Idream media
Idream media
సింహం మనుషుల మీద పగబట్టే సినిమా చూశారా? మృగరాజు చూశాం కదా? ఔను అది చిరంజీవి ప్లాప్ సినిమా. ఇంగ్లీష్‌లోంచి కాపీ కొట్టారు కానీ, అదీ సరిగా చేతకాలేదు. పాటలు, లవ్‌స్టోరీ, చిరంజీవి బిల్డప్ అన్నీ కలగాపులగం చేసి సింహం కంటే చిరంజీవి గర్జనే ఎక్కువై పోయింది. అయినా చిరంజీవి కొడితే పది మంది గాల్లోకి లేవాలి కానీ, తుపాకీ పట్టుకుని సింహం కోసం ఎదురు చూడడం జనాలకి నచ్చలేదు. ఇప్పుడా గోల ఎందుకు భయ్యా అంటారా? అలాంటి సినిమానే ఇంగ్లీష్‌లో “రోగ్” అని వచ్చింది.
“ప్రిడేటర్” గుర్తుందా? ఒక ఆపరేషన్ కోసం హీరో కొందరితో కలిసి అడవిలోకి వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు “ఎలియన్” ఒకొక్కరినే చంపుతుంది. అదే కథ ఎలియన్‌కి బదులు ఆడ సింహమైతే “రోగ్” అవుతుంది. ఆగస్టులో రిలీజ్ అయిన సినిమా (HULU -OTT ) గురించి ఇప్పుడు మాట్లాడ్డం ఎందుకు?
ఎందుకంటే ఇది మామూలు పగ, ప్రతీకారాల సినిమానే అయినా ఆఫ్రికా దేశాల్లో అంతరించి పోతున్న సింహాల గురించి , అమానుషంగా వాటిని చంపి చర్మాన్ని , ఎముకలని ఎగుమతి చేసి డబ్బు సంపాదిస్తున్న గ్యాంగ్‌లని చూపిస్తుంది. ఆఫ్రికా దేశాల ప్రత్యేకత ఏమంటే మన కోళ్ల ఫారంలా , సింహాల ఫారం పెంచుకోవచ్చు. సింహాల ఎముకల్ని చట్టబద్ధంగా ఎగుమతి చేయొచ్చు.
దక్షిణాఫ్రికా , ప్రపంచంలోని దరిద్రపు దేశాల్లో అదొకటి. రూపాయికి విలువ లేదని మనం ఏడుస్తుంటే మన రూపాయికి ఐదు ఆఫ్రికన్ రాండ్స్. ఇక్కడే గాంధీని రైల్లోంచి తోసేశారు. దానికి ప్రతీకారంగా ఆయన తెల్లవాళ్లని దేశంలోంచి తరిమేశాడు. గాంధీని గాంధీగా కాకుండా ఒక గుజరాతీగా వేరు చేసి చూస్తే చాలా ప్రత్యేకతలు కనిపిస్తాయి. విదేశాల్లో చదువు గురించి కలలో కూడా మిగతా వాళ్లు ఊహించని కాలంలో గాంధీ లండన్‌లో లా చదివాడు. ఆయనది సంపన్న కుటుంబం కాకపోయినా సాధించాడు. అవకాశాలను వెతుక్కుంటూ గుజరాతీయులు ఎంత దూరమైనా వెళ్తారు అనడానికి ఇది ఉదాహరణ. ఈ రోజు అమెరికా మొత్తం పటేల్ బ్రదర్సే ఉన్నారు కానీ, వేరే వాళ్లు లేరు.
గాంధీ కూడా చదువు తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లాడు. ఇపుడైతే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు చేసేస్తున్నారు కానీ నూరేళ్ల క్రితం దీనికి చాలా ధైర్యం కావాలి. తర్వాత భారతీయుడిగా పరిణామ క్రమం చెందినా తొలి రోజుల్లో గాంధీ కూడా గుజరాతినే. అపుడు దేశాన్ని గాంధీ చేతిలో పెడితే స్వాతంత్ర్యం తెచ్చాడు. ఇపుడు కూడా దేశాన్ని గుజరాతీయుల చేతుల్లోనే పెట్టాం. వీళ్లెవరూ గాంధీ వారసులు కాదు. ఉన్న స్వాతంత్ర్యాన్ని ఊడగొట్టే వరకూ నిద్రపోరు.
