Idream media
Idream media
ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్రతో టీ.కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హై కమాండ్ అనుమతి లేకుండా ఎలా పాదయాత్ర చేస్తారంటూ కొందరు సీనియర్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అంతేకాదు, పాదయాత్ర ముగింపు సభకు వెళ్లకూడదంటూ అంతర్లీనంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పాదయాత్ర తో కాంగ్రెస్ లోని వర్గ విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా పీసీసీ పీఠం కోసం పలువురు సీనియర్లతో పాటు రేవంత్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ దశలో ఆయనకే పీఠం అన్న వార్తలు కూడా వచ్చాయి. అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా జీవన్ రెడ్డి ఖరారయ్యారని, నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడనుందని గత నెలలో ప్రచారం జరిగింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు ప్రకటన వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తో పాటు కొంత మంది సీనియర్లు విజ్ఞప్తి చేయడంతో అది ఆగిందని తెలిసింది. ఇదే అదునుగా రేవంత్ పార్టీలో మరింత పట్టు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీ మారడం వెనుక రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాదయాత్ర అనంతరం టీ.కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రేవంత్ కు ప్రధాన అనుచరుడిగా కూనకు పేరుంది. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ గెలుపులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కూడా కీలకంగా వ్యవహరించింది. అందుకు కారణం శ్రీశైలం గౌడే. ఇటీవల జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా కూన, రేవంత్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సృష్టించిన హంగామా తెలిసిందే. అలాగే రేవంత్ ను పీసీసీ చీఫ్ ను చేయాలని కూన శ్రీశైలం గౌడ్ పలు మార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ వీడడం వెనుక రేవంత్ ప్రోత్సాహం ఉందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తనకి పార్టీ పగ్గాలు అప్పగించకుండా సీనియర్లు అడుగడుగునా అడ్డుపడుతుండటం, అధిష్టానం సైతం ఆలస్యం చేస్తుండటంతో.. కాంగ్రెస్ కు కాస్త ఝలక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావించి తన ప్రధాన అనుచరుడు, గ్రేటర్ లో కీలక నాయకుడైన కూన శ్రీశైలం గౌడ్ ను బీజేపీలోకి పంపించి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. తక్షణం తగిన నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు మరింత మంది నేతలు కాంగ్రెస్ ను వీడనం ఖాయమనే మెసేజ్ ను కూన ఎపిసోడ్ ద్వారా హై కమాండ్ కు పంపించేలా రేవంత్ మొదటి పావు కదిపారని చెబుతున్నారు.
సీనియర్లు వ్యతిరేకంగా ఉన్నా.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి కేడర్ అంతా రేవంత్ రెడ్డికి మద్దతుదారులుగా ఉన్నట్లు పాదయాత్ర ముగింపు సభ ద్వారా తేలింది. వారందరికీ రేవంత్ రెడ్డే ఆశాకిరణం. ఇంకా సూటిగా చెప్పాలంటే.. రేవంత్ రెడ్డి ఉన్నారనే ఇంకా అనేక మంది లీడర్లు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయినా.. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం వెనుకా ముందు ఆడుతోంది. ఇది రేవంత్ రెడ్డిని అసహనానికి గురి చేస్తోందట. మరీ మెతకగా ఉంటే పని కాదని.. హైకమాండ్ కు ఓ షాక్ ఇవ్వాలని శ్రీశైలం గౌడ్ ను బీజేపీలోకి రేవంత్ రెడ్డే పంపించారని టాక్. అయినా, కోరుకున్న పార్టీ పదవి దక్కకపోతే.. చివరాఖరికి రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ ను వీడి కాషాయం కండువా కప్పుకుంటారనేది ఆయన అనుచరుల మాట.
ఇదిలా ఉండగా 2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అశించిన కూన శ్రీశైలానికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచే పార్టీ పట్ల కొంత అసంతృప్తితోనే ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కూన ఇప్పటి వరకూ టీపీసీసీ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోతోందని కూన ఆరోపించారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి బీజేపీనే సరైందనే భావనతో పార్టీ మారినట్టు శ్రీశైలం చెబుతున్నారు.