iDreamPost
android-app
ios-app

కోడి పందేలకూ ఒక శాస్త్రం……

కోడి పందేలకూ ఒక శాస్త్రం……

బరిలో అడ్డంగా నుంచున్నోళ్ళని చుట్టూ తిరగమని చెప్తూ.. చేతిలో చెర్నకోలతో ఓ రౌండు దెబ్బేసేసేరు ఆర్గనైజరు చిన్న రాజు గారు. అలా వేస్తన్నప్పుడే ఫెన్సింగికవతల ఎంత మంది కోళ్ళట్టుకుని నుంచున్నారో ఓ లుక్కు కూడా ఏసేసారు. సంక్రాంతి రోజు అయిదయిపోతుంది. యిక్కడ జూస్తే పందెగాళ్ళింకా కోళ్ళతో రడీగా నుంచుని పందేలకోసం ఎదురు చూస్తన్నారు. అప్పుడే తెఁవిలే యవ్వారం కాదిది అనుకుని, బరి బయటకెళ్ళేరు ఓ రౌండు బ్రాండీ బిగించేద్దామని. ఫోనులో.. బరి చుట్టూ సీరియల్ లైట్లు బిగించమని పురమాయించేసేరు.

చేతిలో కోడి రెడీగా ఉన్నా, బరిలోకి దిగాల్సినంత పందెం యెమౌంటు చేతిలో లేపోవడంతో యెవరైనా పందెగాళ్ళొచ్చి సపోర్టుకొత్తారేమోనని చూస్తన్నాడు గోదారికవతల శివకోడు నుంచి నెమలి రకం పుంజునట్టుకొచ్చిన ఒకడు. ఏడాదికోసారి సొంతూరొచ్చి పందేల్లో డబ్బులు పోగొట్టుకునే బీమలాపురం కుర్రగాడొకడొచ్చి సేతుల్లో డబ్బులెట్టుకుని అటూ యిటూ తిరుగుతుంటే.. “అబ్బాయి గారూ.. ఓ పదేలు కలిపేరంటే నా పుంజుతో బరిలోకెళ్ళిపోచ్చు. ఓ చెయ్యేత్తారేంటీ?” అనడిగాడు ఆశగా.

అయితేని, యే పుంజేదో, యే రకవేదో తెలీని ఆ బీమలాపురం కుర్రోడు, ఈ నెమలిని కాసేపెత్తుకుని సెల్ఫీలు తీసుకున్నాక, “దాని కాల్లేంట్రా నాయనా.. అంత లావున్నాయి. యేఁవెట్టి పెంచేవ్? దీన్నేసుకుని బరిలోకెళ్తే కదల్లేదిది. కోడసలెలాగుండాల? నైసుగా ఉండి గబగబా పరిగెత్తేలా ఉండాలి. యిదిగానెళ్ళిందంటే.. కదల్లేక నాలుగడగులేసేసరికి దీనికి కత్తి దిగిపోద్ది నాకు పదేలు బొక్కడిపోద్ది” అని పది మందిలో గట్టిగా అనేసి పరువు తీసేసే సరికి చుట్టూ ఉన్న పందెగాళ్ళందరూ ఓ.. అని తెగ నవ్వేసేరు. భలే నామోషీ అయిపోయింది, ఆ నెమలినెత్తుకున్న శివకోడు మనిషికి.

“అత్తగారు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు” అన్నట్టు.. ఆ కుర్రెదవ అన్న మాటలు కన్నా, పక్కన కాకి రకం పుంజునెత్తుకున్న యేల్పూరు మనిషి నవ్విన ఎటకారం నవ్వు కోడి కత్తి కన్నా లోతెక్కువ దిగినట్టు కలుక్కుమంది. దాంతో మాటా మాటా పెరిగి.. “నీ పుంజెంతంటే.. నీ పుంజెంతని” గొడవెట్టుకునేదాకా ఎల్లి‌, అసలు పందెమేం లేకుండా కోడికి కోడి లెక్కన బరిలో దిగేద్దాం అన్న దాకా వచ్చేసాయి పౌరుషాలు. బరికి కట్టాల్సిన డబ్బులు మాత్రం చేతిలో పెట్టుకుని.. యేదేవైనా ఈ రోజు పందెం జరగాల్సిందేనని పట్టుబట్టి లోపలికొచ్చేరు. ఈళ్ళూరికే పంతానికి పందేనికొచ్చేరు తప్ప సరదాకి కాదని, తర్వాతేమైనా తేడాపాడాలొస్తే కొట్టేసుకునే వరకూ ఎల్లే అవకాశం ఉంది కాబట్టి రాజు గారు ఈ పందేన్ని ఎలా అయినా సైడేసేద్దామని చూస్తున్నారు. అదీ కాక, ఒకటి కాకి, ఇంకోటి నెమలి. రెండూ దగ్గర రంగుల కోడి పుంజులు.

అసలే కుక్కుట జ్యోతిష్యాన్ని మొత్తం చదివేసిన రాజు గారికి మేటరర్ధమైపోయింది. ఈ రెండూ గనక బరిలోకొస్తే.. పందెం తెమలదు. అసలే సాయంకాలమైతే అశ్వినీ నక్షత్రం, పైగా చీకటడ్డాక రెండు రకాల పుంజుల బలాబలాలు సమానంగా ఉంటాయి. మామూలు పందెం కాసేవోళ్ళయితే ఇయ్యన్నీ చూసుకునే దిగుతారు. కనీసం దగ్గర్రంగులకోళ్ళనయితే మట్టుకి పందెంలోకి దింపరు. కాని యిక్కడ యీ యెదవలకి యిగో ఫీలింగుతోటెచ్చేరు. గెంటాల్సినంత యెనక్కి గెంటడానికి చూసేరు రాజు గారు పందెం ఆపడానికి. కానీ బరి బయట గొడవ చూసిన పై పందెగాళ్ళు ఎయ్యాల్సిందే అని పట్టుబట్టడంతో.. కోడి కాళ్ళకి కట్టే కత్తులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసి, కట్టాక బరి బయటకెళ్ళిపోయారాయన. ఎల్తా ఎల్తా.. “పందెం కాయంకండ్రోయ్. యిదేం అర్రీ బుర్రీగా తేలే యవ్వారం కాదు. గంట పట్టుద్ది” అనేసెళ్ళిపోయారు. బరిలో పందెం మొదలైంది.

