Idream media
Idream media
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మరింత రంజుగా మారాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీని వీడతారో తెలియని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఊసే లేని కాంగ్రెస్ పార్టీకి కూడా కాస్త ఊపొచ్చింది. కొన్నేళ్లుగా ఎప్పుడూ పార్టీని వదిలి వెళ్లేవారే తప్పా, వచ్చే వారే లేని కాంగ్రెస్ లోకి వలస వస్తున్నారు. నూతన టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇచ్చిన భరోసా, మారిన రాజకీయ సమీకరణాలతో పాత వాళ్లు ఇటువైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఇక్కడి బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ కు జై కొట్టారు. ఈ ఉత్సాహంతో రేవంత్ రెడ్డి అక్కడి యువజన సంఘాలు, ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలపై దృష్టి పెట్టారు. దీంతో మిగిలిన పార్టీలు కూడా పాలమూరుపై పట్టు సాధించేందుకు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం అక్కడ అధికార పార్టీకి తిరుగులేదు.
2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీకి తిరుగులేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 14 ఎమ్మెల్యే స్థానాలకు గాను 13 స్థానాలు టీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఒక్క స్థానంలో గెలిచిన కాంగ్రెస్.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ని కూడా 2019 సంవత్సర ప్రారంభంలోనే కారెక్కించుకుంది. దీంతో గులాబీ పార్టీ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. సీట్లు సాధించలేకపోయినా బీజేపీ కొంత సంస్థాగతంగా బలోపేతం అయింది. టీడీపీ దాదాపు కనుమరుగైంది. మొత్తమ్మీద ఉమ్మడి జిల్లా రాజకీయం గులాబీ నేతల చేతిలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. కేంద్రంలో ఎన్నో పదవులు విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ మేధావి జైపాల్‌రెడ్డి కన్నుమూయడం కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో తీరని లోటుగా పరిణమించింది. వరుస ఓటములతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బేలగా మారింది. అయినప్పటికీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 70 శాతం స్థానాల్లో కాంగ్రెస్సే పోటీ ఇచ్చింది.
టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి స్థానికంగా కాంగ్రెస్ కు ఉన్న ఆశావాహ వాతావరణాన్ని అనుకూలంగా మార్చడంలో కొంత సక్సెస్ అయ్యారు. కొత్త సమీకరణలకు తెర తీశారు. బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీల్లోని క్రియాశీలక, పట్టున్న నాయకులను గుర్తించి, వారిని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్టున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లోనూ అసంతృప్తితో, ఎదగలేకపోతున్నామనే భావనతో ఉన్న కీలక నాయకులకు కూడా గుర్తించి పార్టీలోకి రమ్మని పిలుపునిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక క్రియాశీలక నాయకుడు ఇటీవల కర్ణాటకలోని రాయచూరు వెళ్లి మరీ తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జిగా ఉన్న బోసురాజుని కలిసినట్లు సమాచారం. ఈయన రేవంత్‌రెడ్డి నుంచే కాకుండా, పార్టీ అధిష్ఠానం నుంచి తమ రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సన్నద్ధత చూపినట్లు తెలిసింది.
Also Read : నాడు తండ్రి కోసం తెరాస నేడు రేవంత్ కోసం కాంగ్రెస్ అంటున్న డి.శ్రీనివాస్ కొడుకు
బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించిన మరాఠా చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్) ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. తన సోదరుడు దివంగత ఎర్ర సత్యం మరణానంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన శేఖర్, తొలుత టీడీపీ నుంచి 1995లో జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లోనూ గెలుపొంది, 2004, 2008 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో తిరిగి టీడీపీ నుంచి గెలుపొందారు. 2014లో జడ్చర్ల నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా (టీడీపీ) పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో బీజేపీలో చేరారు. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
అయితే, ఆ పార్టీలో చేరినప్పటి నుంచి శేఖర్‌కు పొసగని పరిస్థితి ఏర్పడింది. సంజయ్ జిల్లా పర్యటన సందర్భంగా తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంతో రాజీనామా ప్రకటించినా, ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకులు సర్ది చెప్పడంతో రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పార్టీలో కొనసాగుతున్నా, క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షులవడం, గతంలో టీడీపీలో కొనసాగిన సమయంలో ఇద్దరి మధ్య సత్సంబంధాలుండటం వంటి కారణాలతో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
దీంతో బీజేపీ నాయకత్వం మరో నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు చకచకా పావులు కదుపుతోంది. ఎర్ర శేఖర్ రాజీనామాతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహపడకుండా ఉండేందుకు బండి సంజయ్ వెంటనే రంగంలోకి దిగారు. ద్వితీయ శ్రేణి నేతలతో చర్చించి పాదయాత్ర సందర్భంగా ఇక్కడకు వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం పాలమూరుపై ఉన్న పట్టు కొనసాగేలా స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడి రాజకీయాలపై చర్చిస్తోంది. ఇలా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలమూరుపై పట్టుకోల్పోకుండా అధికార పార్టీ, పట్టు సాధించేందుకు విపక్షాలు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read : రేవంత్ పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పొగడ్తల వర్షం.. సొంత గూటికి చేరడం ఖాయమేనా..?