న‌లు చేయించి , ప్ర‌సాదాన్ని అంద‌రికీ పంచి “సాయంత్రం మా ఆయ‌న వ‌స్తున్నాడు” అని చెప్పేది. విష‌యం ఏమంటే ఆమెకి పెళ్లే కాలేదు. భ‌ర్త ఎక్క‌డో వేరే వూళ్లో ఉన్నాడ‌ని భ్రాంతికి గుర‌య్యేది. ఆమె ఇపుడు రిటైర్ కూడా అయ్యారు. ఆమె వ‌ల్ల ఎగ్జామినేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని త‌ప్పులు జ‌రిగి ఉంటాయో ఊహించ‌లేం. అదే యూనివ‌ర్సిటీలో ఒక ప్రొఫెస‌ర్ ఉండేవాడు. లైబ్ర‌రీలో ఆడ‌పిల్ల‌ల ముందు ప్యాంటు విప్పి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడు. ఫిర్యాదులు , విచార‌ణ‌లు అన్నీ జ‌రిగాయి. ఆయ‌న కూడా పాఠాలు చెబుతూ రిటైరై పోయాడు.

తిరుప‌తిలో పోలీస్‌స్టేష‌న్‌లో ఒక లేడీ కానిస్టేబుల్‌కి మాన‌సిక వ్యాధి ఉండేది. స్టేష‌న్‌కు వ‌చ్చిన మ‌గ‌వాళ్లు త‌న‌తో అస‌భ్యంగా మాట్లాడార‌ని కంప్లైంట్‌. దాంతో పోలీసులు చాలా మందిని చిత‌క‌బాదారు. మాకే పాపం తెలియ‌దు, స్టేష‌న్‌లో లేడీ కానిస్టేబుల్‌తో అస‌భ్యంగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తామ‌ని వాళ్లు నెత్తీనోరూ మొత్తుకున్నా దెబ్బ‌లు త‌ప్పేవి కావు. మెల్లిగా పోలీసుల‌కు అర్థ‌మైంది. స‌మ‌స్య ఎక్క‌డుందో! ఆమెని డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసినా వీలు కాలేదు.

జ‌ర్న‌లిస్టుగా చాలా మందిని చూసిన త‌ర్వాత అర్థ‌మైంది ఏమంటే ఆస్ప‌త్రుల్లో కంటే బ‌య‌టే వ్యాధిగ్ర‌స్తులు ఎక్కువ ఉన్నారు. ఉమ్మ‌డి కుటుంబాలు అంత‌రించే స‌రికి క‌నీసం మాట సాయం చేసేవాళ్లు కూడా లేరు. ఎవ‌డి లోకం వాడిది. అందుకే లోకం ఉలిక్కిప‌డే ప‌నులు జ‌రుగుతున్నాయి.