iDreamPost
android-app
ios-app

మధ్యప్రదేశ్ బీజేపీలో అసమ్మతి గళం

మధ్యప్రదేశ్ బీజేపీలో అసమ్మతి గళం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం నాడు 28 మంది కొత్త మంత్రులతో తన మంత్రివర్గాన్ని విస్తరించారు.వారిలో డజను మంది జ్యోతిరాదిత్య సింధియా విధేయులు ఉండడంతో అధికార బిజెపిలో అసంతృప్తి జ్వాలను రగిలించింది.

తాజాగా జరిగిన మధ్య ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి బిజెపి సీనియర్ నాయకురాలు ఉమా భారతి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.1992 నాటి బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితురాలైన ఆమె తన స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి లక్నోలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణాల సమతుల్యత పాటించలేదని ఆమె బాధ పడ్డారు.జ్యోతిరాదిత్య సింధియా తన సహచరులతో కలిసి బిజెపికి మారారని,కాంగ్రెస్ నాశనమైందని నేను సంతోషిస్తున్నాను.కాని కేబినెట్ ఏర్పాటులో నా సూచనలను పెడచెవిన పెట్టడం నా మద్దతుదారుల అందరికీ అవమానంగా ఉంది.ఈ జాబితాను సవరించడానికి నేను వినయ్ సహస్రబుద్ధే,సుహాస్ భగత్,వి.డి.శర్మలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.అలాగే పార్టీ అభివృద్ధికి మొదటినుంచి కష్టపడ్డ తమను కేంద్ర నాయకత్వం పూర్తిగా విస్మరించిందని పలువురు సీనియర్ బిజెపి నాయకులు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు.

గురువారం రాజ్‌భవన్‌లో యాక్టింగ్ గవర్నర్ ఆనందిబెన్‌ పటేల్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.దీంతో చౌహాన్‌ కేబినెట్‌లోమొత్తం మంత్రుల సంఖ్య 34 మందికి చేరుకుంది.వీరిలో 26 మంది క్యాబినెట్ మంత్రులు కాగా 8 మంది సహాయక మంత్రులుగా ఉన్నారు.

కాగా 34 మంది గల చౌహాన్ మంత్రివర్గంలో బిజెపి సీనియర్ నేత కైలాష్ విజయ వర్గియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు.అలాగే మాజీ సీఎం ఉమా భారతికి వర్గానికి కూడా మొండిచేయి దక్కింది. ఇక మధ్యప్రదేశ్‌లో 12 మంది ఎమ్మెల్యేలు కానీ వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.వీరంతా సింధియా వర్గానికి చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇటీవల తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడం,ఇద్దరు ఎమ్మెల్యేల మరణంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో 24 సీట్లు ఖాళీగా ఉన్నాయి.త్వరలోనే ఈ సీట్ల భర్తీ కోసం ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఒకవేళ ఉప ఎన్నికలలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే తిరిగి ఆ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది.ఇలాంటి విపత్తు పొంచి ఉండటంతో బిజెపి అధిష్టానం జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి మంత్రివర్గంలో పెద్దపీట వేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే పదవులు దక్కని బిజెపి ఎమ్మెల్యేలు క్యాబినెట్ విస్తరణ తొలిరోజే అసమ్మతి రాగం అందుకోవడంతో రాబోయే రోజులలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.