iDreamPost
iDreamPost
నిన్న బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి లేకపోయినా ఉన్నంతలో కంటెంట్ నే నమ్ముకుని వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి లవ్ టుడే కాగా రెండోది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నాంది, మహర్షి నుంచి పూర్తిగా సీరియస్ టర్న్ తీసుకున్న అల్లరి నరేష్ ట్రై చేసిన మరో సోషల్ మెసేజ్ సబ్జెక్టు ఇది. ప్రమోషన్ల టైం నుంచే ఇందులో కాన్సెప్ట్ ఏంటో దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. సందేశం ఉన్నప్పటికీ కమర్షియల్ చిత్రంలో ఉండాల్సిన అన్ని హంగులు కామెడీతో సహా జొప్పించామని హామీ ఇచ్చారు. మాస్ ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ కాలేని ఈ మారేడుమిల్లి ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
తెలుగు టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేసే శ్రీపాద శ్రీనివాస్(అల్లరి నరేష్)అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. సమాజానికి ఏదో మంచి చేయాలనే తపన నలుగురికి సహాయం చేసే తత్వం. ఎన్నికల విధుల్లో భాగంగా మారుమూల ఉండే మారేడుమిల్లికి డ్యూటీ కోసమని తన టీమ్ తో కలిసి వెళ్తాడు శ్రీనివాస్. కనీస సౌకర్యాలు లేని ఆ గిరిజన గ్రామంలో ప్రజల అవస్థలు చూసి చలించిపోతాడు. తనవల్లే ఓటు హక్కు వద్దనుకున్న తండావాసులు ఎలక్షన్లలో పాల్గొంటారు. బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్తున్న క్రమంలో శ్రీనివాస్ కిడ్నాప్ కు గురవుతాడు. తర్వాత ఏమైంది, ఆ ప్రజానీకం గోడును ప్రభుత్వం చెవిన వేసుకుందా, చివరికి ఏమయ్యిందో తెరమీద చూడాలి.
అల్లరి నరేష్ కు మరో మంచి పాత్ర దక్కింది. తనవరకు చక్కని పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే దర్శకుడు ఏఆర్ మోహన్ తీసుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ దాని ఎంగేజింగ్ గా చూపించడంలో తడబడ్డారు. దీంతో కథనం కొంత సాగతీతకు గురైన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా శ్రీనివాస్ పాత్ర తాలూకు కాన్ఫ్లిక్ట్ ని సెకండ్ హాఫ్ లో డీల్ చేసిన తీరు ఆసక్తికరంగా లేకపోవడంతో భావోద్వేగాలు బాలన్స్ కాని సీన్లతో ఎగుడుదిగుడుగా సాగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. కానీ సినిమా మొత్తం నిలబెట్టడానికి అవి సరిపోలేదు. ఫైనల్ గా ఒక మంచి ప్రయత్నంగా నిలిచిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కమర్షియల్ స్కేల్ లో గెలవడం డౌటే