iDreamPost
android-app
ios-app

రేవంత్ ను వెంటాడుతున్న కోవ‌ర్టుల భ‌యం

రేవంత్ ను వెంటాడుతున్న కోవ‌ర్టుల భ‌యం

టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన ఉత్సాహంతో ఉన్న రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ ఓ షాక్ ఇచ్చింద‌ని చెప్పొచ్చు. అప్ప‌టి నుంచీ చాలా సంద‌ర్భాల్లో కాంగ్రెస్ లో ఇంకా కౌశిక్ రెడ్డిలు ఉన్నార‌ని రేవంతే స్వ‌యంగా చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా న‌గ‌రానికి రేవంత్ వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌ను క‌లిసిన వారిలో నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయ‌న‌ను క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత తాను ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించుకున్నాడు కూడా. ఆ సీన్ క‌ట్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. మొత్తంగా కౌశిక్ టీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నాడ‌న్న నిజం ఆడియో వైర‌ల్ కావ‌డం రుజువైంది. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి బ‌హిరంగంగానే కాంగ్రెస్ పైనా, రేవంత్ పైన ప‌దునైన వ్యాఖ్య‌లు చేశారు కౌశిక్. అయితే, అంత‌టితో ఆయ‌న ఎపిసోడ్ ముగిసిన‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డిని మాత్రం కోవ‌ర్టుల భ‌యం వెంటాడుతూనే ఉంది.

కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రు ఎప్పుడైనా, ఏదైనా మాట్లాడేస్తారు. ఫ‌లానే వాళ్లే మాట్లాడాలి.. వారే ప్ర‌శ్నించాలి, వారే స‌మాధానం చెప్పాలి అన్న సాంప్ర‌దాయం సాధార‌ణంగా ఆ పార్టీలో ఉండ‌దు. దాన్నే స్వేచ్ఛ క‌లిగిన పార్టీగా చెప్పుకుంటారు. దీనికి తోడు రేవంత్ రెడ్డి రాక ముందే దిగ్గ‌జ నేత‌లు కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రధాన నేతలంతా రేవంత్ క‌న్నా సీనియర్లే. పార్టీకి ఒక విధానం అన్నదే లేకుండా.. నేతలు ఎవరి ఇష్టానికి వారు మాట్లాడే సాంప్రదాయం ఉన్న కాంగ్రెస్ లో వీరు రేవంత్ మాట వింటారా? పార్టీలో ఉన్న నేతలపైనే ప‌లువురు విమర్శలు గుప్పిస్తుంటారు. ఎంతో కాలంగా సాగుతున్న ఈ వ్యవహారం.. పార్టీని భ్రష్టుపట్టిందని అంటారు. ఓ పద్ధతీపాడు అనేది లేకుండా ఎవరి ఇష్టానికి వారు గ్రూపులు నడుపుతూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినిపోవడానికి ఇది కూడా మరో ప్రధాన కారణంగా చెబుతారు.

అయితే.. రేవంత్ ఆ ప‌ద్ధ‌తిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా ఎక్క‌డో చోట విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతూనే ఉన్నాయి. అంద‌రినీ క‌లుపుకుంటూ ఇప్ప‌టి వ‌ర‌కూ సావ‌ధానంగా ఉన్న రేవంత్ కౌశిక్ రెడ్డి ఉదంతం తర్వాత ఘాటు హెచ్చరికలు చేయ‌డం మొద‌లు పెట్టారు. అమ్ముడు పోయేవారు ఉంటే ఇప్పుడే వెళ్లిపోవాలని ఇంకా పార్టీలో ఉండి ఇతరుల కోసం పనిచేస్తే.. చూస్తూ ఊరుకోబోమని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా కౌశిక్ త‌ర‌హా లో కాంగ్రెస్ ఇంకా ఎవ‌రైనా కోవ‌ర్టులు ఉన్నారా అనేది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పార్టీని గాడిలో పెట్టాలంటే.. కోవర్టులను వెలికితీసి సాగనంపాల్సిందేనని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక టీమ్ ను తయారు చేసుకొని అనుమానం ఉన్నవారిపై నిఘా పెట్టించినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ మీడియా ముందు ఒక విధంగా అంతర్గతంగా మరోవిధంగా వ్యవహరించొద్దని కూడా తొలి మీటింగ్ లోనే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇదేమాటకు కట్టుబడి అందరూ పద్ధతిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అప్పుడే పార్టీని బలోపేతం చేసుకోవడం సాధ్యమవుతుందని రేవంత్ భావిస్తున్నారట. దీన్ని నేతలకు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు రేవంత్. ఎక్కడ సమావేశంలో మాట్లాడిన కోవర్టుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ కోసం పనిచేసిన కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని ఉదహరిస్తున్నారు. మరి ఈ కోవర్టుల ఏరివేత కార్యక్రమం ఏ మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.