మొదటి రెండు నిమిషాల్లోనే కాకి నెమల్ని నాలుగు దెబ్బలేసింది. కింద పడ్డ నెమలి లేవడానికి తెగ ప్రయత్నించింది. లేస్తన్నప్పుడల్లా కాకి, నెమలి నెత్తి మీదున్న ఈకల్ని పొడిచి పొడిచీ ఇంకా రెచ్చగొట్టేసింది. పాపం నిలబట్టానికే నానా యాతన పడుతున్న నెమలింకయిపోయిందని.. కాకి మీద పందెం కాసినోళ్ళు నవ్వేసుకుంటున్నారు. పది నిమిషాలైనా పందెం పూర్తవలేదు. యెనక ఆల్రడీ కోళ్ళట్టుకుని లైన్లో నుంచున్నోళ్ళు కంగారడిపోతున్నారు బరిలో దిగడానికి.

పడ్డ నెమలి లేచి నుంచుంటుంది, కాకిని పొడుస్తుంది తప్ప ఎగిరి కాలితో దెబ్బలేయలేకపోతుంది. అక్కడక్కడా కత్తి దిగి రక్తమొస్తున్న చోట ఇసుక తీసి అంటించేరు. నోట్లో నీళ్ళేసుకుని కోళ్ళు మీదకి ఊదేరు. ఏమైనా మత్తూ నీరసం ఉంటే వదిలిపోతాయని. కాకి ఈకల్ని నెమలి ముక్కుతో గుచ్చే వరకూ వచ్చింది కానీ… యే పుంజూ కిందపడట్లేదు. నెమలి పవరింతే అన్నట్టు ఆ యేల్పూరు మనిషి ఇంకా ఎటకారంగా నవ్వుతున్నాడు. నెమలిని మాత్రం రెచ్చగొట్టడానికి దాని రెక్కలు రువ్వీ నెత్తి మీద నిమిరి మళ్ళీ మళ్ళీ కిందకి దించుతున్నాడు శివకోడు మనిషి. ఈళ్ళని జాగ్రత్తగా పక్కకెట్టేసి వేరే కోళ్ళతో వేరే పందెం మొదలైపోయింది.

అసలు కాలికి కత్తి కట్టాక పది నిమిషాల కన్నా ఎక్కువ జరగదు పందెం. అలాంటిది ఈళ్ళది తేలటం లేదు. బరవతలున్న పై పందెగాళ్ళు కూడా కాకీ నెమలినీ వదిలేసి తర్వాత పందేనికొచ్చిన పర్ల – డేగ మీద పందెం పెట్టేస్తున్నారు. కాకి కింద పడింది. రెండూ లేస్తున్నాయి, పొడుచుకుంటున్నాయి. యేదీ లొంగట్లేదు, అలా అని గట్టిగా ఎగిరి కత్తితో పొడుచుకోట్లేదు. కాసేపు ఎనక్కి లాగి మళ్ళీ నీళ్ళూది నీళ్ళు తాగించి ఇసకంటించి కత్తి బిగించి దింపేరు. ఆ పుంజుల తాలూకా మనుషులు తప్ప మిగతా వాళ్ళు చూడట్లేదు. ఈ లోపు మామూలియ్యి నాలుగీ పందేలైపోయాయి.

అరగంట దాకా పందెం ఏంట్రా బాబా అనుకున్న జనం నెమ్మదిగా ఈ పందెం చూట్టం మొదలెట్టేరు మళ్ళీ. కాకి పడుకుంటే నెమలి పొడుస్తుంది, నెమలి పడుకుంటే కాకి పొడుస్తుంది. పొడిచి పొడిచీ ఆటి ముక్కులరిగిపోయాయేమో అన్నట్టుంది పరిస్థితి. చుట్టూ నుంచుని అటూ ఇటూ తిరగాల్సిన బరిలో జనం నీరసంతో కుర్చుని చూస్తన్నారు. ఏదీ తగ్గట్లేదు ఏదీ లొంగట్లేదు. గంట పైగా సాగిన పందెం మొదటి సారి చూసారా జనం అంతా.

ఇంకాసపట్లో ఏది గెలుస్తాదో తెలిసేదాకా ఉందామనుకున్నాడా బీమలాపురం కుర్రోడు. కానీ.. ఎందుకో ఆడికి చూడాలనిపించలేదు. కొన్ని కొన్ని అనుమానాలు తీరక బుర్ర గోక్కోడానికి బాగుంటుందని ఆడి ఫీలింగు. ఇంత కొట్టుకున్నాక ఏది ఓడిపోయినా.. యే పందెం వేయని ఆ జనానికి యే నష్టం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిక ఈనాడోడు వేసే “నిజమైన క్రికెట్టు గెలిచింది” లాంటి హెడింగులు ఇక్కడ పెట్టాలేమో ఇంక. పక్క బరిలో పందెం చూసి జనం అరుస్తున్నారు. ఈ బరిలో పందెం అవదని ముందే తెలిసినా రాజు గారు.. రెండో రౌండు బ్రాండీ బిగించడానికి రడీ అయిపోయారు.