Idream media
Idream media
ఏ పార్టీలో ఉన్నా.. మల్కాగ్‌గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే. రాజకీయ ఆవిర్భావం నుంచి టీడీపీలో, చంద్రబాబు డైరెక్షన్‌లో నడిచారు రేవంత్ రెడ్డి. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకూ ఆ పార్టీలో పని చేసిన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో అక్కడక్కడా చంద్రబాబు వాసనలు కనిపిస్తుండడంలో ఆశ్చర్యం లేదు. దేశంలో ఒక్క చంద్రబాబుకే సొంతమైన .. నేనే.. నా వల్లే.. అనే క్రెడిట్ హైజాకింగ్ మాటలు రేవంత్ రెడ్డి అందిపుచ్చుకోవడం ఇక్కడ విశేషం.
కిషన్ రెడ్డికి ప్రమోషన్ రేవంత్ వల్లేనట..
తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. ఆయన్ను కేబినెట్ మంత్రిగా ప్రమోట్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో కిషన్ రెడ్డి బాధ్యలు స్వీకరించారు. అయితే కిషన్ రెడ్డికి తన వల్లే ప్రమోషన్ వచ్చిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. బలమైన నాయకుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండడం వల్లే.. బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాను పీసీసీ అధ్యక్షుడ్ని కావడంతో.. రెండో స్థానం కోసం బీజేపీ పోరాడాల్సి వస్తుందని, తనను ఎదుర్కొనేందుకు కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారనేది రేవంత్ రెడ్డి భావన కాబోలు.
బాబుకు దారిలో..
రాజకీయాల్లో నేతలను అనుచరులు, సహచరులు పొగడ్తలతో ముంచెత్తడం సహజం. నేతలు చేసిన పనిని, చేయని పని కూడా తమ నేత చేశారని అనుచరులు చెబుతుంటారు. కానీ చంద్రబాబు తీరు ఇందుకు పూర్తి భిన్నం. తాను చేయని పనులను కూడా తానే చేశానని తనకు తానే చెప్పుకోవడంలో చంద్రబాబుకు పోటీ ఎవరూ లేరు. హైదరాబాద్‌ను కట్టానని, డ్వాక్రా సంఘాలను కనిపెట్టానని, ఐటీని దేశానికి తెచ్చానని, సెల్‌ఫోన్ కనిపెట్టానని, బేగంపేట విమానాశ్రయం నిర్మించానని, నదుల అనుసంధానం చేశానని, సత్యనాదేళ్ల రాణించేందుకు తానే స్ఫూర్తి అని.. ఇలా చెప్పుకుంటూ పోతే.. బాబు ఖాతాలో బోలెడు ఉన్నాయి. ఆయన వారసత్వాన్ని కొనసాగించేలా.. బాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి.. ఆ దారిలో నడుస్తున్నారని తాజాగా కిషన్‌రెడ్డి మంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
Also Read : రేవంత్ దూకుడు : జడ్పీటీసీ నుంచి టీపీసీసీ వరకు..