iDreamPost
android-app
ios-app

విభజించు పాలించు..ఆర్కే నయా పాచిక

విభజించు పాలించు..ఆర్కే నయా పాచిక

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం తన పేపర్లో కొత్తపలుకు పేరుతో వ్యాసాలు రాస్తుంటారు. అందులో రాష్ట్ర రాజకీయాలు, పరిణామాలపై తనదైన శైలిలో విశ్లేషణలు గావిస్తుంటారు. అయితే రాధాకృష్ణ విశ్లేషణ కంటే విషాపురాతలకే ప్రాధాన్యం ఇస్తాడంటూ ఆయన వ్యవహార శైలి, రాతలు నచ్చని వారు విమర్శిస్తూ ఉంటారు. కాగా  తాజా కొత్త పలుకును చూస్తుంటే ఆర్కే వైసీపీ అధినాయకత్వంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడా అనే అనుమానం కలుగుతోంది.

ఆర్కే కొత్తపలుకు ఎక్కువగా వైఎస్ జగన్ చర్యలు, ఆయన వ్యవహార శైలిని విమర్శించే కోణంలోనే సాగుతుంది. దీనికి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతా, రాష్ర్టముఖ్యమంత్రా అనే తేడా లేదు. అలా ఎందుకు సాగుతుందనే సందేహం పాఠకులకు కూడా రాదు. ఎందుకంటే ఆర్కే రాతల వెనకున్న అర్ధం పరమార్థం జగద్వికితమే. తాజా కొత్తపలుకులోనూ వైఎస్ జగన్ పై తన పాండిత్యాన్ని ప్రదర్శించారు ఆర్కే. అయితే దానికి తోడు వైసీపీ అధినాయకత్వంలో చిచ్చుపెట్టేలా…ఆంగ్లేయుల ‘విభజించు పాలించు’ ఫార్ములాను ప్రయోగించడమే ఈ వారం స్పెషల్. 

బ్రిటిష్ వారు భారతదేశానికి తొలుత వ్యాపారానికి వచ్చిన సంగతి తెలిసిందే. అలా వచ్చి స్థిర పడిన ఆంగ్లేయులు భారత రాజులను ఒకరిపైకి ఒకరిని రెచ్చగొట్టి తద్వారా ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించారు. ఈ క్రమంలో ఆంగ్లేయులు అనుసరించిన వ్యూహం విభజించు పాలించు. కాగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆర్కే ఇప్పుడు ఆంగ్లేయుల వ్యూహాన్నే ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి మధ్య కొద్ది రోజుల కిందట ట్విట్టర్లో విమర్శల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సుజనాచౌదరి బ్యాంక్ ఎగవేతలను, ఇతరత్రా ఆర్ధిక అవకతవకలను బయటపెడతానంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆర్కే…గతంలో సుజనాకు సీఏగా వ్యవహరించిన విజయసాయి… ఇప్పుడు ఆయన్నే బెదిరిస్తున్నాడు…భవిష్యత్తులో వైఎస్ జగన్ పరిస్థితీ ఇంతే కావొచ్చు అంటూ ఓ పాచిక విసిరేశాడు.

అయితే వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల మధ్య మంచి అవగాహన ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా అప్పట్లోనే అప్రూవల్ గా మారి జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తే కేసు నుంచి తప్పిస్తామనే ఆఫర్లు విజయసాయిరెడ్డికి వచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. అయినప్పటికీ జైలుకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు కానీ, జగన్ కు వ్యతిరేకంగా మారలేదు. దీన్ని భట్టి చూస్తుంటే ఆర్కే విసిరిన విభజించు పాలించు పాచిక పారడం కష్టమే అని చెప్పొచ్చు.