iDreamPost
iDreamPost
గోదావరి నదికి వరద నెమ్మదిగానే పెరుగుతోంది. కానీ ఉభయ గోదావరి జిల్లాలోని పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలను పెంచుతోంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భద్రాచలం, ధవళేశ్వరంలలో రెండు అడుగల మేర గోదావరినది నీటిమట్టం పెరిగింది.
నెమ్మదిస్తుందన్న అంచనాలు వేసినప్పటికీ తాలిపేరు నుంచి వచ్చిపడ్డ ముంపు నీరు ఒక వైపు, శబరి, ఇంద్రావది నదులకు వచ్చిన వరద మరోవైపు గోదావరి నీటిమట్టం పెంపునకు దోహదపడుతున్నాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి మరింతగా ముంపునీరు వస్తుందన్న అంచనాలున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కూడా కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరింది. దీంతో కేచ్‌మెంట్ ఏరియా ద్వారా వచ్చిపడే నీరు, ఉపనదుల నుంచి చేరే నీటితో గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.
20, 21 తేదీల్లో గోదావరి ప్రవాహాన్ని పరిశీలిస్తే నెమ్మదిగానే వరద ప్రవాహం పెరుగుతోంది. 20న ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద 51.30 అడుగులు ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 51.70కు చేరింది. 21వ తేదీ ఉదయం 8 గంటలకు 54.30 అడుగులకు వచ్చింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందని భావించారు. అయితే అనూహ్యంగా రాత్రికి నీటిమట్టం పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది.
అలాగే ధవళేశ్వరం వద్ద 20వ తేదీన ఉదయం 7 గంటలకు 14.50 అడుగుల నీటిమట్టం నమోదవ్వగా 14,03,717 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసారు. 21వ తేదీ ఉదయం 9 గంటలకు 16.30 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 16,68,431 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి వచ్చి చేరు ముంపునీరు ఆలస్యం కావడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నదీగర్భంలోని వరదనీరు నెమ్మదిగా సముద్రం వైపు కదిలింది. దీంతో ఇప్పుడు ఎగువ నుంచి భారీగానే వదర వస్తున్నప్పటికీ ధవళేశ్వరం వద్ద నెమ్మదిగానే నీటిమట్టం పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. భద్రాచలం నుంచి ధవళేశ్వరంకు వరద నీరు చేరడానికి 18–20 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. ఇది నీటి ప్రవాహ వేగాన్ని బట్టి మారుతు ఉంటుంది. ప్రస్తుతం ప్రవాహ వేగం నెమ్మదించిన నేపథ్యంలో కొంచెం ఆలస్యంగానే ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు ఎగువన ఉన్న వరద వస్తుందని అంచనా వేస్తున్నారు.
20వ తేదీ ఉదయం 6 గంటలకు నీటిమట్టాలు..
– గోదావరి భద్రాచలం 51.30 అడుగులు (రాత్రి 7 గంటలకు 51.70కు చేరింది)
– కూనవరం వద్ద 20.46 మీటర్లు
– శబరి నది కూనవరం వద్ద 14.97 మీటర్లు,
– తాళ్ళగూడెం వద్ద 14.80 మీటర్లు నమోదైంది.
– ధవళేశ్వరం వద్ద 7 గంటలకు 14.50 అడగులు ఉండి 14,03,717 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. (ఇంకా తగ్గుతుందని అంచనా వేసారు. కానీ పెరిగుతూ పోయింది)
21వ తేదీన ఉదయం 9గంటలకు నీటి మట్టాలు…
గోదావరి నది భద్రాచలం వద్ద 54.30 అడుగులకు చేరింది (మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు.)
– కూనవరం వద్ద 22.54 మీటర్ల నీటి మట్టం నమోదైంది.
– అలాగే శబరి నది కుంట వద్ద 15.58 మీటర్లు
– తాళ్ళగూడెం వద్ద 16.20 మీటర్లు
– ధవళేశ్వరం వద్ద 16.30 అడుగులకు చేరింది (రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది). బ్యారేజీ వద్ద నుంచి 16, 68,431 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరింత పెరుగుతుందన్న అంచనాలున్నాయి.
21 ఉదయం 6 గంటలకు పలు చోట్ల గోదావరి నది నీటి మట్టాలు ఇలా ఉన్నాయి..
– కాళేశ్వరం వద్ద 10.220
– పేరూరు వద్ద 14.080
– దుమ్ముగూడెం 14.980
– భద్రాచలం 54.00అడుగులు
– కూనవరం వద్ద 22.230 మీటర్లు
– కుంట 15.620 మీటర్లు
–కాఫర్ డామ్ వద్ద 28.620 మీటర్లు
– పోలవరం వద్ద 14.600 మీటర్లు
– రాజమహేంద్రవరం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 17.530 మీటర్లు
– ధవళేశ్వరం వద్ద 15.80 అడుగులు
15,97,981 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.