iDreamPost
android-app
ios-app

రేవంత్ లో ఇంత మార్పా…?కేసిఆర్ మీద కోపమా? మోడీ మీద ప్రేమనా?

రేవంత్ లో ఇంత మార్పా…?కేసిఆర్ మీద కోపమా? మోడీ మీద ప్రేమనా?

రేవంత్ రెడ్డి రాజకీయం అంటే చాలామందికి కళ్ళ ముందు కనపడేది… ఆయన తిట్టే బూతులు. సిఎం కేసీఆర్ ను వయసు తో సంబంధం లేకుండా ఎలా పడితే అలా విమర్శిస్తూ ఉంటారు. దీన్ని హీరోయిజం గా భావిస్తారు రేవంత్ అభిమానులు. టీడీపీలో ఉన్నప్పుడు అయినా, కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే రాజకీయం అంటే బూతులే అని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి.

కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి… కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏకపాత్రాభినయం చేశారు అని ఆయన ఎద్దేవా చేశారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారన్న రేవంత్… విభజనచట్టం అంశాలు,కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్ ,రైల్వే లైన్లు,జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదు అని ఆరోపించారు. మోడీ పై యుద్ధం ప్రకటిస్తారని ఆశించామని కాని నిర్మలా సీతారామన్,మోడీ గురించి నీచంగా,జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు.

రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడారని మండిపడ్డారు. భూస్వాములు,అగ్రవర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా దళితులు,బలహీన వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం మార్చాలన్నది బిజెపి కుట్ర…బిజెపి కుట్రకు కేసీఆర్ వంత పాడారని ఆరోపణలు చేశారు. రాజ్యాంగం రద్దు చేయాలని బిజెపి ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదకి తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారని ఆరోపణలు గుప్పించారు. అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీభవన్ లో నిరసన దీక్షలు ఉంటాయన్నారు. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకోకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కోస్తారు అని హెచ్చరించారు.

యూపీలో బిజెపిని గెలిపించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు అని కేసీఆర్ అసదుద్దీన్ ఒవైసి సుపారి గ్యాంగ్ అంటూ ఆరోపణలు చేశారు.యూపీ ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించడానికి సుపారి తీసుకున్నారని ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుంది అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారని కేసీఆర్ భాషను ఖండిస్తున్నామని సిద్ధాంత పరంగా బిజెపిని వ్యతిరేకిస్తాం ..కానీ కేసీఆర్ భాషను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏం కావాలని నిలదీశారు. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి అని కేసీఆర్ భాషను సభ్యసమాజం క్షమించదు అన్నారు. గతంలో రేవంత్… బిజెపి నేత డీకే అరుణ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబం గురించి కూడా ఆయన నీచంగా మాట్లాడారు. అలాంటి రేవంత్ ఇప్పుడు కేసీఆర్ ప్రసంగంపై ఈ తరహా కామెంట్స్ చేయడం ఆశ్చర్యపరిచింది.

Also Read : కేంద్ర బడ్జెట్ పై ఎందుకు అసంతృప్తి, ఏపీ ఆర్థికమంత్రి ఏమన్నారో తెలుసా