iDreamPost
android-app
ios-app

గజ్వేల్లో కాంగ్రెస్‌.. నిర్మల్లో బీజేపీ.. గులాబీపైనే గురి!

గజ్వేల్లో కాంగ్రెస్‌.. నిర్మల్లో బీజేపీ.. గులాబీపైనే గురి!

తెలంగాణలో రాజకీయాలు మంచి రంజుగా కొనసాగుతున్నాయి. పాదయాత్రలు, సభలు, సమావేశాలతో ఎప్పుడూ కాక మీద ఉంటున్నాయి. తాజాగా శుక్రవారం ఒకే రోజు బీజేపీ, కాంగ్రెస్‌ భారీ సభలు ఏర్పాటు చేయడం.. గులాబీ కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు చేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ సభల్లో ఆయా పార్టీల నేతల వ్యాఖ్యలను గమనిస్తే కాంగ్రెస్‌, బీజేపీ.. దారులు వేరైనా, లక్ష్యం ఒక్కటే అన్నట్లుగా స్పష్టమైంది. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ ఓ వైపు మాటలు తగ్గించి చేతల్లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మరింత బలపడడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, రాజకీయ బలహీనతలను ఎండగట్టడానికి ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధ్యేయంతో వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. యాదృచ్ఛికమే అయినప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీలు శుక్రవారం భారీ సభలు నిర్వహించాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కాంగ్రెస్‌ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించింది. బీజేపీ నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ తలపెట్టింది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో కమలనాథులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా హాజరయ్యారు.

Also Read : మాజీ పోలీస్ పటేల్ కు రాష్ట్ర స్థాయి పదవి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరైన సభ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సభకు వేలాది మంది హాజరుకావడం, యువకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నేతలు ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఇక అమిత్‌ షా తన ప్రసంగం ద్వారా కేసీఆర్‌ సర్కార్‌పైన, మజ్లిస్‌పైన రాజకీయ తూటాలు పేల్చారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగనివ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఆ తరువాత ఆ ఊసే ఎత్తకుండా రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన కోసం పోరాడి ప్రాణాలు బలిదానం చేసిన యోధులను విస్మరించినందుకు ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కారు కేసీఆర్‌ది అయితే.. స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్‌ కర్రల సాయంతో నడిచే కుంటి సర్కారు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని రాష్ట్రమంతటా అధికారికంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానాలు చేసుకున్న యువకుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాన్ని సైతం ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటినుంచి విముక్తి చేసేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని అమిత్‌ షా తెలిపారు. సంజయ్‌ పాదయాత్రతో ముఖ్యమంత్రి కేసీఆర్‌లో వణుకు మొదలైందన్నారు.

Also Read : తమ్మినేని వీరభద్రం ఏం చేస్తున్నారు..?

మరోవైపు గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ధర్మయుద్ధం ప్రకటించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలను మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట అని ఆరోపించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని నిలదీశారు. మద్యంతో ఆదాయం పెంచాలనే ఆలోచనతో పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు, ఘోరాలతోపాటు కలహాలకు ఈ మద్యం కారణమవుతోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.10 వేల కోట్లున్న మద్యం ఆదాయాన్ని తెలంగాణలో రూ.36 వేల కోట్లకు పెంచారని, పరిపాలనను పక్కనబెట్టి ఆదాయం కోసం ఎగబడుతున్నారని ఆరోపించారు. ఇలా రెండు సభల్లోనూ కేసీఆర్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌, బీజేపీ నేతల ప్రసంగాలు సాగాయి.