రోగ్ సినిమా నుంచి రోగ్ పాలిటిక్స్‌లోకి అనవసరంగా జంప్ అయ్యాం. మళ్లీ సింహాల గురించే మాట్లాడుకుందాం. సింహం రక్తం తాగుతుందని కథలు చెప్పుకున్నాం కానీ, సింహాల రక్తం తాగే హంతకులు దక్షిణాఫ్రికా నిండా ఉన్నారు. వందలాది సింహాలు దయనీయ స్థితిలో వీళ్ల ఫారాల్లో మగ్గుతున్నాయి. వాటికి తిండి లేక ఒళ్లంతా జబ్బులు.
సింహాల ఎముకల చూర్ణం తాగితే జబ్బులు తగ్గుతాయని వెయ్యేళ్ల కిందటి ఆయుర్వేదంలోని నమ్మకం. అది మరణశాసనంగా మారింది. చైనా , వియత్నాం, థాయ్‌లాండ్‌లో వాటికి భలే గిరాకీ. స్మగ్లర్లకి లక్షలాది డాలర్ల సంపాదన రావడంతో సింహాలకి ప్రత్యేక కబేళాలు Start చేశారు.
ఇది కాకుండా సింహాల వేటకి ప్రత్యేక ప్యాకేజీ ఉంది. రూ.20 లక్షలు మనవి కాదనుకుంటే సింహాన్ని వేటాడొచ్చు. దాని తలని ఇంట్లో అలంకరించుకోవచ్చు. ముఖ్యంగా బ్రిటీష్ , అమెరికన్లని ఇది ఆకర్షిస్తోంది.
సింహానికి స్వల్పంగా మత్తు మందు ఇచ్చి ఐదు కిలోమీటర్ల ఫెన్సింగ్ ఏరియాలో వదులుతారు. మత్తు ఎందుకంటే అది దాడి చేయకుండా ఉండడానికి. గన్ తీసుకుని జీపులో వేటగాళ్లు బయలుదేరుతారు. పారిపోలేని సింహాన్ని కాలుస్తారు.
ఇది కాకుండా సింహం పిల్లలతో సెల్ఫీలు దిగితే ఒకరేటు. ముసలి సింహాలను వాకింగ్ తీసుకెళితే ఇంకో రేటు. సింహంతో సెల్ఫీ దిగితే ఇంకో రేటు.
రోగ్ మామూలు కమర్షియల్ సినిమా అయినా చాలా కొత్త విషయాల్ని ప్రపంచానికి చెప్పింది. స్లాటర్ హౌస్‌లో తప్పించుకున్న ఒక ఆడ సింహం పగతో దాడి చేయడం కథ. ఒక గవర్నర్ కూతురిని కిడ్నాప్ నుంచి విడుదల చేయించి తిరిగి వస్తున్న హీరోయిన్ బృందం ఈ సింహాన్ని ఎలా ఎదుర్కొంది అనేది కథ.
OTTలో కూడా దీనికి డబ్బులు బాగానే వచ్చాయి. తొలి గంటసేపు మనం ఊపిరి పీల్చుకోలేం. అంత బాగా తీశారు. సెకండాఫ్ కొంచెం సినిమాటిక్‌గా అనిపిస్తుంది.
సింహాన్ని అడవికి రాజు అంటారు. దానికి అడవే లేకుండా చేసి బోన్లలో మాడుస్తున్న వాళ్లని ఏమనాలి? ఫారాలకి పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ప‌్రకృతి కార్చే కన్నీళ్లే వైరస్‌లుగా మారుతున్నాయి.
కొసమెరుపు ఏమంటే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ వాళ్లు సింహాల ఫారాల గురించి , చావు బతుకుల మధ్య ఉన్న సింహాల గురించి చూపిస్తే అధికారులు స్పందించి ఫారం నిర్వాహకున్ని అరెస్ట్ చేశారు. వాడు ఎవడంటే గవర్నమెంట్ నియమించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ కీలక సభ్యుడు. అదే మనదేశంలో అయితే వాడు అటవీశాఖ మంత్రైనా ఆశ్చర్యం లేదు. నేను సింహం లాంటి వాన్ని అని మన సినిమాల్లో డైలాగ్‌లుంటాయి. ఆఫ్రికా వెళ్లి చూస్తే తెలుస్తుంది. సింహానికి ఏ గతి పట్టించారో!