iDreamPost
iDreamPost
ఎంతసేపూ మర్డర్ మిస్టరీలు, హారర్లు తప్ప ఇంకే జానర్ పట్టన్నట్టు మునిగిపోతున్న వెబ్ సిరీస్ లలో కొత్త మార్పుగా కనిపించింది రాకెట్ బాయ్స్. సినిమాల విషయంలో వెనుకబడినా క్వాలిటీ వెబ్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సోనీ లివ్ నుంచి వచ్చిన కొత్త ఆడిషన్ ఇది. అభయ్ పన్ను దర్శకత్వం వహించగా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయించిన ఆర్ట్ వర్క్, పెట్టిన బడ్జెట్ చాలా సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ప్రమోషన్ స్టేజి లోనే మంచి హైప్ తెచ్చుకున్న రాకెట్ బాయ్స్ ని ప్రస్తుతానికి తెలుగు ఆడియోలో ఇవ్వలేదు కానీ న్యాచురాలిటీ కోసమైనా హిందీలోనే చూడటం మంచిది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.
ఇది భారతీయ వైజ్ఞానిక చరిత్రలో గొప్ప మైలురాళ్ళు అందించిన ఇద్దరు శాస్త్రవేత్తల జీవన ప్రయాణం. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా(జిమ్ సరబ్), డాక్టర్ విక్రమ్ అంబర్ లాల్ సారాబాయ్(ఇశ్వక్ సింగ్)లు 1940 నుంచి 1963ల మధ్య ఈ స్నేహితుల మధ్య వృత్తిపరమైన పరిణామ క్రమంగా దీన్ని తీశారు, ఎలాంటి సాంకేతిక లేని రోజుల్లో వాళ్ళు ఎదురుకున్న సవాళ్లు, ఇబ్బందులు పెట్టిన మనుషులు, స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, సహకరించిన సంఘాలు, ఊహించని సంఘటనలు వీటన్నిటి కలయికే ఈ రాకెట్ బాయ్స్. మధ్యలో ఏపిజే అబ్దుల్ కలాం, జవహర్ లాల్ లాల్ లాంటి గొప్ప పర్సనాలిటీలు ఈ వెబ్ సిరీస్ లో దర్శనమిస్తాయి.
దర్శకుడు అభయ్ పన్ను ఒకరకంగా సాహసం చేశాడని చెప్పాలి. ఎంతసేపూ క్రికెట్ స్టార్లు, సినిమా తారలు అంటూ బయోపిక్కులను సైతం రొటీన్ గా మారుస్తున్న ట్రెండ్ లో ఇప్పటి తరం కచ్చితంగా తెలుకోవాల్సిన ఇలాంటి కథలను ఎంచుకోవడమే కాదు మెప్పించేలా తీయడంలో ఇతని ప్రతిభ కనిపిస్తుంది. క్యాస్టింగ్ ని సంపూర్ణంగా వాడుకోవడంలోనూ తన టేస్ట్ చూపించాడు. రెజినా లాంటి సౌత్ ఆర్టిస్టులు ఒకరిద్దరు ఉన్నారు. వినడానికి డ్రైగా అనిపించే ఇలాంటి సబ్జెక్టుని అభయ్ డీల్ చేసిన విధానం అన్ని ప్రశంసలకు అర్హత సాధించింది. కుర్చీ చివర్లో కూర్చునే థ్రిల్లర్లు ఆశించకుండా ఓ కొత్త అనుభూతి కావాలంటే రాకెట్ బాయ్స్ మిస్ చేయొద్దు
Also Read : The Great Indian Murder : ది గ్రేట్ ఇండియన్ మర్డర్ రిపోర్ట్