iDreamPost
android-app
ios-app

Uttar Pradesh Elections – రోడ్డు చుట్టూ తిరుగుతున్న రాజకీయం

  • Published Nov 21, 2021 | 8:03 AM Updated Updated Nov 21, 2021 | 8:03 AM
Uttar Pradesh Elections – రోడ్డు చుట్టూ తిరుగుతున్న రాజకీయం

దేశంలో అతి పెద్ద రాష్ట్రంలో రాజకీయం ఒక రహదారి చుట్టూ తిరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ప్రారంభించిన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ ఘనత తమదంటే కాదు.. తమదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీలు తగువులాడుకుంటున్నాయి. ఇది అభివృద్ధికి జీవనాడిగా నిలుస్తుందని, మూడేళ్ల కాలంలో పూర్తి చేశామని అటు దేశ ప్రధాన నరేంద్రమోడి.. ఇటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌లు గొప్పగా ప్రచారం చేస్తున్నారు.

అసలు ఈ ప్రతిపాధన తన హాయాంలోనిదేనని… నిర్మాణం ప్రారంభమైంది కూడా తమ పార్టీ అధికారంలో ఉండగానేనని ప్రతిపక్ష నాయకడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ చెప్పుకుంటున్నారు. ‘సమాజ్‌వాది పార్టీ ప్రారంభించిన పని మీ ఘనతగా ఎలా చెప్పుకుంటారు?’ అని అఖిలేష్‌ ప్రధానిని ఎద్దేవా చేశారు. ఆయన మరో అడుగుముందుకు వేసి ప్రారంభోత్సవానికి ముందు రోజు ఇది ‘సమాజ్‌వాది పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌’వే అని ట్వీట్‌ చేశారు.

దేశ ప్రధాన నరేంద్ర మోడీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ని ప్రారంభించారు. యూపీ అభివృద్ధికి ఇది కీలకమైలురాయి కానుంది. సుమారు 341 కిమీల ఈ రహదారిని శంకుస్థాపన చేసిన మూడేళ్లకే ప్రారంభించామని బీజేపీ ప్రచారం చేసుకుంటుండగా, పూర్తిస్థాయి నిర్మాణం కాకున్నా ఎన్నికల లబ్ధికోసం ప్రారంభించారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అయోధ్య వంటి విషయాలు ప్రచారంలో ఉండాల్సి ఉంది. కాని చిత్రంగా పూర్వాంచల్‌ రహదారి చుట్టూ ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుండడం విశేషం. ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ సైతం ఈ రహదారి తమ ఘనతగా పదేపదే చెప్పుకున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఈ తరహా అభివృద్ధి చేస్తామని ఘనంగా చాటుకున్నారు.

యూపీ అభివృద్ధిలో కీలకం:

అధికార, ప్రతిపక్ష పార్టీల ఘనత ఎలా ఉన్నా పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానుంది. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోను తూర్పు ఉత్తరప్రదేశ్‌కు అనుసంధానంగా ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. లక్నో నుంచి కేవలం మూడున్నర గంటల్లో బీహార్‌లోని బక్సర్‌కు చేరుకునే అవకాశముంది. కేంద్రం ప్రభుత్వం ఈ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి రూ.22 వేల 494 కోట్లు కేటాయించింది. 2018 జులైలో శంకుస్థాపన చేశారు. రికార్డుస్థాయిలో నిర్మాణం పూర్తి చేశారు. ఇది లక్నో, సుల్తాన్‌పూర్‌ జాతీయ రహదారిలో ఉన్న చాన్ద్‌సారియా గ్రామం వద్ద ప్రారంభమై ఘాజీపూర్‌ జిల్లా హైదరాయ్‌ వద్ద ముగుస్తుంది. దీనిని ఉత్తరప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ అథారటీ నిర్మించింది.

లక్నో, బారాబంకి, అమేథి, సుల్తాన్‌పూర్‌, ఫైజలాబాద్‌, అంబేద్కర్‌నగర్‌, అజామ్‌ఘడ్‌, మవూ, ఆయోధ్యా, ఘాజీపూర్‌ జిల్లాల మధ్య ఈ రహదారి నిర్మాణం జరిగింది. పయాగ్‌రాజ్‌, వారణాసి వంటి నగరాల మీదుగా కూడా వెళుతుంది. ప్రస్తుతం ఇది ఆరులైన్ల రహదారి, భవిష్యత్‌లో ఎనిమిది లైన్లకు విస్తరించేందుకు వీలుగా నిర్మించారు. రహదారిలో 18 ఓవర్‌ బ్రిడ్జీలు, 7 రైలు వంతెనలు, మరో 7 పొడవైన వంతెనలు, 104 చిన్న వంతెనలు, 13 చోట్ల ఇంటర్‌ చేంజ్‌ నిర్మాణాలు జరిగాయి. 271 చోట్ల అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ వంద కిమీలకు ఒక చోట ప్రయాణీకులు విశ్రాంతి మందిరాలు ఏర్పాటు చేశారు.

రహదారి మీదనే ఎయిర్‌ స్ట్రిప్‌:

ఈ రహదారికి మరో ఘనత దీని మీద భారతీయ వాయుసేన ఎయిర్‌ స్ట్రిప్‌ను ఏర్పాటు చేసింది. యుద్ధాలు జరిగినప్పుడు అత్యవసర సమయంలో ఈ రహదారి మీద భారతీయ వాయు సేనకు చెందిన ఫైటర్‌ జెట్లు, ఇతర రవాణా విమానాలు దిగేందుకు వీలుగా 3.50 కిమీల మేర రన్‌వే నిర్మాణం జరిగింది. సుల్తాన్‌పూర్‌ వద్ద దీని నిర్మాణం జరిగింది. దేశంలో ఇలా ఏర్పాటు చేసిన ఎయిర్‌ స్ట్రిప్‌లో ఇది రెండవది. భారత్‌ 2021 సెప్టెంబరు రాజస్థాన్‌లోని సత్కాగాంధావ్‌ రహదారిపై నిర్మాణం చేశారు. చైనాతో యుద్ధా మేఘాలు కమ్ముకున్న వేల ఈ రహదారి వాయుసేనకు కీలకం కానుంది.