iDreamPost
iDreamPost
కరోనా నేపథ్యంలో కేంద్రం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా లాక్ డౌన్ గురించి ప్రధాని ప్రకటన చేశారు. ప్రతీ ఒక్కరూ పాటించాలని ఆయన సూచించడమే గాకుండా దానికి తగ్గట్టుగా వివిధ ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా మీడియా సంస్థలతో ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ యంత్రాంగం సేవలను అభినందిస్తున్నారు. అదే సమయంలో మీడియా ప్రతినిధుల సర్వీసుని కూడా మెచ్చుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా మీడియా నుంచి సూచనలు కూడా స్వీకరించే ప్రయత్నం చేశారు. తొలుత దేశంలోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలతో సోమవారం ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న మీడియా సంస్థల్లో రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఆజ్ తక్, ఏ బి పి, టీవీ 9 గ్రూప్, న్యూస్ 18, జీ గ్రూప్ తో పాటుగా తెలుగు మీడియా సంస్థ సాక్షి టీవీతో కూడా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సాగింది.ఈ కాన్ఫరెన్స్ లో సాక్షి టీవీ తరుపున మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ తో పాటుగా నలుగురు పాల్గొన్నారు.
ఆ తర్వాత బుధవారం కూడా మోడీ ఇలాంటి కార్యక్రమం కొనసాగించారు. అందులో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, మళయాళ మనోరమ,హిందుస్థాన్ టైమ్స్, హిందూ,పంజాబ్ కేసరి మరి కొన్ని వివిధ ప్రింట్ మీడియా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడారు. ఇందులో ఈనాడు సంస్థల తరుపున రామోజీరావు కూడా వీడియో కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. ఆ సందర్భంలో పత్రికల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయంలో వివరణతో పాటుగా, కవరేజీ విషయంలో విలేకర్లకు ఎదురవుతున్న ఆటంకాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆంధ్రజ్యోతి తరపున రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు కానీ ఆయనకు మాట్లాడే అవకాశం దక్కలేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధకృష్ణ తన పత్రికలో రాసుకున్న కథనం మాత్రం విశేషంగా మారింది. విస్తృత స్థాయిలో చర్చకు ఆస్కారం ఇచ్చింది. ముఖ్యంగా సదరు కాన్ఫరెన్స్ పూర్తి అయినా తరువాత రాత్రి 8:40కి నేరుగా ప్రధాని మోడీ తనకు ఫోన్ చేసినట్టు ఆయన పత్రిక ప్రధాన సంచికలో కథనం రాసుకున్నారు.కాన్ఫరెన్స్ లో ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం రాలేదని అందుకే మీకు ఫోన్ చేశానని ,మీ సలహాలు చెప్పండని మోడీ రాధాకృష్ణను అడిగినట్లు ఆంధ్రజ్యోతి వార్త రాసింది.
వాస్తవానికి ఎంపిక చేసిన మీడియా సంస్థలతో ప్రధాని నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఆంధ్రజ్యోతి ఎండీ మాత్రం కాన్ఫరెన్స్ తనకు మోడీ ప్రత్యేకంగా ఫోన్ చేసినట్టు పేర్కొనడం ఆశ్చర్యానికి గురిచేసింది.. గతంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన సమయంలో కూడా తనను ఆహ్వానించి, తనతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు వార్తలు వండి వార్చుకున్న రాధాకృష్ణ ఈసారి నేరుగా ప్రధానే తనకు ఫోన్ చేయునట్లు చెప్పుకోవడమే పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. అప్పటికే ముందు రోజు ప్రదానితో ముచ్చటించిన సాక్షి గానీ, మరునాడు సమావేశమైన ఈనాడు గానీ రాసుకొని రీతిలో ఆంధ్రజ్యోతి ఆర్భాటాలకు పోవడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.